Site icon HashtagU Telugu

Kapu Reservation : టీడీపీ, జ‌న‌సేన `పొత్తు`పోటు, కాపు సేన అధిప‌తి ఎత్తుగ‌డ?

Kapu Reservation

Hari Rama Jogaiah

జ‌న‌సేన‌, టీడీపీ పొత్తును ప‌లు అంశాల‌తో ప్ర‌త్య‌ర్థులు ముడిపెడుతున్నారు. ఇటీవ‌ల ఏర్ప‌డిన కాపు సేన ( Kapu Reservation) అందుకు కేంద్ర‌బిందువుగా మారింది. కాపుసేన‌కు మాజీ ఎంపీ హ‌రిరామ‌జోగ‌య్య(Jogaiah) నాయ‌క‌త్వం వ‌హించ‌డంతో మ‌రింత చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగారు. బీసీలుగా కాపుల‌ను గుర్తించాల‌ని ఆయ‌న డిమాండ్‌. గ‌తంలో ఇదే డిమాండ్ ను కాపుజాతి నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వినిపించారు. ర‌త్నాచ‌ల్ ఎక్స్ ప్రెస్ ను త‌గుల‌బెట్టే వ‌ర‌కు ఉద్య‌మాన్ని తీసుకెళ్లిన విష‌యం విదిత‌మే. ఆయ‌న ఉద్య‌మానికి కొన‌సాగింపుగా కాపుసేన‌కు అధిప‌తిగా హ‌రిరామజోగ‌య్య నిల‌బ‌డ్డారు. టీడీపీ, జ‌న‌సేన పొత్తు అంశానికి రిజ‌ర్వేష‌న్ల‌ను ముడిపెడుతున్నారు.

ఇటీవ‌ల ఏర్ప‌డిన కాపు సేన ( Kapu Reservation)

ప్ర‌ధాని మోడీ 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చిన 10శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో 5శాతం కాపుల‌కు(Kapu Reservation) ఇస్తాన‌ని చంద్ర‌బాబు ఆనాడు ప్ర‌క‌టించారు. అంతేకాదు, కాపుల‌ను బీసీలుగా గుర్తిస్తూ బిల్లును అసెంబ్లీలో పెట్ట‌డం ద్వారా కాపుల‌ ప‌క్షాన నిలిచారు. ఇప్పుడు ఆ బిల్లు చెల్లుతుంద‌ని కేంద్రం చెబుతోంది. ఇదే అంశాన్ని హ‌రిరామ‌జోగయ్య ప్ర‌స్తావిస్తూ కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లను తేల్చాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనూ ఇటీవ‌ల దీక్ష సంద‌ర్భంగా జోగ‌య్య (Jogaiah) సంప్ర‌దింపులు జ‌రిపారు. ఆయ‌న హామీతోనే జోగ‌య్య దీక్ష‌ను తాత్కాలికంగా విర‌మించిన‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే, రాజ‌కీయ పొత్తుల‌తో రిజ‌ర్వేష‌న్ల‌ను ముడిపెట్టారు. రిజ‌ర్వేష‌న్ల‌కు టీడీపీ అంగీక‌రిస్తేనే పొత్తుల‌కు వెళ‌తామ‌ని ప‌వ‌న్ ఆనాడు జోగ‌య్య‌కు హామీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

Also Read : Kapu Reservations: కాపు రిజర్వేషన్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. ఏపీ సర్కార్‌కు తీపి కబురు!

కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం ఉద్య‌మిస్తోన్న ముద్ర‌గ‌డ‌, హ‌రిరామ‌జోగ‌య్య తొలి నుంచి వైఎస్ కుటుంబానికి స‌న్నిహితులు. ఆ ప‌రంప‌ర ఇప్పుడూ కొన‌సాగుతోంది. అందుకే, సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఉద్య‌మాన్ని ముద్ర‌గ‌డ కింద‌ప‌డేశారు. ఇప్పుడు హ‌రిరామజోగ‌య్య తెర మీద‌కు వ‌చ్చారు. ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగిన ఆయ‌న వెంట‌నే విర‌మిస్తూ రిజ‌ర్వేష‌న్ల‌ను పొత్తుల‌తో ముడిపెట్టారు. అంటే, తెలుగుదేశం పార్టీని మ‌రోసారి దెబ్బ‌తీయ‌డానికి కాపు రిజ‌ర్వేష‌న్ల గేమ్ ప్రారంభం అయింద‌న్న‌మాట‌. వాస్తవంగా అగ్ర‌వ‌ర్ణ పేద‌లకు మోడి ఇచ్చిన 10శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను కాపుల‌కు ఇవ్వ‌డానికి ఎవ‌రూ అంగీక‌రించ‌రు. ఏ పార్టీ కూడా మ‌ద్ధ‌తు ఇవ్వ‌దు. కేవ‌లం తెలుగుదేశం పార్టీ మాత్ర‌మే ఆ నిర్ణ‌యం తీసుకుని 2019 ఎన్నిక‌ల్లో చేదు అనుభ‌వాన్ని రుచిచూసింది.

కాపు సామాజిక‌వ‌ర్గం అంటే టీడీపీకి..

కాపుల‌కు 5శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌డానికి బీసీ రిజ‌ర్వేష‌న్ పొందుతోన్న వ‌ర్గాలు ఎవ‌రూ ఆమోదం కాదు. ఆ జాబితాలో బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి, శెట్టి బ‌లిజ ఉన్నారు. వాళ్లంద‌రూ తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యే ప్ర‌మాదం ఉంది. అలాగే, అగ్ర‌వ‌ర్ణ పేద‌ల్లోని యువ‌త పూర్తిగా దూరం అయ్యే అవ‌కాశం లేక‌పోలేదు. ఇలాంటి ఈక్వేష‌న్ల‌ను తెర‌మీద‌కు తీసుకొస్తూ 2019 ఎన్నిక‌ల్లో మాదిరిగా తెలుగుదేశం పార్టీని దెబ్బ‌తీయ‌డానికి వైసీపీ మాస్ట‌ర్ స్కెచ్ వేసింది. అందుకు పావులుగా ముద్ర‌గ‌డ‌, జోగ‌య్య‌ల‌ను ఉప‌యోగించుకుంటోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల్లోని టాక్‌. ఒక వేళ జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు ఖాయ‌మ‌యితే 5శాతం రిజ‌ర్వేష‌న్లు కాపుల‌కు ద‌క్కిన‌ట్టేన‌నే సంకేతం బ‌లంగా వెళుతోంది. ఫ‌లితంగా సాలిడ్ గా టీడీపీకి ఉండే ఓటు బ్యాంక్ ఛిన్నాభిన్నం అవుతుంద‌న్న అంచ‌నా వైసీపీ వేస్తోంది.

Also Read : TDP-Janasena : టీడీపీ,జ‌న‌సేన సీట్లు ఎవ‌రికెన్ని.? బాబు, ప‌వ‌న్ లెక్క ఇదేనా?

మ‌రో వైపు కాపు సామాజిక‌వ‌ర్గం అంటే టీడీపీకి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియ‌చేసే ప్ర‌య‌త్నం బాల‌య్య వ్యాఖ్య‌ల ద్వారా తెలియ‌చేసే ప్ర‌య‌త్నం వైసీపీ చేస్తోంది. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు `సంక‌ర జాతి, అల‌గాజ‌నం` అంటూ అప్పుడెప్పుడో బాల‌య్య చేసిన వీడియోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ చేస్తోంది. అంతేకాదు, చిరంజీవి గురించి వివిధ సంద‌ర్భాల్లో చేసిన కామెంట్స్ ను ఫోక‌స్ చేస్తూ రాజ‌కీయ గేమ్ ను ప్రారంభించింది. ప్ర‌జారాజ్యం వైఫ‌ల్యాన్ని `బ్లడ్‌, బ్రీడ్` తో పోల్చ‌డాన్ని ఇప్పుడు వైసీపీ హైలెట్ చేస్తోంది. తాజాగా `ఆ రంగారావు…ఈ రంగారావు` అంటూ వీర‌సింహారెడ్డి విజ‌యోత్స‌వంలో చేసిన కామెంట్ల‌ను జోడించ‌డం ద్వారా మ‌రింత దుమారం రేపుతోంది. ఇలాంటి అంశాల‌న్నీ జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు మీద ప్ర‌భావం చూపుతాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. అందుకే, కొత్త పొత్తుల కోసం ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తాజాగా ప‌వ‌న్ వ్యాఖ్యానించార‌ని వినికిడి.

అన్ని కోణాల నుంచి టీడీపీని కార్న‌ర్ చేస్తూ వైసీపీ, బీజేపీ..

ఏపీ బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి సీనియ‌ర్లు ప‌లువురు డుమ్మా కొట్టారు. ప్ర‌త్యేకించి ఏపీ బీజేపీ మాజీ చీఫ్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గైర్హాజ‌ర‌య్యారు. ఆయ‌న జ‌న‌సేన గూటికి చేర‌తార‌ని తెలుస్తోంది. తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తు దాదాపుగా ఖారారు అయింద‌ని సంకేతాలు ఉన్న క్ర‌మంలో బీజేపీ నుంచి సీనియ‌ర్లు కొంద‌రు జ‌న‌సేన వైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది. అందుకే, పొత్తులని చెబుతూ బీజేపీని దెబ్బతీయాలని అనుకునే వాళ్ల‌ను క్ష‌మించ‌మ‌ని బీజేపీ ఎంపీ జీవీ ఎల్ ప‌రోక్షంగా జ‌న‌సేన పార్టీని హెచ్చ‌రించారు. ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు తెలుగుదేశం పార్టీతో కలిసి న‌డిచేందుకు సానుకూలంగా లేద‌ని తెలుస్తోంది. అందుకే, బీజేపీకి దూరం అవుతూ టీడీపీకి జ‌న‌సేన ద‌గ్గ‌ర‌వుతోంది. ఈ ప‌రిణామాన్ని బీజేపీ సీరియ‌స్ గా తీసుకుంది. అన్ని కోణాల నుంచి టీడీపీని కార్న‌ర్ చేస్తూ వైసీపీ, బీజేపీ వ్యూహాత్మ‌క పావులు క‌దుపుతున్నాయి. ఆ క్ర‌మంలో కాపు రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని చంద్ర‌బాబు మెడ‌కు చుట్ట‌డానికి బీజేపీ ప‌క్కా స్కెచ్ వేసి పార్ల‌మెంట్ వేదిక‌గా క‌దిలించింది.

Also Read : Vizag kapu : కాపునాడుకు వైసీపీ డుమ్మా, 5శాతం రిజ‌ర్వేజ‌న్ పై జ‌గ‌డం

కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాడేందుకు `కాపుసేన‌` తాజాగా ఆవిర్భ‌వించింది. దానికి టీడీపీ బ‌ద్ధ శ‌త్రువుగా ఉండే హ‌రిరామ‌జోగ‌య్య అధిప‌తిగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి క్రిటిక‌ల్ ప‌రిణామాల మ‌ధ్య జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది.