JC Prabhakar Reddy : ఈడీ ఎదుట హాజ‌రైన టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి

జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు...

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 06:41 AM IST

జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అశ్విత్‌రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. జేసీ ట్రావెల్స్ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభాకర్ రెడ్డి పలు నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చిందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని అధికారులు గుర్తించారు. అశోక్ లేలాండ్ నుంచి స్క్రాప్ కింద 154 బస్సులను కొనుగోలు చేసి నకిలీ పత్రాలతో నాగాలాండ్ రాజధాని కొహిమాలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, 15 రోజుల్లో ఆ బస్సులను ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. నకిలీ పత్రాలు సృష్టించి వాహనాలను పలువురికి విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్‌పై ఈడీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. బస్సు కొనుగోళ్ల కుంభకోణం, మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణకు హాజరుకావాలని ఈడీ జారీ చేసిన నోటీసు మేరకు ప్రభాకర్ రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు.