Janasena ‘PAC’: జ‌నసేన `పీఏసీ` పోస్ట్ మార్టం! బీజేపీతో క‌టీఫ్ దిశ‌గా భేటీ!

సినిమా హీరో, జ‌న‌సేన చీఫ్ ఏది చేసినా సంచ‌ల‌న‌మే. ఆయ‌న హైద‌రాబాద్ నుంచి మంగ‌ళగిరికి శ‌నివారం చేరుకున్న న్యూస్ ఇప్పుడు ప‌లు ర‌కాలుగా చ‌క్క‌ర్లు కొడుతోంది.

  • Written By:
  • Updated On - October 29, 2022 / 05:48 PM IST

సినిమా హీరో, జ‌న‌సేన చీఫ్ ఏది చేసినా సంచ‌ల‌న‌మే. ఆయ‌న హైద‌రాబాద్ నుంచి మంగ‌ళగిరికి శ‌నివారం చేరుకున్న న్యూస్ ఇప్పుడు ప‌లు ర‌కాలుగా చ‌క్క‌ర్లు కొడుతోంది. కీల‌క‌మైన పీఏసీతో ఆదివారం భేటీ కానున్నారు. పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ ఇచ్చే డైరెక్ష‌న్ మేరకు కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఆయ‌న బ‌స్సు యాత్ర‌కు డేట్ ఫిక్స్ అవుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ చైర్మ‌న్ గా ఉన్న నాదెండ్ల మ‌నోహ‌ర్ ఇటీవ‌ల ప‌వ‌న్ బ‌స్సు యాత్ర మీద కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

దాని ప్ర‌కారం అక్టోబ‌ర్ 5వ తేదీ నుంచి బ‌స్సు యాత్ర ప్రారంభం కావాలి. కానీ, ష‌డ‌న్ గా యాత్ర‌ వాయిదా ప‌డింది. కార‌ణాల‌ను మాత్రం జ‌న‌సేన బ‌య‌ట‌పెట్ట‌లేదు. సినిమా షెడ్యూల్స్ ఉన్నాయ‌ని కొంద‌రు, ముంద‌స్తు సంకేతాలు లేవ‌ని మ‌రికొంద‌రు వాయిదా వెనుక కార‌ణాల‌ను వెదుక్కున్నారు. ఇదే స‌మ‌యంలో బీజేపీ, జ‌న‌సేన పొత్తు సంఘ‌ర్ష‌ణగా మారింది. పైకి పొత్తు ఉంద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయి క‌ల‌యిక ఆ రెండు పార్టీల మ‌ధ్య లేదు. అంతేకాదు, బీజేపీ ఢిల్లీ నేత‌లు ఏ మాత్రం ప‌వ‌న్ కు విలువ ఇవ్వ‌డంలేదు.

ఇటీవ‌ల `జ‌న‌వాణి` కోసం విశాఖ వెళ్లిన ప‌వ‌న్ కు చేదు అనుభ‌వం ఎదురైయింది. ఆ రోజున. వైసీపీ విశాఖ గ‌ర్జ‌న ఉన్నందున లా అండ్ ఆర్డ‌ర్ దృష్ట్యా ఆయ‌న్ను దాదాపుగా హోట‌ల్ అరెస్ట్ చేశారు. బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా పోలీసులు నిర్బంధించారు. దీంతో ఆగ్ర‌హంగా ఉన్న క్యాడ‌ర్ మంత్రులు రోజాతో పాటు ప‌లువురి వాహ‌నాల‌పై దాడికి దిగింది. దీంతో వాళ్ల మీద విశాఖ పోలీసులు కేసులు మోపారు. బెయిల్ మీద వాళ్ల‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చిన ప‌వ‌న్ మంగ‌ళగిరిలో శ‌నివారంనాడు వాళ్ల కుటుంబీకుల‌తో భేటీ అయ్యారు. ఇదంతా క్యాడ‌ర్ కు భ‌రోసా ఇవ్వ‌డానికి జ‌న‌సేనాని చేసిన ప్ర‌య‌త్నం.ఇక రాజ‌కీయాల‌కు వ‌స్తే, బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తోన్న ప‌వ‌న్ కు ఢిల్లీ నుంచి సానుకూల స్పంద‌న లేదు. ఎన్నిక‌లకు ముందు రోడ్ మ్యాప్ ఇస్తామ‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ కు అపాయిట్మెంట్ ఇవ్వ‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని వెళ్లాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. కానీ, బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు బ్రేక్ వేస్తున్నారు.

ఈనెల 11వ తేదీన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విశాఖ‌కు వ‌స్తున్నారు. ఆ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ ఏర్పాట్లును చేస్తోంది. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో మోడీ పాల్గొంటారు. ఆ సంద‌ర్భంగా ప‌వ‌న్ కు పిలుపు వ‌స్తుంద‌ని జ‌నసేన ఆశ‌తో ఎదురుచూస్తోంది. కానీ, భీమ‌వ‌రంలో జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా జ‌రిగిన అవ‌మానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆనాడు జ‌రిగిన విధంగానే విశాఖ మోడీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కూడా జ‌రుగుతుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఇదంతా జ‌న‌సేన‌కు న‌ష్టం క‌లిగించేలా ప‌రిణామాలుగా ఆ పార్టీ సైన్యం అంచ‌నా వేస్తోంది. బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు గీసిన గీత‌ను దాట‌లేక జ‌న‌సేనాని కుడితిలో ప‌డ్డ ఎలుక‌లా కొట్టుకుంటున్నారు. ఇంకో వైపు కాలం గ‌డిస్తే టీడీపీ దూరం అవుతుంద‌ని ఆందోళ‌న ఆ పార్టీని వెంటాడుతోంది. ఇప్ప‌టికే బీజేపీ కార‌ణంగా అవ‌మానాల‌ను ఎదుర్కోంటున్న జ‌న‌సేన ఈసారి పీఏసీ స‌మావేశంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.