ఎన్టీయే భాగ‌స్వామిగా వైసీపీ? జ‌గ‌న్‌, జ‌న‌సేనాని ఎత్తుగ‌డల్లో కొత్త కోణం

ఎన్డీయేలో భాగ‌స్వామ్యం కావాలని వైసీపీ భావిస్తుందా? లేక బీజేపీ ఒత్తిడి చేస్తుందా? బీజేపీ, వైసీపీ ఒక తానులో ముక్క‌ల‌ని చాలా కాలంగా టీడీపీ చెబుతోంది. దాన్ని నిజం చేసేలా కేంద్ర మంత్రి రామ్ దాస్ అథ‌వాలే ఆదివారం విశాఖ కేంద్రంగా చేసిన వ్యాఖ్య‌లు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - October 18, 2021 / 04:30 PM IST

ఎన్డీయేలో భాగ‌స్వామ్యం కావాలని వైసీపీ భావిస్తుందా? లేక బీజేపీ ఒత్తిడి చేస్తుందా? బీజేపీ, వైసీపీ ఒక తానులో ముక్క‌ల‌ని చాలా కాలంగా టీడీపీ చెబుతోంది. దాన్ని నిజం చేసేలా కేంద్ర మంత్రి రామ్ దాస్ అథ‌వాలే ఆదివారం విశాఖ కేంద్రంగా చేసిన వ్యాఖ్య‌లు ఉన్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన కేంద్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ సంద‌ర్భంగా మూడు మంత్రి ప‌ద‌వుల‌ను బీజేపీ ఆఫ‌ర్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఎన్టీయేలో భాగ‌స్వామ్యం కావ‌డానికి ఢిల్లీ కేంద్రంగా మాట్లాడుకున్న విష‌యాన్ని వైసీపీ నేత‌లు అప్ప‌ట్లో ధ్రువీక‌రించారు. ఇప్పుడు మ‌ళ్లీ తాజాగా అథ‌వాలే ఎన్డీయేలోకి వైసీపీ రావాల‌ని మీడియాముఖంగా ఆహ్వానించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

మ‌రో 15ఏళ్ల పాటు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాద‌ని అథ‌వాలే అంచ‌నా. అందుకే, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఎన్డీయేలో వైసీపీ భాగస్వామ్యం కావాల‌ని కోరాడు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నేత‌లు స్పందించ‌లేదు. రెండు పార్టీల మ‌ధ్య ఏదో జ‌రుగుతోంది..అనే అనుమానాల‌కు అథవాలే బ‌లం ఇచ్చాడు. ఎన్టీయేలోకి వైసీపీ రాబోతుంద‌న్న సంకేతం ఇచ్చాడు. ఒక వేళ అదే జ‌రిగితే, రాష్ట్ర రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు అనూహ్యంగా మారే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.

సాధార‌ణంగా వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు గా ముస్లింలు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు. వాళ్ల ఓటు బ్యాంకు కోసం వైపీసీ వెనుక‌డుగు వేస్తోంది. బీజేపీతో క‌లిసి న‌డిస్తే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ష్ట‌పోయే ప్ర‌మాదాన్ని అంచ‌నా వేస్తున్నారు వైసీపీ నేతలు. లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌లో అనేక అంశాల‌పై వైసీపీ కేంద్రానికి స‌హ‌క‌రిస్తున్న విష‌యాన్ని అథ‌వాలే స్ప‌ష్ట చేశారు. అందుకే, భాగ‌స్వామి అయితే ఇంకా ఏపీకి మేలు చేకూరుతుంద‌ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు.

స‌మీప భ‌విష్య‌తు లోనే ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. బీజేపీ అభ్య‌ర్థి గెల‌వాలంటే, టీఆర్ఎస్,వైసీపీ మ‌ద్ధ‌తు అవ‌స‌రం. అసెంబ్లీ, పార్ల‌మెంట్లో గ‌ణ‌నీయ‌మైన ఓట్లు వైసీపీకి ఉన్నాయి. వాటిని క‌లుపుకుంటే ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి చాలా తేలిగ్గా విజ‌యం సాధిస్తాడు. ఇప్పుడు వైసీపీ ఎన్డీయే భాగ‌స్వామిగా మారితే, బీజేపీకి బ‌లం చేకూరుతుంది. పైగా రాబోయే ఎన్నిక‌ల్లో కూడా క‌లిసి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లొచ్చ‌ని బీజేపీ భావిస్తోంది.

ఒక వేళ ఎన్టీయేలోకి వైసీపీ వెళితే, జ‌న‌సేన పార్టీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని వ్య‌క్తిగ‌తంగా వ్య‌తిరేకించే ప‌వ‌న్ వైసీపీతో క‌లిసి రాష్ట్రంలో ప‌నిచేయ‌డానికి ఇష్ట‌ప‌డే అవ‌కాశం త‌క్కువ‌. అలాగ‌ని, బీజేపీని కాద‌ని ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ ఉన్నాడు. జ‌న‌సేన పార్టీని బీజేపీలో విలీనం చేసేకునే ఆలోచ‌న బీజేపీ అధిష్టానం చేస్తోంది. ఆ విష‌యాన్ని ప‌లుమార్లు జ‌న‌సేనాని చెప్పిన విష‌యం విదిత‌మే. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే, బీజేపీ ఢిల్లీ నుంచి ఏపీపై రాజ‌కీయ చ‌క్రం వేగంగా తిప్పుతోంద‌ని అర్థం అవుతోంది. అథ‌వాలే చేసిన కామెంట్ ఆధారంగా జ‌నసేన భ‌విష్య‌త్‌, వైసీపీ ఎత్తుగ‌డలు కొత్త రూపం దాల్చుకునే అవ‌కాశం లేక‌పోలేదు.