Jr NTR Tweet : ఎన్టీఆర్ పేరు మార్పుపై `జూనియ‌ర్ ట్వీట్` దుమారం

విజ‌య‌వాడ‌లోని హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొల‌గించ‌డంపై తెలుగుజాతి ర‌గిలిపోతోంది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అజ్ఞానాన్ని ప‌రోక్షంగా ప్ర‌శ్నిస్తూ జూనియ‌ర్ సంచ‌ల‌న ట్వీట్ చేశారు

  • Written By:
  • Updated On - September 22, 2022 / 09:56 PM IST

విజ‌య‌వాడ‌లోని హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొల‌గించ‌డంపై తెలుగుజాతి ర‌గిలిపోతోంది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అజ్ఞానాన్ని ప‌రోక్షంగా ప్ర‌శ్నిస్తూ జూనియ‌ర్ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. అటు ఎన్డీఆర్ ఇటు వైఎస్సార్ ఇద్ద‌రూ విశేష ప్ర‌జాద‌ర‌ణ పొందిన‌ గొప్పు నాయ‌కులు. ఒక‌రి పేరు తొలగించి మ‌రొక‌రి పేరు పెట్టినందు వ‌ల్ల వాళ్ల కీర్తిని పెంచ‌డం, త‌గ్గించ‌డం ఉండ‌ద‌ని చుర‌క‌లేశారు. ఇలాంటి నిర్ణ‌యాల వ‌ల‌న ఒరిగేదీ ఏమీ లేద‌ని ప‌రోక్షంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలివి త‌క్కువ‌తనాన్ని లేవ‌నెత్తారు. యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొల‌గించినంత మాత్రాన ఆయ‌న సంపాదించుకున్న కీర్తి, తెలుగు జాతి చ‌రిత్ర‌లో ఆయ‌న‌కున్న స్థాయి, తెలుగు ప్ర‌జ‌ల హృదయాల‌లో ఉన్న ఆయ‌న జ్ఞాప‌కాల‌ను చెరిపివేయ‌లేరు అంటూ జూనియ‌ర్ చేసిన ట్వీట్ జ‌గ‌న్ అప‌రిపక్వత‌ను ప్ర‌శ్నించేలా ఉంది. కానీ, కొంద‌రు ఆయ‌న చేసిన ట్వీట్ సుతిమెత్త‌గా ఉంద‌ని భావించ‌డం గ‌మ‌నార్హం.

 

జూనియ‌ర్ చేసిన ట్వీట్ మీద లోకేష్ టీమ్‌లోని కొంద‌రు మూతివిరుస్తున్నారు. అంతేకాదు, ఎన్టీఆర్, వైఎస్సార్ ను ఒకేలా పోల్చ‌డం ఏమిటని ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్టీఆర్ గొప్ప‌తనాన్ని వైఎస్సార్ తో జూనియ‌ర్ పోల్చ‌డం ఏమిట‌ని నిల‌దీస్తున్నారు. ఆ ట్వీట్ ను చ‌దివిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యాన్ని జూనియ‌ర్ లైట్ గా తీసుకున్న‌ట్టు భావిస్తున్నారు. క‌ర్ర విర‌గ‌కుండా పాము చావ‌కుండా చేసిన ట్వీట్ వ‌ల‌న ఒరిగేదీ ఏమీ లేద‌ని టీడీపీలోని ఒక గ్రూప్ అంటోంది.

Also Read:   Pawan Kalyan: హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ అభిప్రాయం

గ‌తంలోనూ భువ‌నేశ్వ‌రిపై వ్యక్త‌త్వ హ‌న‌నం జ‌రిగిన‌ప్పుడు నంద‌మూరి ఫ్యామిలీ మీడియా ముందుకొచ్చింది. కానీ, జూనియ‌ర్ ఒక ట్వీట్ చేసి నిమ్మ‌కుండిపోయిన విష‌యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ మ‌న‌వ‌డిగా జూనియ‌ర్ పోరాటం చేయకుండా సుతిమెత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని లోకేష్ టీమ్ అప్ప‌ట్లో విమ‌ర్శించింది. పొలిట్ బ్యూరో మెంబ‌ర్ వ‌ర్ల రామ‌య్య‌, బుద్ధా వెంక‌న్న లాంటి వాళ్లు మీడియా ముందుకొచ్చి జూనియ‌ర్ ను నిల‌దీశారు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పేరును యూనివ‌ర్సిటీకి తొల‌గించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై ఫైట్ చేయ‌కుండా అటూఇటూ కాకుండా జూనియ‌ర్ స్పందించాడ‌ని లోకేష్ టీమ్ భావిస్తోంది.