YS Avinash Reddy : వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు అయ్యాడు. సాగునీటి సంఘాల ఎన్నికలపై మాట్లాడేందుకు తాహశీల్దారు కార్యాలయానికి వెళ్లేందుకు అవినాష్ రెడ్డి ప్రయత్నించారు. అయితే అవినాష్ రెడ్డి వెళ్తే గొడవలు జరుగుతాయని ఉద్దేశంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పులివెందులకు తరలించారు. దీంతో పోలీసులు, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం.. తోపులాటకు దారి తీసింది.
కాగా, పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాలలో రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే టీడీపీ కార్యకర్తలు రైతులను వేముల మండలంలో తాసిల్దార్ కార్యాలయంలోనికి వెళ్లనికుండా అడ్డుకుంటున్నారని అవినాష్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే మీడియాపై దాడి జరగడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను తాసిల్దార్ కార్యాలయం నుంచి బయటికి పంపే వరకు తాను కూడా కదలనని పోలీస్ స్టేషన్ లోనే అవినాష్ రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలోనే వేముల పోలీస్ స్టేషన్ లో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి పోలీసులు పులివెందులకు తరలించారు.
కాగా, పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో ఉదయం నుంచి ఉద్రిక్తత పరస్థితులు నెలకొన్నాయి. సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో పులివెందులలో గొడవలు జరుగుతున్నాయి. ఎన్నికల కోసం రేపు నామినేషన్ వేయాలంటే ఈరోజు వీఆర్వోకు పన్నులు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఉదయం నుంచి తహశీల్దార్ కార్యాలయంలో ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తహశీల్దార్ కార్యాలయంలో వద్ద వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులను టీడీపీ వారు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.