Site icon HashtagU Telugu

Kapu Politics:చిరంజీవితో వైసీపీకి ప్లస్సేనా!

chiranjeevi jagan

chiranjeevi jagan

సీఎం జగన్‌, మెగాస్టార్‌ చిరంజీవి భేటీ తర్వాత కుల రాజకీయాలపై తెరవెనుక చాలా చర్చలే జరుగుతున్నాయి. 25 రోజుల కిందట కాపు నేతల భేటీ తాజాగా తాడేపల్లిలో మీటింగ్‌కు ఒక కారణమేనన్నది లేటెస్ట్‌ టాక్‌. ఎవరు అవునన్నా కాదన్నా 2019 ఎన్నికల్లో జనసేన ఉన్నా కాపుల్లో మెజార్టీ ఓట్లు వైసీపీకే పడ్డాయి. ఈ రెండున్నరేళ్ల నుంచి కాపుల అంశం పెద్దగా చర్చకుగారాలేదు. ఇటీవల రాజకీయం కాపుల చుట్టూ తిరుగుతోంది. డిసెంబర్‌ చివర్లో హైదరాబాద్‌లో జెండాలకు అతీతంగా కాపు నేతలు భేటీ అయ్యారు. వైసీపీ నేతలు మాత్రం వెళ్లలేదు. గంటా శ్రీనివాస్‌, మాజీ ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ, కన్నా, వంగవీటి రాధా, తోట చంద్రశేఖర్‌ ఈ భేటీలో ఉన్నారు.

కాపుల కోసమే కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందన్న చర్చ జరిగింది. ఇది ఒక్కసారిగా వైసీపీని ఆలోచనలో పడేసింది. ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ పెట్టకపోయినా కాపుల అంశాన్ని ప్రతిపక్షాలు ఎత్తుకుంటే వైసీపీకి ఇబ్బంది తప్పదు. సరిగ్గా ఈ సమయంలోనే ముద్రగడ పద్మనాభం వరుసబెట్టి లేఖలు రాశారు. బీసీ, దళిత, కాపు సోదరులంతా కలిసి రాజ్యాధికారం కోసం పని చేయాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఈ ప్రకటన తర్వాత ముద్రగడను సోషల్‌ మీడియాలో కొందరు టార్గెట్‌ చేశారు. దాంతో పద్మనాభం చాలా సీరియస్‌గానే రియాక్ట్‌ అయ్యారు.

ఎవరికీ భయపడబోనని, తన ప్రకటన తర్వాత కొందరు పెద్దలు భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో భేటీ అయిన కాపు నేతల గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ జరిగింది. మరోవైపు వంగవీటి రాధాపై రెక్కీ దుమారం రేగింది. ఆధారాలేవీ లేవని పోలీసులు ప్రకటించడం, కనీస సమాచారం ఇవ్వకుండా రాధా సైలెంట్‌గా ఉండటం వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపట్టింది. రెక్కీ ఇష్యూని ప్లస్‌ చేసుకునేందుకు టీడీపీ బాగానే ప్రయత్నించింది.

సరిగ్గా ఈ నేపథ్యంలో చిరంజీవిని లంచ్‌ మీటింగ్‌కి పిలిచి సీఎం జగన్‌ మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రితో భేటీకి ముందు, ఆ తర్వాత మెగాస్టార్‌ డైలాగ్స్‌లో చాలా తేడా కనిపించింది. తాడేపల్లి నుంచి బయటకు వచ్చాక ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు చిరంజీవి. ఇప్పుడు రాజ్యసభ సీటు ఆఫర్‌ ప్రచారం మరో చర్చకు దారితీస్తోంది. దాన్ని చిరంజీవి ఖండించినా సీఎంతో ఆయన భేటీ సిని పరిశ్రమకు ఎంత ఉపయోగమో ఏమో కానీ, పొలిటికల్‌ ఈక్వేషన్‌లో ప్లస్‌ అయ్యేది మాత్రం వైసీపీకే అనే విశ్లేషణలు జరుగుతున్నాయి.