Site icon HashtagU Telugu

Kanna Lakshmi Narayana: జ‌న‌సేన‌, టీడీపీ వైపు `క‌న్నా` న‌డ‌క‌?

Kanna Lakshminarayana

Kanna Lakshminarayana

మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సీనియ‌ర్ పొలిటిషియ‌న్. గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు బీజేపీ ఏపీ అధ్య‌క్షుడుగా ఉన్నారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు వ‌ద్ద పెద్ద ఎత్తున న‌జ‌రానా తీసుకున్నాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఫ‌లితంగా ఏపీ బీజేపీ అధ్య‌క్ష‌త ప‌ద‌వి ను పోగొట్టుకున్నారు. ఆయ‌న స్థానంలో సోము వీర్రాజు ప్ర‌స్తుతం బీజేపీ చీఫ్ గా ఉన్నారు. తొలి నుంచి వాళ్లిద్ద‌రి పొస‌గ‌దు. కేవ‌లం వీర్రాజు కార‌ణంగా జ‌న‌సేన పార్టీ బీజేపీకి దూరం అయింద‌ని తాజాగా క‌న్నా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. అంతేకాదు, ఆయ‌న ఏ పార్టీ వైపు అడుగులు వేయ‌బోతున్నార‌నే దానిపై పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది.

ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా లక్ష్మీ నారాయణ మంత్రిగా పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయనకు ప్రాధాన్యత ఉండేది. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేర‌బోయేలోపు కమలం లాగేసుకుంది. పార్టీలోకి తీసుకుని బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలను అప్ప‌గించారు. అమరావతి విషయంలో ఆయన స్పీడు కారణంగా బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి హైకమాండ్ కన్నాను తప్పించిందని మ‌రో టాక్‌. అంతేకాదు, టీడీపీతో మిలాఖ‌త్ అయ్యాడ‌ని ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన్నారు. అప్పటి నుంచీ పార్టీలో పెద్దగా ప్రాముఖ్యత లేకుండా పోయింది. బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించిన‌ప్ప‌టికీ ఆ పార్టీలోనే అసంతృప్తిగా ఆయ‌న కొన‌సాగుతున్నారు.

తాజాగా బీజేపీపై పవన్ వ్యాఖ్యలతో కన్నా బరస్టయ్యారు. సోము వీర్రాజు కారణంగానే ఏపీలో బీజేపీ పరిస్థితి దిగజారిందనీ, ఆయన ఒంటెత్తు పోకడలతో పార్టీని రాష్ట్రంలో భ్రష్టు పట్టించారనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్య అనుచరులతో బుధవారం రాత్రి అత్యవసరంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆయన నేడో రేపో కమలం గూటి నుంచి బయటకు రావడం ఖాయమంటున్నారు. ఏ పార్టీలో చేరనున్నారన్న విషయంపై ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. సామాజిక వర్గ సమీకరణాలను పరిగణనలోనికి తీసుకుంటే జనసేన గూటికి చేరే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. రాజ‌కీయ భ‌విష్య‌త్ దృష్ట్యా సైకిలెక్కడం ఖాయమని మరి కొందరు భావిస్తున్నారు.

ఏ గూటికి చేరినా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయాలను ప్రభావితం చేస్తారన్న విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. వైఎస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడూ, ఆ తరువాత బీజేపీ అధ్యక్షుడిగానూ తెలుగుదేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఆ తరువాత అమరావతి పోరాటంలో తెలుగుదేశంతో కలిసి నడిచారు. దీంతో ఆయన జనసేన వైపు కంటే తెలుగుదేశం వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ పెదకూరు పాడు నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తూ వచ్చినా ఇటీవలి కాలంలో ఆయన ఎక్కువగా గుంటూరు 2 అసెంబ్లీ నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అంతేకాదు, నరసరావు పేట పార్లమెంటు నియోజకవర్గంపై కూడా ఆయన దృష్టి సారించినట్లు టాక్ ఉంది.

ఇప్పుడు ఆయన పార్టీ మారడమంటూ జరిగితే ఆయన నరసరావు పేట లోక్ సభ స్థానం, గుంటూరు2, సత్తెన పల్లి అసెంబ్లీ స్థానాలపై ప‌ట్టుబ‌డ‌తారు. ఆయ‌న‌తో పాటు కుటుంబంలోని మ‌రొక‌రికి అవకాశంఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఒక వేళ తెలుగుదేశం పార్టీ వైపే ఆయన మొగ్గు చూపితే స‌త్తెన‌ప‌ల్లి నియోజకవర్గం విషయంలో అభ్యంతరం ఉండదని అంటున్నారు. ఎందుకంటే గుంటూరు 2 నియోజకవర్గంను వ‌దులుకోవ‌డానికి టీడీపీ సిద్ధంగా లేదు. మొత్తం మీద కన్నా బీజేపీపై చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న పార్టీ మార‌డంపై దుమారాన్ని రేపుతున్నాయి.