Site icon HashtagU Telugu

Typical Issues: చంద్ర‌బాబుకు నీడ‌లా ఆ రెండు..!

CBN Trend

CBN

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇబ్బంది పెట్టేలా క‌నిపిస్తోన్న రెండు ప్ర‌ధాన అంశాల‌కు ప‌రిష్కారం ఇచ్చే దిశ‌గా చంద్ర‌బాబు ఆలోచిస్తున్నారు. వాటికి స‌రైన ప‌రిష్కారం ఇవ్వ‌గ‌లిగితే, తిరుగులేని అధికారాన్ని అందుకోవ‌చ్చ‌ని టీడీపీలోని ఒక గ్రూప్ చంద్ర‌బాబుకు నూరిపోస్తోంది. అయితే, 2019 ఎన్నిక‌ల ఫ‌లితాల చేదు అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయ‌న తొంద‌ర‌ప‌డ‌కుండా ఆలోచిస్తున్నారు. ఇంత‌కీ ఆ రెండు ఏమిటో తెలుసా? ఒక‌టి కాపు రిజ‌ర్వేష‌న్ మ‌రొక‌టి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ. ఈ రెండు అంశాల‌ను మేనిఫెస్టోలో ఉంచాల‌ని టీడీపీలోని కీల‌క లీడ‌ర్ల గ్రూప్ ఒక‌టి ఒత్తిడి తెస్తుంద‌ని తెలుస్తోంది.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు మ‌ద్ధ‌తుగా ఉమ్మ‌డి ఏపీ సీఎంగా ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు అనుకూల తీర్మానం చేశారు. అదే పంథాను టీడీపీ కొన‌సాగిస్తోంది. కానీ, రాష్ట్రం విడిపోయిన త‌రువాత దాన్ని ప‌క్క‌న పెట్టేశారు. కార‌ణం, విడిపోయిన ఏపీలో ఎస్సీల్లోని మాల సామాజిక‌వ‌ర్గం కీల‌కంగా ఉంది. అదే ఉమ్మ‌డి ఏపీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే ఎస్సీల్లోని మాదిగ సామాజిక‌వ‌ర్గం తెలంగాణ‌లో బ‌లంగా ఉండేది. అందుకే, 2014, 2019 ఎన్నిక‌ల్లో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశాన్ని పెద్ద‌గా ప్ర‌స్తావించ‌కుండా టీడీపీ ప్ర‌చారం చేసింది.

Also Read:  Kapu Leaders in AP: ఏపీలో `కాపు` క‌ల‌క‌లం!

ఎస్సీల్లోని మాల , మాదిగ సామాజిక‌వ‌ర్గాలు మూకుమ్మ‌డిగా 2019 ఎన్నిక‌ల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ‌గా మొగ్గు చూపిందని అంచ‌నా. ఎందుకంటే, ఎస్సీల్లోని మెజార్టీ భాగం క్రిస్టియ‌న్ మ‌తాన్ని తీసుకున్నారు. ఎస్సీ మాల 70శాతం క్రిస్టియ‌న్లుగా మారార‌ని అన‌ధికార లెక్క‌. అదే ఎస్సీ మాదిగ 40శాతం క్రిస్టియ‌న్ మ‌తాన్ని పుచ్చుకున్నార‌ని ఏపీలో క‌నిపిస్తోన్న దృశ్యం. ఆ కోణం నుంచి క్రిస్టియ‌న్ మ‌తం తీసుకున్న ఎస్సీ మాల మెజార్టీ ఓట‌ర్లు వైసీపీ వైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఉంటార‌ని లెక్కిస్తోంది. అదే, ఎస్సీ మాదిగ తొలి నుంచి టీడీపీ సానుభూతిప‌రులుగా ఉన్నారు. వాళ్లు క్రిస్టియ‌న్ మ‌తం తీసుకున్న‌ప్ప‌టికీ తెలుగుదేశం పార్టీకి సాలిడ్ గా ఉన్నార‌ని రాజ‌కీయ పార్టీల క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌. అందుకే, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూల వాయిస్ ను బ‌లంగా ఈసారి వినిపిస్తే లాభం ఉంటుంద‌ని టీడీపీలోని ఒక గ్రూప్ ఆలోచ‌న‌.

కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు అనుకూలంగా టీడీపీ ఉంది. దాన్ని అమ‌లు చేయ‌డానికి అనువైన మార్గాల కోసం చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా క‌మిష‌న్ కూడా వేశారు. దీంతో మిగిలిన బీసీ వ‌ర్గాలు, బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాలు టీడీపీ మీద గుర్రుగా ఉన్నార‌ని తెలుస్తోంది. కానీ ఈసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌భావంతో ఆ కులాల‌న్నీ ఒకే గొడుగు కింద‌కు వ‌స్తాయ‌ని టీడీపీలోని కాపు సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్లు భావిస్తున్నారు. అందుకే, కాపు రిజ‌ర్వేష‌న్ కు మ‌ద్ధ‌తుగా బ‌ల‌మైన స్లోగ‌న్ తీసుకోవాల‌ని చంద్ర‌బాబు మీద ఒత్తిడి పెడుతున్నారు. ఒక వేళ జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే కాపు రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డానికి టీడీపీ మ‌రోసారి అంగీక‌రించిన‌ట్టు అవుతుంది. అంతేకాదు, చంద్ర‌బాబు వేసిన క‌మిష‌న్ రిపోర్ట్ ను కూడా బ‌య‌ట పెట్ట‌డం ద్వారా కాపు ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించాల‌ని టీడీపీలోని కాపుల ఉవాచ‌.

Also Read:  TRS MLA’s Quit Please: సార్ ప్లీజ్ రిజైన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్!

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ , కాపు రిజ‌ర్వేష‌న్ రెండు అంశాలు చాలా సున్నిత‌మైన‌వి. ప్ర‌ధానంగా కాపు సామాజిక‌వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డానికి మిగిలిన బీసీ సామాజిక‌వ‌ర్గాలు అంగీక‌రించ‌డంలేదు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇచ్చిన 10శాతం అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్లో 5శాతం కాపుల‌కు ఇస్తాన‌ని 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు చెప్పారు. దీంతో అగ్ర వ‌ర్ణ పేద‌లు, బీసీ వ‌ర్గాలు టీడీపీకి దూరం అయ్యారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే అంశాన్ని హైలెట్ చేస్తే భారీ న‌ష్టం జ‌రిగే ప్ర‌మాదం కూడా లేక‌పోలేదు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఇచ్చే అంశంలో బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాలు సానుకూలంగా ఉండ‌రు. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు మీద టీడీపీలోని కాపు లీడ‌ర్లు తీసుకొస్తోన్న ఒత్తిడి న‌ష్టం చేకూర్చేలా ఉంద‌ని ఇత‌ర సామాజిక‌వ‌ర్గాల లీడ‌ర్లు చెబుతున్నారు.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా చంద్ర‌బాబు 2024 ఎన్నిక‌ల్లో బ‌లంగా వినిపిస్తే ఎంతో కొంత లాభం ఉంటుంద‌ని మాదిగ సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్లు ఆయ‌న మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మాల సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్ల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ వ‌చ్చిన చంద్ర‌బాబుకు ఓట్ల ప‌రంగా ఆ సామాజిక‌వ‌ర్గం నుంచి వ‌చ్చిన లాభం పెద్ద‌గా లేదు. అందుకే, తొలి నుంచి అండ‌గా నిల‌బ‌డుతోన్న మాదిగ సామాజిక‌వ‌ర్గాన్ని చేజార్చుకోకుండా ముందుగా జాగ్ర‌త్త ప‌డాల‌ని సూచిస్తున్నారు. ఒక‌ వైపు పొత్తు మ‌రో వైపు కులాల కుంప‌ట్ల‌ను స‌మ‌న్వ‌యం ఎలా చేసుకోవాలి? అనేది చంద్ర‌బాబు ముందున్న పెద్ద ప్ర‌శ్న‌. గ‌తంలో చంద్ర‌బాబు వినిపించిన ఆ రెండు అస్త్రాలు ఇప్పుడు మ‌ళ్లీ పార్టీలోనూ, బ‌య‌టా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. దీంతో చంద్ర‌బాబు ఏమి చేస్తార‌న్న‌దానిపై ప్ర‌త్య‌ర్థులు గ‌మ‌నిస్తున్నారు. అధికారంలోని వైసీపీ మాత్రం నైస్ గా కేంద్రం ప‌రిధిలో ఉంద‌ని కాపు రిజ‌ర్వేష‌న్ అంశాన్ని ప‌క్క‌న పెట్టేసింది. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశాన్ని కూడా కేంద్రం కోర్టులో వేసి చేతులు దులుపుకుంది. కానీ, చంద్ర‌బాబు మాత్రం వైసీపీ త‌ర‌హాలో చేయ‌లేక స‌త‌మ‌తం కావ‌డం గ‌మ‌నార్హం.

Also Read:  Bharat Jodo Yatra: జోడో యాత్రలో మాజీ మంత్రికి గాయం.!