Elections in AP: ఎన్నికలకు జనసేన దూరం, బోగస్ పై టీడీపీ యుద్ధం, పోలింగ్ డే

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన దూరంగా ఉంది. సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో పవన్ కాడికిందేశాడు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ఓటర్...

  • Written By:
  • Updated On - March 13, 2023 / 09:26 AM IST

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన దూరంగా ఉంది. సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో పవన్ కాడికిందేశాడు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ఓటర్ నాడి బయట పడే ఈ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది. పొత్తులో ఉన్న జనసేన, బీజేపీ ఉన్నప్పటికీ కలిసి ప్రచారం చేసిన దాఖలా లేదు. బహుశా తిరుపతి, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మాదిరిగా ఆ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లోనూ ఉన్నాయని భావించాలి.

ఏపీలో పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాల కోసం సోమవారం పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు. పట్టభద్రులు-3, ఉపాధ్యాయులు- 2, స్థానిక సంస్థల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులకు ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే అయిదు స్థానిక సంస్థల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పట్టభద్ర నియోజకవర్గాల్లో మొత్తం 10 లక్షల 519 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్లు 55,842 మంది ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలో 3,059 మంది ఓటు వేయనున్నారు. మొత్తంగా 10,56,720 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు.

మొత్తం 1,538 పోలింగ్ కేంద్రాలు..

వారి కోసం 1,538 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు అధికారులు. ఆయా నియోజకవర్గాల్లో 500 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వాటిపై ప్రత్యేక నిఘా ఉంచారు. పోలింగ్ కేంద్రాల వద్ద ముమ్మర బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో- ఇప్పటి వరకూ 77,48,010 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున మద్యం సీసాలను సీజ్ చేశారు. 64 ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. 75 మంది అరెస్ట్ అయ్యారు. 7,380 లైసెన్స్డ్ ఆయుధాలు పోలీసుల వద్ద డిపాజిట్ అయ్యాయి. ముందుజాగ్రత్త చర్యగా 7,266 మంది బైండోవర్ కేసులు నమోదు చేశారు.

తెలుగుదేశం పార్టీ బోగస్ ఓట్ల అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చిన నేపథ్యంలో దీనిపై అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్ తో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీడీపీ, సీపీఎం పార్టీల నాయకులు బోగస్ ఓట్లపై ఎన్నికల అధికారులకు ఇదివరకే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదులన్నీ తిరుపతి అర్బన్ నుంచి అందినవే. మిగిలిన నియోజవర్గాల నుంచి ఎలాంటి బోగస్ ఓట్ల ఫిర్యాదులు ఎన్నికల అధికారులకు అందలేదు.

663 పేర్లు బోగస్ ఓట్లను గుర్తిస్తూ చంద్రబాబు ఇదివరకే ఎన్నికల అధికారులకు జాబితాను పంపించారు. ఇందులో 500 పేర్ల మీద ఇప్పటికే విచారణ చేసి, ఈసీకి నివేదికనుపంపించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఒకే అడ్రస్ మీద ఎక్కువ ఓట్లు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు పరిశీలిస్తే వారంతా అదే ప్రాంతానికి చెందిన వారేనని గుర్తించినట్లు పేర్కొన్నారు. అడ్రస్ లో లేని, చనిపోయిన వారికి సంబంధించి జాబితాను ఇప్పటికే పోలింగ్ స్టాఫ్ కి పంపామని వివరించారు.

బోగస్, నకిలీ ఓట్లను చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యంలో అపహాస్యం పాలవుతోందని, గతంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా ఈ తంతు నడిచిందని, పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే పునరావృతమవుతోందని, డిగ్రీ చదవనివారు నకిలీ సర్టిఫికెట్లతో ఓటర్లుగా నమోదైనట్లు టీడీపీ అధినేత చెప్పారు. కొందరు ఎన్నికల అధికారులు నకిలీ పత్రాలపై ఎటువంటి పరిశీలన జరపకుండానే ఆమోదం తెలిపారన్నారు. తిరుపతిలోని 44వ డివిజన్‌లో చికెన్‌ దుకాణం అడ్రస్‌తో 16 బోగస్‌ ఓట్లు నమోదు చేశారని, చాలా ప్రాంతాల్లో ఈ తరహాలోనే జరిగిందని తెలిపారు.

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి బోగస్‌ ఓట్లపై విచారణ జరపాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గుర్తుచేశారు. ఈ బోగస్, నకిలీ ఓట్లు ప్రాథమిక హక్కులకు, ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర నష్టం కలిగిస్తాయన్నారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకుని అక్రమాలను అడ్డుకోవాలని, బోగస్ ఓట్ల నమోదులో పాల్గొన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలి” అని లేఖలో సీఈసీని చంద్రబాబు కోరారు. మొత్తం మీద సెమీ ఫైనల్ జనసేన లేకుండా జరుగుతుంది. ఈ ఎన్నికల్లో పబ్లిక్ నాడీ తీయనుంది. వార్ వన్ సైడ్ గా కనిపిస్తే జనసేన రాజకీయానికి వీరమరణం తప్పదని వైసీపీ సరికొత్త స్లో గన్ వినిపిస్తుంది.

Also Read:  AP Budget: ఏపీ బడ్జెట్‌ రూ.2.6 లక్షల కోట్లు? 17న సభలోకి..!