River Woes: ఆ గ్రామాల‌కు నాడు జీవ‌నాడి… నేడు అదే వారికి క‌ష్టాల న‌ది

సాధారణంగా రాయలసీమ అంటేనే క‌రువుకి కేరాఫ్ అడ్ర‌స్ గా ఉండేది. ప్రత్యేకించి కడప కరువు, లోటు వర్షపాతానికి పర్యాయపదాలుగా చెప్తారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని సారవంతమైన కోనసీమను తలపించే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు మండలాలు దీనికి మినహాయింపు.

  • Written By:
  • Publish Date - November 28, 2021 / 03:00 PM IST

సాధారణంగా రాయలసీమ అంటేనే క‌రువుకి కేరాఫ్ అడ్ర‌స్ గా ఉండేది. ప్రత్యేకించి కడప కరువు, లోటు వర్షపాతానికి పర్యాయపదాలుగా చెప్తారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని సారవంతమైన కోనసీమను తలపించే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు మండలాలు దీనికి మినహాయింపు. ఇదంతా ఇక్కడి ప్రజలకు జీవనాడి అయిన చెయ్యేరు నది వల్లనే. చెయ్యేరు ఆయకట్టు రైతులు ఏడాదికి వరితో సహా మూడు పంటలు పండిస్తారు. అదే చెయ్యేరు ఇప్పుడు పెద్దఎత్తున విధ్వంసం సృష్టించి కనీసం 10 గ్రామాల ప్రజలను నిరాశకు గురి చేసింది. అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో వచ్చిన వరదలో వారి సామాన్లు కొట్టుకుపోయాయి. సంపన్నమైన ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె రెప్పపాటులో పేదరికంలోకి మారాయి.

పంటలే కాదు, ఇళ్లు, గృహోపకరణాలు, పశువులు కూడా వరదలో కొట్టుకుపోవడంతో జంటగ్రామాల ప్రజలు దీనిని ప్రళయంగా అభివర్ణించారు. ఈ వ‌ర‌ద‌ల వ‌ల్ల త‌మ‌కు ఏమీ లేకుండా పోయింద‌ని..త‌న కుటుంబం మొత్తం ఇప్పుడు రోడ్డు మీద ప‌డింద‌ని మంద‌ప‌ల్లెకు చెందిన సుబ్బారాయుడు క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు. ప్రభుత్వం ఆదుకోకపోతే త‌మ‌కు చావు తప్ప మరో మార్గం లేద‌ని వాపోయాడు. రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టి తనకున్న ఆరెకరాల భూమిలో వరి పంటను సాగు చేశాన‌ని… ఈ సీజన్‌లో పంట దిగుబడి బాగా వస్తుందని అంచానా వేసిన‌ప్ప‌టికీ…చెయ్యేరు ధాటికి వరి పంట పూర్తిగా నాశనమైందని ఆయ‌న తెలిపాడు. తమ గ్రామం సుభిక్షంగా ఆనందంతో అలరారుతున్న రోజులను గుర్తు చేసుకున్నారు.

వరదల కారణంగా ప్రజలు తమ ఆధార్, రేషన్ కార్డులతో సహా సర్వస్వం కోల్పోయారు. ఇప్పుడు ఎక్కువ మంది అనిశ్చిత భవిష్యత్తు వైపు చూస్తున్నారు. రెండు గ్రామాల్లో దాదాపు 1,500 జనాభా ఉండ‌గా…వారిలో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తున్నారు. ఇక్క‌డ వ‌రి ప్ర‌ధాన పంట‌గా సాగు చేస్తున్నారు. రెండు గ్రామాల్లో మామిడి, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు కూడా పండిస్తారు. పాడిపరిశ్రమలో కూడా గ్రామాలు ముందంజలో ఉన్నాయి. గ్రామానికి చెందిన 13 మంది వరదలో కొట్టుకుపోగా…దాదాపు 100 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 300 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వరద బాధిత గ్రామస్తులు తమకు తక్షణ సాయంగా కేవలం రూ.5,800 మాత్రమే లభించిందని చెప్పారు. మంద‌ల‌ప‌ల్లెకి చెందిన మ‌రో రైతు రామ‌చంద్ర కూడా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లక్ష అప్పు చేసి ఐదు ఎకరాల్లో వరి సాగు చేశాన‌ని…. ఇప్పుడు అంతా నాశ‌న‌మైంద‌ని వాపోయారు.