Site icon HashtagU Telugu

TDP Vs Janasena : పొత్తులో `క‌ట్ట‌ప్ప` రోల్

Babu And Pawan

Babu And Pawan

ఇద్ద‌రు క‌లిసి ఉండాలంటే న‌మ్మ‌కం, విశ్వాసం ముఖ్యం. లేదంటే ఆదిలోనే విడాకులు త‌ప్ప‌ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఇదే సూత్రాన్ని జ‌న‌సేన‌, టీడీపీకి వ‌ర్తింప చేసి చూద్దాం. ఆ రెండు పార్టీలు పొత్తు అంశంపై ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రోక్షంగా గేమ్ ఆడాయి. తొలి ఆట‌లో జ‌న‌సేన సోష‌ల్ మీడియా వేదికగా పైచేయిగా నిలిచింద‌ని చెప్ప‌డానికి ఏ మాత్రం సందేహం అవ‌స‌రం లేదు. ఎందుకంటే, పొత్తు ఇంకా ఖ‌రారు కాకుండానే సీట్ల సంఖ్య, స్థానాలు, మేనిఫెస్టో తెలియ‌చేస్తూ పోస్టుల‌ను పెట్ట‌డం ద్వారా సోష‌ల్ మీడియా వేదికగా బాకా ఊదుతోంది. అంతేకాదు, నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా డిసైడ్ చేసుకున్న‌ట్టు ఆ పార్టీ గ్రూప్ ల్లో పోస్టులు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వాటిని చూసిన తెలుగుదేశం పార్టీ పొత్తుపై పున‌రాలోచ‌న‌లో ప‌డింద‌ని తెలుస్తోంది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్యూహాత్మ‌కంగా గేమ్ మొద‌లు పెట్టిన జ‌న‌సేన క‌నీసం 45 నుంచి 50 అసెంబ్లీ స్థానాల‌ను, ఐదు నుంచి ఆరు లోక్ స‌భ స్థానాల నుంచి పోటీ చేస్తున్న‌ట్టు నిర్థారిస్తోంది. సోష‌ల్ మీడియా పోస్టుల ఆధారంగా ఆయా అసెంబ్లీ, లోక్ స‌భ నియోజ‌వ‌ర్గాల ఉమ్మ‌డి జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. 1.శ్రీకాకుళం జిల్లా : ఇచ్ఛాపురం,పాలకొండ 2.విజయనగరం జిల్లా : శృంగవరపుకోట,నేలిమర్ల.3.విశాఖపట్నం : విశాఖ సిటీలో ఏవైనా రెండు అసెంబ్లీ సీట్లు,భీమిలి, అరుకు లేదా పాడేరు,యలమంచిలి,అనకాపల్లి,పెందుర్తి.4.తూర్పుగోదావరి: కాకినాడ రూరల్,కాకినాడ సిటీ,పిఠాపురం, రామచంద్రాపురం, రాజమండ్రి రూరల్,రాజానగరం, రాజోలు,అమలాపురం. 5.వెస్ట్ గోదావరి: నర్సాపురం,తాడేపల్లి గూడెం(పవన్ కళ్యాణ్ పోటీచేసి నియోజకకర్గం),ఏలూరు,భీమవరం, తణుకు,ఉంగుటూరు.6.కృష్ణా : విజయవాడ వెస్ట్,సెంట్రల్,కైకలూరు, పెడన,నూజివీడు.6.గుంటూరు: గుంటూరు ఈస్ట్,సత్తెనపల్లి, తెనాలి,వేమూరు.7.ప్రకాశం జిల్లా : గిద్దలూరు,చీరాల. 8.నెల్లూరు : నెల్లూరు సిటీ 9.చిత్తూరు : తిరుపతి(పవన్ పోటీచేసి అవకాశాలు ఉన్న మరో నియోజకవర్గం), శ్రీకాళహస్తి.10.అనంతపురం :అనంతపురం టౌన్. 11.కర్నూల్ : ఆళ్లగడ్డ,బనగానపల్లె, ఆలూరు. 13.కడప : రాజంపేట,మైదుకూరు ఇలా జిల్లాల వారీగా జ‌న‌సేన డిసైడ్ చేసుకున్న‌ట్టు వైర‌ల్ అవుతోన్న న్యూస్‌. లోక్ స‌భ స్థానాల‌కు వ‌స్తే జనసేనకి కేటాయించే ఎంపీ స్థానాలు : అనకాపల్లి ,కాకినాడ, నర్సాపురం,మచిలీపట్నం, చిత్తూరు,రాజంపేట. మొత్తంగా జనసేనకి 40-45 ఎమ్మెల్యే సీట్లు,5-6 ఎంపీ సీట్లు ఇచ్చేలా ప్రాథమిక ఒప్పందం కుదిరిందని సోష‌ల్ మీడియా వేదిక‌గా మైండ్ గేమ్ మొద‌లు పెట్టింది. అంతేకాదు, ఇప్ప‌టికే రెండు పార్టీలు పొత్తుపై కింది స్థాయిలో సంకేతాలు ఇవ్వ‌డంతో ఆయా నియోజకవర్గాల్లో పనిచేసుకుంటూ వెళ్తున్నాయ‌ని కొస‌మెరుపు ఇస్తూ క‌నిపిస్తోన్న సోష‌ల్ మీడియా పోస్టులు టీడీపీ అధిష్టానంకు చిరాకు క‌లిగిస్తున్నాయ‌ట‌.

స‌భ్య‌త సంస్కారం లేకుండా పోస్టులు పెట్టే రాజ‌కీయ పార్టీల్లో జ‌న‌సేన ముందు ఉంటుంద‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. మిగిలిన పార్టీల కంటే నాలుగు అడుగులు ముందుకేసి బూతులు, అనుచిత వ్యాఖ్య‌లతో కూడిన పోస్టులు పెట్ట‌డంలో ఆ పార్టీ దిట్ట‌. ఆ విష‌యం 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా ఆ పార్టీ గ్రూపుల్లో వైర‌ల్ అయిన పోస్టులు, వీడియోల‌ను గ‌మ‌నిస్తే ఎవ‌రికైనా అర్థం అవుతుంది. ప్ర‌స్తుతం జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు కొన‌సాగుతోంది. ఆ విష‌యాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌ర్నూలు వేదిక‌గా రెండు రోజుల క్రితం చెప్పారు. ప్ర‌జా వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ఉండేదుకు పొత్తు పై చ‌ర్చించ‌డానికి టీడీపీ ముందుకు రావాల‌ని సూచించారు. కానీ, జ‌న‌సైనికులు కొంద‌రు టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఖరారు అయిన‌ట్టు నిర్థారిస్తూ సీట్ల పంప‌కాన్ని కూడా సోష‌ల్ మీడియాలో తేల్చాశారు. కాపు రిజ‌ర్వేష‌న్ల‌తో కూడిన‌ మేనిఫెస్టోను ప్ర‌చారం చేసుకుంటోంది. ఇలాంటి పోక‌డ‌ను గ‌మ‌నించిన టీడీపీ జ‌న‌సేన‌తో పొత్తు భ‌విష్య‌త్ లో ప్ర‌మాద‌మ‌ని భావిస్తోంద‌ట‌. అంతేకాదు, జ‌నసేన సోష‌ల్ మీడియా పోస్టుల‌కు ధీటుగా ఐ టీడీపీ బృందం కౌంట‌ర్ ఇవ్వ‌డానికి సిద్ధం కావాల‌ని అధిష్టానం సంకేతం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

జ‌గ‌న్ స‌ర్కార్ పై వ్య‌తిరేకంగా ఉన్న ఓట‌ర్లు స‌హ‌జంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ వైపు మొగ్గుచూపుతారు. పైగా చంద్ర‌బాబు సీనియార్టీని, ఆయ‌న చేసిన గ‌త అభివృద్ధి ప‌నుల‌ను చూసి టీడీపీకి వైపు జ‌గ‌న్ వ్య‌తిరేక ఓట‌ర్లు చూస్తారు. ఆ విష‌యాన్ని సింపుల్ గా ఎవరైనా గ్ర‌హించ‌డానికి అవ‌కాశం ఉంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు జ‌న‌సేన వైపు మ‌ళ్ల‌డానికి అవ‌కాశం ఎంత‌? అనే ప్ర‌శ్న వేసుకుంటే వ‌చ్చే స‌మాధానం పొత్తుపై టీడీపీని పున‌రాలోచ‌న‌లో ప‌డేసింద‌ట‌. ఇక నుంచి జ‌న‌సేన‌తో పొత్తు అంశంపై జాగ్ర‌త్త‌గా మెల‌గాల‌ని తాజాగా టీడీపీ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఒక వేళ పొత్తు పెట్టుకుంటే క్షేత్ర స్థాయిలో కాపుల‌ను సామాజికంగా వ్య‌తిరేకించే మోజార్టీ బీసీల ఓటు బ్యాంకును కోల్పోయే ప్ర‌మాదం లేక‌పోలేదని టీడీపీ అంచ‌నా వేస్తోంది. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే కాపుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు అంగీకరించాలి. దీంతో మ‌ళ్లీ మంజునాథ క‌మిటీ సిఫార‌స్సులు బ‌య‌ట‌కు వ‌స్తాయి. అప్పుడు బీసీలు టీడీపీకి మ‌రోసారి దూరంగా ఉండే అవ‌కాశం ఉంది. 2019 ఎన్నిక‌ల్లో అగ్ర వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చిన 10శాతంలో 5శాతం కాపుల‌కు ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. దీంతో టీడీపీకి బీసీలు దూరం అయ్యార‌ని ఆ వ‌ర్గాల నేత‌లు చెబుతున్నారు. అందుకే, కేవ‌లం 23 స్థానాల‌కు టీడీపీ పరిమితం అయింది. ఇలాంటి అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని జ‌నసేన‌తో పొత్తు ఇచ్చే లాభం కంటే న‌ష్టం ఎక్కువ‌ని టీడీపీ గ్ర‌హిస్తుంద‌ట‌. అందుకే, పొత్తుపై పున‌రాలోచ‌న‌లో చంద్ర‌బాబు ప‌డ్డార‌ని టాక్‌.