AP Politics : స‌ర్వేల‌తో జ‌న‌సేన మైండ్ గేమ్‌

జ‌న‌సేన పార్టీ మైండ్ గేమ్ ఆడుతోంద‌ని టీడీపీ గ్ర‌హించింది. అందుకే, ఇటీవ‌ల పొత్తుల‌పై మౌనంగా ఉండడ‌మే కాదు, జన‌సేన గురించి ఏ మాత్రం ప్ర‌స్తావ‌న‌కు రాకుండా చంద్ర‌బాబు జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు.

  • Written By:
  • Updated On - September 22, 2022 / 11:03 AM IST

జ‌న‌సేన పార్టీ మైండ్ గేమ్ ఆడుతోంద‌ని టీడీపీ గ్ర‌హించింది. అందుకే, ఇటీవ‌ల పొత్తుల‌పై మౌనంగా ఉండడ‌మే కాదు, జన‌సేన గురించి ఏ మాత్రం ప్ర‌స్తావ‌న‌కు రాకుండా చంద్ర‌బాబు జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. సాధార‌ణంగా ఏదైనా పాజిటివ్ సంకేతం ఇవ్వ‌డంలో చంద్ర‌బాబు ముందుంటారు. ఆ త‌రువాత వ‌చ్చే ప‌రిణామాల‌ను బేరీజు వేసుకుంటారు. న‌ష్టం జ‌రుగుతుంద‌ని గ్ర‌హించిన వెంట‌నే దూరం జ‌రుగుతారు. ఇప్పుడు జ‌న‌సేన విష‌యంలోనూ చంద్ర‌బాబు దాదాపుగా దూరం జ‌రిగార‌ని తెలుస్తోంది.

ఎన్నిక‌ల రాజ‌కీయంలో పెద్ద‌గా ప్రాధాన్యంలేని జ‌న‌సేన పార్టీ చంద్ర‌బాబు చేసిన ఒకేఒక వ్యాఖ్య ద్వారా మైండ్ గేమ్ ను ప్రారంభించింది. కుప్పం మున్సిపాలిటీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడు పొత్తుల‌పై ప్ర‌స్తావిస్తూ `ఒన‌సైడ్ ల‌వ్ ` అంటూ ప‌రోక్షంగా జ‌న‌సేన‌తో పొత్తు గురించి మాట్లాడారు. అప్ప‌టి నుంచి పెద్ద ఎత్తున జ‌న‌సేన మైండ్ గేమ్ ను ప్రారంభించింది. రాజ్యాధికారం చెరిస‌గం పంచుకుందామ‌నే వర‌కు ఆ గేమ్ ను తీసుకెళ్లింది. ముందుగా సీఎం ప‌ద‌విని జ‌న‌సేనానికి ఇవ్వాల‌ని కండీష‌న్లు కూడా మీడియాముఖంగా పెట్టే వ‌ర‌కు వెళ్లారు. తొలి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు ముగిసిన త‌రువాత చంద్ర‌బాబుకు సీఎం ప‌ద‌విని ఇస్తామంటూ మైండ్ గేమ్ ను తారాస్థాయికి తీసుకెళ్లారు.

వాస్త‌వంగా జ‌న‌సేన కూట‌మి(జ‌న‌సేన, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ) 2019 ఎన్నిక‌ల్లో సుమారు 8శాతం ఓటు బ్యాంకు వ‌చ్చింది. దాన్లో జ‌న‌సేన వాటా ఎంతో కూడా తెలియ‌దు. రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన ప‌వ‌న్ పార్టీ ప‌లుచోట్ల డిపాజిట్ల‌ను కూడా రాబ‌ట్టుకోలేక‌పోయింది. ఒకేఒక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ గెలిచిన‌ప్ప‌టికీ ఆయ‌న ప్ర‌స్తుతం వైసీపీ. పంచ‌న చేరారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద గుర్తింపులేని పార్టీగా జ‌న‌సేన ఉంది. దాని గ్లాస్ గుర్తును కూడా ఇటీవ‌ల జ‌రిగిన తిరుప‌తి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర్య అభ్య‌ర్థికి కేటాయించారు. కేవ‌లం రిజ‌స్ట్ర‌ర్ పార్టీగా మాత్ర‌మే ఎన్నిక‌ల క‌మిష‌న్ జాబితాలో ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న జ‌న‌సేన అర్థ‌భాగం రాజ్యాధికారాన్ని కోరుకుంటున్న‌ట్టు మైండ్ గేమ్ ను ర‌క్తిక‌ట్టించింది.

న‌ష్టాన్ని గ‌మ‌నించిన చంద్ర‌బాబు వ్యూహాత్మ‌క మౌనాన్ని జ‌న‌సేన విష‌యంలో అనుస‌రిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కొన్ని సర్వే సంస్థ‌ల ద్వారా జ‌న‌సేన మ‌రో కోణం నుంచి మైండ్ గేమ్ ను ప్రారంభించింద‌ని తెలుస్తోంది. సుమారు 30 స్థానాల్లో టీడీపీ అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌ను నిర్దేశిస్తామ‌ని స‌ర్వేల‌ను విడుద‌ల చేస్తోంది. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోనూ, రాయ‌ల‌సీమ‌లోని ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రాబ‌ల్యం ఉంద‌ని తాజా స‌ర్వేల సారాంశం. అంతేకాదు, భీమ‌వ‌రం, న‌ర‌సాపురం, రాజ‌మండ్రి రూర‌ల్‌, రాజ‌మండ్రి, గాజువాక‌, విశాఖ నార్త్ త‌దిత‌ర స్థానాల‌ను ఎంపిక చేసుకుని ఆయా స్థానాల్లో 25 నుంచి 39శాతం వ‌ర‌కు ఓటు బ్యాంకు ఉంద‌ని ఫోక‌స్ చేస్తోంది. ఆ స‌ర్వేల‌ను టీడీపీ గ్రూపుల‌కు చేర్చ‌డం జ‌న‌సేన తాజా మైండ్ గేమ్ లోని స‌రికొత్త ఎత్తుగ‌డ‌గా టీడీపీ భావిస్తోంది.

క‌నీసం 52 స్థానాల్లో గ‌ట్టిపోటీ జ‌న‌సేన ఇస్తుంద‌ని, 30 స్థానాల్లో టీడీపీ ఓటు బ్యాంకును భారీగా చీల్చుకుంటుంద‌ని తాజాగా విడుద‌లైన కొన్ని స‌ర్వేల్లోని సారాంశం. జ‌న‌సేన కార‌ణంగా కేవ‌లం టీడీపీకి మాత్ర‌మే న‌ష్ట‌మ‌నే విధంగా ఆ స‌ర్వేలు చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. రాష్ట్రంలోని ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైసీపీకి జ‌న‌సేన కార‌ణంగా న‌ష్ట‌మ‌నే రీతిలో ఒక్క సర్వే కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్ చ‌ల్ చేస్తోన్న స‌ర్వేలు టీడీపీని కార్న‌ర్ చేయ‌డానికి ఆడుతోన్న మైండ్ గేమ్ లో భాగ‌మ‌ని టీడీపీ గ్ర‌హించింద‌ట‌. అందుకే, జ‌న‌సేన ఆడుతోన్న మైండ్ గేమ్ కు పూర్తిగా టీడీపీ దూరంగా ఉండాల‌ని తాజాగా నిర్ణ‌యించుకుంద‌ట‌. ఇవ‌న్నీ చూస్తుంటే, జ‌న‌సేన పెట్టుకున్న ఆశ‌ల‌కు టీడీపీ దాదాపు గండికొట్టిన‌ట్టే కనిపిస్తోంది.