Janasena : ఊరూవాడ జ‌న‌సేన పుస్త‌కాలు

రాజ్యాధికారం దిశ‌గా దూకుడుగా వెళుతోన్న జ‌న‌సేన పార్టీ ప్ర‌స్థానం పుస్త‌క రూపంలోకి వ‌చ్చేసింది

  • Written By:
  • Updated On - May 20, 2022 / 02:34 PM IST

రాజ్యాధికారం దిశ‌గా దూకుడుగా వెళుతోన్న జ‌న‌సేన పార్టీ ప్ర‌స్థానం పుస్త‌క రూపంలోకి వ‌చ్చేసింది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఎనిమిదేళ్ల ప్ర‌యాణం పూస‌గుచ్చిన‌ట్టు ప్రింట్ వేశారు. ఏడు వాల్యూమ్ లు పార్టీ ప్ర‌స్థానం గురించి రాయ‌డానికి స‌రిపోయింది. ఆ పుస్త‌కాల‌ను బ‌హిరంగ మార్కెట్ లోకి విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే వాటిని అధికారికంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. జనసేన పార్టీ ఇటీవలే ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. 2014 మార్చి 14న జనసేన అవతరించింది. ఈ ఏడాది మార్చి 14న ఇప్పటంలో జనసేన పార్టీ ఎనిమిదో ఆవిర్భావ సభ నిర్వహించింది.

ఆవిర్భావం నుంచి ఇప్ప‌టి వరకు జనసేన పార్టీ ప్రస్థానం, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగాలను పుస్తకాల రూపంలో తీసుకువచ్చారు. ఏడు సంకలనాలుగా రూపొందించిన ఈ పుస్తకాలను జనసేన మీడియా విభాగం శుక్ర‌వారం హైదరాబాదులో పవన్ కల్యాణ్ కు అందించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పార్టీ మీడియా విభాగం ప్రతినిధులను అభినందించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ, ఈ పుస్తకాలు తనకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయని అన్నారు. ఈ ప్రస్థానంలో జనసేన పార్టీ ప్రజలతో ఎంతగా మమేకం అయిందీ, ప్రజాసేవకు ఏ విధంగా చిత్తశుద్ధితో అంకితమైందీ. ఈ ఏడు సంకలనాలు తెలియజేస్తున్నాయని వివరించారు.

పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విధివిధానాలు, ప్రజాసమస్యలు, రాజకీయ, సామాజిక అంశాలపై చేసిన ప్రసంగాలను అక్షరబద్ధం చేయడం పార్టీ శ్రేణులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ పుస్తకాలు తనకు ఒక దిక్సూచిలా ఉన్నాయని అభివర్ణించారు. ప్రతి జిల్లాలో మాట్లాడినవి, స్థానిక సమస్యల నుంచి రాష్ట్ర స్థాయిలో సమస్యల వరకు ఏ విధంగా స్పందించామో ఈ పుస్తకాలు తెలియజేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ మీడియా విభాగం ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్, మీడియా విభాగం ప్రతినిధులు చక్రవర్తి, ఎల్. వేణుగోపాల్ పాల్గొన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీ కూడా చేయ‌ని వినూత్న ప్ర‌స్తానాన్ని పుస్త‌క రూపంలోకి జ‌న‌సేన తీసుకొచ్చింది. వాటిని త్వ‌ర‌లోనే ప్ర‌తి గ్రామాంలోనూ ఉండేలా పంపిణీ చేయ‌డానికి సిద్దం అవుతున్నారు. ఈసారి రాజ్యాధికారం దిశ‌గా ప‌వ‌న్ అడుగులు వేస్తున్న క్ర‌మంలో పుస్త‌కాలు ఉప‌యోగ‌ ప‌డ‌తాయ‌ని భావిస్తున్నారు.