Amaravathi: రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ (Jungle Clearence) పనులు బుధవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్వయంగా పూజ చేసి ఈ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం 58 వేల ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంపలను నెలరోజుల్లోగా తొలగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
జంగిల్ క్లియరెన్స్ ద్వారా భూములపై కేటాయింపులు పొందిన వారికి తమ స్థలంపై అవగాహన కలగాలని మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. ప్రభుత్వ కాంప్లెక్స్, ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రా జోన్లు, ట్రంక్ ఇన్‌ఫ్రా ప్రాంతాల్లో పెరిగిపోయిన చెట్లు, ముళ్ల కంపలను తొలగించనున్నామని పేర్కొన్నారు.
గత ఐదేళ్లుగా అమరావతిలో నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో, జంగిల్ దట్టంగా మారింది. వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణంలో భారీ నష్టం జరగడంతో, నష్ట నివారణ కోసం ప్రభుత్వం భారీ ఖర్చు చేయాల్సి వచ్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Cm Chandra Babu) అమరావతిని అభివృద్ధి చేయడానికె ప్రత్యేక దృష్టి పెట్టారు.
సీఆర్డీఏ అధికారుల ఆధ్వర్యంలో ఇటీవల రూ.36.50 కోట్లతో టెండర్లను ఖరారు చేసి, ఎన్‌సీసీఎల్ సంస్థ ఈ పనులను చేపట్టింది. ఈ రోజు ఉదయం నుండి, ఎన్‌సీసీఎల్ సంస్థ సెక్రటేరియట్ వెనుక వైపున ఎన్ 9 రోడ్డు నుండి జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించిందని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు (Ap Cm) నాయకత్వంలో అమరావతిలో నిర్మాణ పనులు పునరుద్ధరించే కార్యాచరణకు తొలి అడుగు పడింది. 99 డివిజన్లలో జంగిల్ క్లియరెన్స్ పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి నారాయణ చెప్పారు