Site icon HashtagU Telugu

Kadambari Jethwani Case: కుక్కల విద్యాసాగర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం!

Kadambari Jethwani Case

Kadambari Jethwani Case

సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నటి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో, విజయవాడ కోర్టు గతంలో ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. కుక్కల విద్యాసాగర్ అరెస్టు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది.

తనకు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన వ్యాజ్యంపై గతవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో, విద్యాసాగర్ తరఫున టి. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, ‘పిటిషనర్ అరెస్టు విషయంలో చట్టం నిర్దేశించిన మార్గదర్శకాలను పోలీసులు అనుసరించలేద’న్నారు. ఆయన అరెస్టుకు కారణాలను వివరించలేదని, బంధువులకు కూడా తెలియజేయలేదని తెలిపారు. రిమాండ్‌కు ముందు అరెస్టుకు కారణాలను ఆయనకు అందజేశారని, అయితే రిమాండ్ ఆర్డర్‌లో ఈ విషయాలకు ప్రస్తావన లేదని చెప్పారు. అందువల్ల, రిమాండ్ ఉత్తర్వులు చెల్లుబాటు కావని, వాటిని కొట్టివేయాలని కోరారు.

కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేసే సమయంలో పోలీసులు చట్ట నిబంధనల ప్రకారమే నడిచారని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. అరెస్టు చేసేటప్పుడు నిందితుడి కుక్కల విద్యాసాగర్‌పై ఎవరు ఫిర్యాదు చేసినది, ఏ కారణంతో అరెస్టు చేస్తున్నారో వివరించారని, ఆ సమయంలో ఆయన స్నేహితుడికి కూడా ఈ విషయాన్ని తెలియజేశారని చెప్పారు. విద్యాసాగర్‌ను అరెస్టు చేసి రాష్ట్రానికి తరలించేందుకు అనుమతి కోరుతూ ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని, కోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ ఆర్డర్‌పై పిటిషనర్ సంతకం కూడా చేశాడన్నారు. ఈ నేపథ్యంలో, అరెస్టుకు కారణాలు చెప్పలేదని, పోలీసులు చట్ట నిబంధనలు అనుసరించలేదని విద్యాసాగర్ వాదనలో అర్థం లేదని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వాదనలు ముగించాక, తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఈరోజు విద్యాసాగర్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును ప్రకటించింది.

Exit mobile version