Site icon HashtagU Telugu

Mudragada Padmanabham : టీడీపీలోకి ముద్ర‌గ‌డ‌?

Mudragada Padmanabham

Mudragada Padmanabham

సీనియ‌ర్ పొలిటిషియ‌న్ ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం టీడీపీ వైపు చూస్తున్నారా? ఆయ‌న కుటుంబ సభ్యుల రాజ‌కీయ భ‌విత‌వ్యం కోసం అడుగులు ప‌డుతున్నాయా? ఇటీవ‌ల ఆయ‌న మౌనం వెనుక రాజ‌కీయ చ‌తుర‌త ఉందా? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఏపీలో రాజ‌కీయాల్లో టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఒక అంశమైతే, దాన్ని బేస్ చేసుకుని పార్టీల‌ను మార‌డానికి అడుగులు వేస్తున్న వాళ్లు క‌నిపిస్తున్నారు. అలాంటి లీడ‌ర్ల‌లో బ‌హుశా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఒక‌ర‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

రాజ్యాధికారాన్ని జ‌న‌సేన కోరుకుంటోంది. అందుకోసం పార్టీల‌కు అతీతంగా ఒక‌టి కావ‌డానికి ఆ సామాజిక‌వ‌ర్గం పెద్ద‌లు సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల హైద‌రాబాద్ కేంద్రంగా కాపు సామాజిక‌వ‌ర్గం కీల‌క లీడ‌ర్లు రెండుమూడు ద‌ఫాలుగా స‌మావేశం అయ్యారు. సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే చ‌క్రం తిప్పాల‌ని స్కెచ్ వేస్తున్నారు. ఆ క్ర‌మంలో కాపు సామాజిక‌వ‌ర్గం నేత‌లు వివిధ పార్టీల నుంచి పోటీ చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు. ఒక వేళ జ‌న‌సేన పార్టీ నుంచి టిక్కెట్ రాక‌పోయిన‌ప్ప‌టికీ ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందాల‌ని వ్యూహాల‌ను ర‌చిస్తున్నార‌ట‌. గెలిచిన త‌రువాత రాజ్యాధికారం కోసం ప్ర‌య‌త్నం చేయ‌డానికి అవ‌కాశం మెండుగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నార‌ని తెలిసింది. అందుకే, గెలిచే పార్టీ వైపు వెళ్లి టిక్కెట్ సంపాదించుకునే ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తోంది. ఆ జాబితాలో ఇప్పుడు ముద్ర‌గ‌డ కూడా ఉన్నార‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాపుజాతి ఉద్దార‌కునిగా ముద్ర‌గ‌డ ప‌ద్మనాభంకు పేరుంది. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తీవ్ర‌స్థాయిలో న‌డిపిన లీడ‌ర్ ఆయ‌న‌. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబును ఉక్కిరిబిక్కిర చేసేలా చేశారు. ఆ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల్ని పోలీసుల‌తో అసభ్యంగా తిట్టించడం కొట్టించడం చేశారని బాబుపై ముద్రగడ ఆరోపించడం అప్ప‌ట్లో కలకలం రేపింది. అయితే, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని వదిలేశారు.
స్వప్రయోజనాలు చూసుకునే వ్యక్తిగా చిత్రీకరిస్తున్నందున ఉద్యమాన్ని ఆపేస్తున్నానని ముద్రగడ ప్రకటించిన విష‌యం విదిత‌మే.

గత మూడేళ్లుగా ముద్రగడ పద్మనాభం పెద్ద‌గా రాజ‌కీయ తెర‌మీద క‌నిపించ‌లేదు. అప్పుడ‌ప్పుడు సీఎంకు లేఖలు రాయడం మిన‌హా ఆయ‌న పాత్ర ఏమీ లేదు. తాజాగా ముద్రగడ టీడీపీలో చేరతారనే న్యూస్ సోష‌ల్ మీడియాను నింపేస్తోంది. కాపులకు జ‌గ‌న్ స‌ర్కార్ ఏ మేలు చేయ‌డంలేదనే భావనతో బాబుకు ద‌గ్గ‌ర‌వుతార‌ని తెలుస్తోంది. కేంద్రం ఈబీసీలకు ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తామ‌ని చంద్ర‌బాబు ఆనాడు ప్ర‌క‌టించారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే కాపులకు విదేశీ విద్యానిధి పేరుతో సాయం చేశారనే అభిప్రాయం ముద్రగడలో ఉంద‌ట‌. జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్ ను ఎత్తేశారు. కాపుల రిజర్వేషన్ కూడా రాష్ట్రం పరిధి లేదని తేల్చేశారు. దీంతో మ‌ళ్లీ చంద్ర‌బాబు పంచ‌న చేర‌డానికి సిద్ద‌మ‌వుతున్నార‌ని ప్ర‌చారం జరుగుతోంది.

తాజాగా ముద్రగడ అనుచరుడు ఏసుబాబు టీడీపీలో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకున్నారు. యనమల రామకృష్ణుడును క‌లిసి చర్చించారు. త్వరలోనే ఏసుబాబు టీడీపీలో చేర‌బోతున్నారు. ఇదంతా ముద్ర‌గ‌డ అనుమ‌తి తీసుకుని ఏసుబాబు చేస్తోన్న త‌తంగంగా చాలా మంది చూస్తున్నారు. స‌మీప భ‌విష్య‌తులో ముద్ర‌గ‌డ కూడా టీడీపీ పార్టీలో చేర‌డానికి మార్గం సుగ‌మ‌మం అవుతోంద‌ని వినిపిస్తోంది. ఆయ‌న గతంలో వివిధ పార్టీల తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత కాపులకు రిజర్వేషన్ కల్పించాలని దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ముఖ్యంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్య‌మ‌ తీవ్రతను పెంచారు. ఆ క్ర‌మంలో తుని వ‌ద్ద‌ రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు ఆందోళ‌న‌కారులు నిప్పు పెట్టారు. ఆ సంఘ‌ట‌న టీడీపీ, వైఎస్సార్సీపీల ఆనాడు రాజ‌కీయంగా ర‌చ్చ రేపింది.

రాబోవు రోజుల్లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే కాపు రిజ‌ర్వేష‌న్ల‌ను సాధించాల‌ని ముద్ర‌గ‌డ ల‌క్ష్య‌మ‌ట‌. చంద్ర‌బాబు సీఎం అయితే ముద్ర‌గ‌డ త‌న ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి అవకాశం ఉంద‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే, ముంద‌స్తుగా టీడీపీ వైపు ఆయ‌న శిష్యుడు ఏసుబాబును పంపుతున్నార‌ని టాక్‌.