Site icon HashtagU Telugu

Pawan Kalyan : కౌలు రైతుల ఆశాకిర‌ణం ప‌వ‌న్

Pawankalyan

Pawankalyan

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న క్రేజ్ తో ఏ అంశాన్ని తీసుకున్న‌ప్ప‌టికీ హైలెట్ కావ‌డం స‌హ‌జం. గ‌తంలో ఉద్దానం కిడ్నీ స‌మ‌స్య‌ల‌ను తీసుకుని ఢిల్లీ వ‌ర‌కు ఆ స‌మ‌స్య‌ను వినిపించారు. మిలిగిన పార్టీల పార్టీల‌ను కూడా ఆ స‌మ‌స్య‌పై మాట్లాడేలా చేశారు. ఆక్వా రైతుల స‌మస్య, అగ్రి గోల్డ్‌, అమ‌రావ‌తి రైతుల స‌మ‌స్య‌, ఇసుక సిండికేట్ తో కార్మికుల ఇక్క‌ట్లు,లిక్క‌ర్ సిండికేట్లు, సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల పెంపు, విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ పోరాటం తాజాగా కౌలు రైతుల ఆత్మ‌హ‌త్య‌లు..ఇలా ఏ అంశంపై ఫోక‌స్ పెట్టిన‌ప్ప‌టికీ ఆ స‌మ‌స్య‌ల గురించి అసెంబ్లీలోనూ, అసెంబ్లీ బ‌య‌ట చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా కౌలు రైతుల కుటుంబాల‌ను ఆదుకోవ‌డానికి కౌలు రైతుల భ‌రోసా యాత్ర‌కు శ్రీకారం చుట్టారు. అనంత‌పురం జిల్లాలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల కుటుంబాల‌ను ఓదార్చారు. వాళ్ల‌కు ల‌క్ష రూపాయాల చొప్పున ప‌రిహారం పార్టీ త‌ర‌పున అందించారు.అనంతపురం జిల్లా కొత్త చెరువులో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా ఇటీవల సాగునష్టం, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు శ్రీ సాకే రామకృష్ణ కుటుంబ సభ్యులను ప‌వ‌న్ ప‌రామ‌ర్శించారు. పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు. పార్టీ తరఫున అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కౌలురైతుల భరోసా యాత్ర మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభం అయింది. సత్యసాయి పుట్టపర్తి జిల్లా కొత్తచెరువు నుంచి ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడాది కాలంలో 28 మంది కౌలు రైతులు మృతి చెందగా, ఆయా రైతుల కుటుంబాలను పరామర్శించి పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అంద‌చేస్తూ భ‌రోసా క‌ల్పిస్తున్నారు.
ఏయే జిల్లాల్లో ఎంత మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలను జనసేన క్యాడ‌ర్ ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం కింద సేకరించింది. ఆ సమాచారం ప్రకారమే ఆయా జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్‌ కలుసుకుంటారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎంతో కొంత సాయం చేయాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానంటూ ప్ర‌క‌టించ‌డంతో పాటు రూ.5 కోట్లు పార్టీకి విరాళంగా ప్ర‌కటించిన విష‌యం విదిత‌మే.పవన్‌ మంగళవారం ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మండల కేంద్రమైన కొత్త చెరువు వెళ్లారు. అక్కడ బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి సాయం అందించి ఆ తర్వాత ధర్మవరం మండలంలోని గొట్లూరు గ్రామం కు వెళ్లారు. అక్క‌డ నుంచి అనంతపురం రూరల్‌ మండలం పూలకుంట, మన్నీల గ్రామాలకు వెళ్లారు. ఆయా గ్రామాల్లో ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారు. రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ పరామర్శల తర్వాత మన్నీల గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ స్పీచ్ సంచ‌ల‌నంగా మారింది. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మరికొందరు కౌలు రైతుల కుటుంబాలకు ర‌చ్చ‌బండ వ‌ద్ద‌ ఆర్థిక సాయం అందించి వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకునేలా ప్రొగ్రామ్ ప్లాన్ చేయ‌డంతో ఆయా గ్రామాల్లో జ‌నం హ‌డావుడి క‌నిపించింది.