Junior NTR Vs TDP : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశించడం వివాదానికి దారితీసింది. బాలకృష్ణ ఆదేశాలతో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు తొలగించడం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడంతో ఘాట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి విబేధాలు బయటపడ్డాయి. ఈనేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చిన బాలకృష్ణ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బాలకృష్ణను, టీడీపీ పెద్దలను హెచ్చరిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఓ ఎమోషనల్ లేఖను కూడా విడుదల చేశారు. ఈ లేఖ(Junior NTR Vs TDP) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విడుదల చేసిన లేఖలోని వివరాలివీ.. “దేవర ఇన్నాళ్లు నీ మీద జరిగిన మానసిక దాడి చాలు.. ఇక వాళ్ళకి తెలియాలి దేవర అభిమానుల సత్తా.. మేమెంతో అభిమానంతో మా దేవర కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బహిరంగంగా బాలకృష్ణ తీసేయండి.. ఇప్పుడే తీసేయండి అని అక్కడున్న టీడీపీ వాళ్లకు చెబుతుంటే.. తారక్ అన్నని ఎంతలా ద్వేషిస్తున్నారో తలచుకొని బరువెక్కిన హృదయంతో కళ్లు కన్నీటితో కారు మబ్బులు కమ్మేశాయ్.. బావ కళ్లలో ఆనందం కోసం ఆ నాడు దివంగత సీనియర్ ఎన్టీఆర్ గారిని, దివంగత నందమూరి హరికృష్ణ గారిని మరణం అంచుల్లో ఉన్నా వెంటాడారు. ఇదే బాలయ్య అప్పట్లో చంద్రబాబు చెప్పులు మోస్తూ వీర విహారం చేశాడు. ఇప్పుడు తారక్ అన్నని భారీగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెబుతున్నాం. ఇన్నాళ్లు సహించాం.. త్వరలో మీ అహంకారం అణచి.. మీలోని మదాన్ని వెంటాడబోతున్నాం.. ఈసారి బ్యాలెట్ బాక్సులు భయంతో భీతెక్కుతాయి. ఆంధ్ర రాష్ట్రం తారక రాముడి అడ్డా అని చాటి చెప్పకపోతే దీంతల్లి.. ఈ సారి మీకు మాత్రం రాజకీయ బిచ్చగాళ్లను చేయడం నిశ్చయం. అందుకు ప్రతీ ఎన్టీఆర్ అభిమాని ప్రతిన పూనుతున్నాడు. మా అందరిలో ఇప్పుడు ఆగ్రహించిన ఉగ్ర నరసింహుడు ఆవహించి ఉన్నాడు.. మీ అందరినీ వేటాడి వేటాడి మీ పతనం చూస్తాం.. జై ఎన్టీఆర్ ! జై జై ఎన్టీఆర్ !! ” అని ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరిట ప్రచురించిన ఓ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.