మంత్రి ప‌ద‌వి కోసం జోగి మాస్ట‌ర్ స్కెచ్ ..చంద్ర‌బాబు ఇంటిపై దాడి హంగామా

  • Written By:
  • Publish Date - September 17, 2021 / 03:13 PM IST

అధినేత ప్ర‌త్యేకంగా గుర్తించాలంటే ఏదో ఒక పెద్ద సంఘ‌ట‌న‌లో హీరో కావాలి. అప్పుడే రాజ‌కీయ భ‌విష్య‌త్ కూడా ఉంటుంది. అందుకే, ఇప్పుడు మంత్రి ప‌ద‌విని ఆశిస్తోన్న వైసీసీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ చెల‌రేగిపోయారు. చంద్ర‌బాబు ఇంటి వ‌ద్ద అనుచ‌రుల‌తో క‌లిసి నానా హంగామా సృష్టించారు. అందుకు ప్ర‌ధాన కార‌ణం సీఎం జ‌గ‌న్ ను మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు విమ‌ర్శించ‌డం. ప‌రిపాల‌న‌పై ఇలాంటి విమ‌ర్శ‌లు కొత్త‌వేమీ కాదు, ఇటీవ‌ల ప‌లుమార్లు మాజీ మంత్రులు ప‌లువురు జ‌గ‌న్ మీద ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఆ క్ర‌మంలో లోకేశ్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం అయ్య‌న్న‌పాత్రుడు చేసిన వ్యాఖ్య‌ల కంటే తీవ్ర‌మైన‌వి. కానీ, ఇప్పుడు జోగి ర‌మేష్ సీరియ‌స్ కావ‌డం వెనుక మంత్రి ప‌ద‌వి ఉంద‌ని ప‌లువురు వైసీపీలోని వ‌ర్గాలే అనుకుంటున్నారు.
మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు సీఎం జ‌గ‌న్ పై చేసిన అనుచిత వ్యాఖ్య‌లు చిలికిచిలికి గాలివాన‌లా మారాయి. ఆగ్ర‌హించిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు ఇంటి వ‌ద్ద నిర‌స‌న‌కు దిగారు. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో టీడీపీ కార్య‌క‌ర్త‌లు కూడా పెద్ద సంఖ్య‌లో అక్క‌డికి త‌ర‌లివ‌చ్చారు. ఇరు వ‌ర్గాల మ‌ధ్య కొద్దిసేపు నినాదాల హోరు వినిపించింది. వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ నేతృత్వంలో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు.


అధినేత చంద్రబాబు నివాసం ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో భాగంగా పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. రెండు వర్గాల వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు. వైసీపీ కార్యకర్తల నిరసన గురించి తెలిసి టీడీపీ కార్యకర్తలు భారీగా చంద్రబాబు నివాసానికి తరలివస్తున్నారు.
అయితే, వైసీపీ గూండాలు దాడి చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంట్లోకి చొరబడిన వారిని అడ్డుకుంటే.. టీడీపీ నేతలపై రాళ్లు విసిరారని మండిపడ్డారు. దాడి చేసిన వైసీపీ నేతలను వదిలేసి.. బాధితులైన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను పోలీసులు తోసేశారని, టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని ఆరోపించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం జోగి ర‌మేష్ మంత్రి ప‌ద‌వి కోసం చేసిన హంగామాగా పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి, జోగి ఆశించిన ఫ‌లితం ద‌క్కుతుందా? లేక చంద్ర‌బాబు నాయుడు ఇంటి మీద దాడి ఎమ్మెల్యేగా మిగిలిపోతాడా? అనేది స‌మీప భ‌విష్య‌త్తు నిర్ణ‌యించ‌నుంది.