NTR and Name Change:జూనియ‌ర్ మెడ‌కు `ఎన్టీఆర్ పేరు మార్పు` ఎపిసోడ్

హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు ఎపిసోడ్ జూనియ‌ర్ చుట్టూ తిరుగుతోంది. ఆయ‌న్ను కార్న‌ర్ చేసేలా తెలుగుదేశం పార్టీలోని ఒక గ్రూప్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం చేస్తోంది. తొలి రోజు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కాన్ని ప్ర‌శ్నిస్తూ పోస్టులు పెట్టారు.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 12:05 PM IST

హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు ఎపిసోడ్ జూనియ‌ర్ చుట్టూ తిరుగుతోంది. ఆయ‌న్ను కార్న‌ర్ చేసేలా తెలుగుదేశం పార్టీలోని ఒక గ్రూప్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం చేస్తోంది. తొలి రోజు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కాన్ని ప్ర‌శ్నిస్తూ పోస్టులు పెట్టారు. అదే సంద‌ర్భంలో జూనియ‌ర్ స్పందించాల‌ని డిమాండ్ చేస్తూ వీడియోల ద్వారా హ‌ల్ చ‌ల్ చేశారు. త‌న‌దైన శైలిలో జూనియ‌ర్ సున్నితంగా ట్వీట్ చేస్తూ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అజ్ఞానాన్ని ప‌రోక్షంగా ప్ర‌శ్నించారు. కానీ, ఆయ‌న చేసిన ట్వీట్ కొంద‌రికి న‌చ్చ‌లేదు.

యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు అంశాన్ని ప‌క్క‌న పెట్టిన టీడీపీ సోష‌ల్ మీడియాలోని కొంద‌రు జూనియ‌ర్ మీద దురుసుగా పోస్టులు పెడుతున్నారు. ఆయ‌న సినిమాల‌ను బ్యాన్ చేయాల‌ని పిలుపునిస్తున్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్ద‌రూ ఒకటే అనే సెన్స్ వ‌చ్చేలా ట్వీట్ చేశార‌ని లాజిక్ బ‌య‌ట‌కు తీశారు. తెలుగుదేశం పార్టీతో జూనియ‌ర్ కు ఎలాంటి సంబంధంలేద‌ని విశ్లేష‌ణ‌లు ఇచ్చారు. నంద‌మూరి కుటుంబం స్పందించే తీరు ఇదేనా? అంటూ బుల్లితెర జ‌ర్న‌లిస్ట్ లు కొంద‌రు రెచ్చిపోయారు. మా తాత అంటూ సినిమాల్లో ఎంజాయ్ చేసిన జూనియ‌ర్ ఇప్పుడు స్పందించే తీరు ఇదేనా? అంటూ నిల‌దీశారు. వైఎస్ ష‌ర్మిల స్పందించిన విధంగా కూడా స్పందించ‌లేని జూనియ‌ర్ నంద‌మూరి కుటుంబం ఎలా అవుతార‌ని మ‌రికొంద‌రు ఓవ‌ర్రియాక్ట్ అయ్యారు.

జూనియ‌ర్ చేసిన ట్వీట్ కు రీ ట్వీట్లు, కామెంట్ల హోరుతో ట్విట్ట‌ర్ నిండిపోయింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టుల‌ను ముంచెత్తుతున్నారు. వాళ్ల‌కు న‌చ్చిన విధంగా జూనియ‌ర్ ట్వీట్ చేయ‌లేద‌ని టీడీపీలోని ఒక గ్రూప్ రెచ్చిపోతోంది. దానికి ధీటుగా జూనియ‌ర్ అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇదంతా గ‌మ‌నిస్తోన్న వైసీపీ సోష‌ల్ మీడియా టీమ్ న‌వ్వుకుంటూ పోస్టులు పెడుతోంది. జూనియ‌ర్ టార్గెట్ గా చంద్ర‌బాబునాయుడు, లోకేష్ పాలిటిక్స్ న‌డుపుతున్నార‌ని నిల‌దీస్తోంది. అంతేకాదు, ప‌లు సంద‌ర్భాల్లో ఎన్టీఆర్ కు అవ‌మానం క‌లిగేలా బాబు చేసిన ప్ర‌య‌త్నాల‌ను గుర్తు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఎన్టీఆర్ పేరు మార్పుపై ఏపీ అట్టుడుకేలా ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేయాల‌ని టీడీపీ అధిష్టానం పిలుపు ఇచ్చింది. కానీ, పెద్ద‌గా రియాక్ష‌న్ టీడీపీ క్యాడ‌ర్ నుంచి రాలేద‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హించిన‌ట్టు తెలుస్తోంది. అందుకే, యాక్టివ్ గా లేని నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిల‌ను మార్చేస్తాన‌ని తాజాగా వార్నింగ్ ఇచ్చార‌ని స‌మాచారం. తెలుగు జాతి గ‌ర్వ‌ప‌డేలా సినీ, రాజ‌కీయ రంగాల్లో ఎదిగిన మ‌హోన్న‌త వ్య‌క్తి ఎన్టీఆర్ . యూనివ‌ర్సిటీకీ ఆయ‌న పేరు మార్పు ఏపీ వ్యాప్తంగా గందర‌గోళం రేగుతుంద‌ని టీడీపీ కోర్ టీంలోని కొంద‌రు భావించారు. కానీ, చంద్ర‌బాబునాయుడు హ‌యాంలోనూ ఎన్టీఆర్ కు అవ‌మానం జ‌రిగింద‌నే విష‌యం కూడా స‌మాంత‌రంగా ఫోక‌స్ అవుతోంది.

ఎన్టీఆర్ ప‌ద‌వీచ్యుతుడు అయిన త‌రువాత 1995 నుంచి 2004 వ‌ర‌కు చంద్ర‌బాబు సీఎంగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో స‌చివాల‌యం, అసెంబ్లీ ప్రాంతాల్లో ఉన్న ఎన్టీఆర్ చిత్ర‌ప‌టాల‌ను తొల‌గించిన విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తోంది. పార్టీ కార్యాల‌యంలోనూ, ప్రాథ‌మిక స‌భ్య‌త్వ పుస్త‌కాల‌పై ఆనాడు ఎన్టీఆర్ బొమ్మ‌ను తొల‌గించిన అంశాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంద‌రు పోస్టులు పెడుతున్నారు. అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట ఎన్టీఆర్ కు జ‌రిగిన అవ‌మానాల‌ను గుర్తు చేస్తూ వైసీపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. వాటిని ధీటుగా ఎదుర్కోవాల్సిన టీడీపీ సోష‌ల్ మీడియా, బాబు సానుకూల మీడియా టీమ్ జూనియ‌ర్ టార్గెట్ చేసింది. వీలున్నంత వ‌ర‌కు జూనియ‌ర్ చ‌రిష్మా, రాజ‌కీయ గ్లామ‌ర్ ను క‌డిగేసేలా ముందుడుగు వేసింది. భ‌విష్య‌త్ లో టీడీపీ వైపు చూడ‌డానికి కూడా జూనియ‌ర్ కు అర్హ‌త‌లేద‌నే కోణం నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. దీన్ని గ‌మ‌నిస్తోన్న వైసీపీ మాత్రం అనుకున్న టార్గెట్ ను రీచ్ అయిన‌ట్టు ఫీల్ కావ‌డంలో త‌ప్పులేదేమో!