Site icon HashtagU Telugu

Chandrababu Naidu: సింహానికి రాజ‌కీయ బోను

Babu Lion Jail

Babu Lion Jail

సింహం తోక ఆడిస్తుందా? తోక సింహాన్ని ఆడిస్తుందా? అనే చందంగా టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారం ఉంది. ఏపీలో క‌నీసం రెండుశాతం ఓటు బ్యాంకులేని బీజేపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని వెంటాడుతోంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద గుర్తింపేలేని జ‌న‌సేన పార్టీ టీడీపీని ఉక్కిబిక్కిరి చేస్తోంది. ఈ ప‌రిణామాన్ని గ‌మ‌నిస్తే తోక సింహాన్ని ఆడిస్తున్న‌ట్టుగా ఉంది.

తెలుగుదేశం పార్టీ అత్యంత ఘోర‌మైన ప‌రిస్థితుల్లో కూడా 40శాతం ఓటు బ్యాంకును క‌లిగి ఉంది. బ‌హుశా 2019 కంటే దారుణ‌మైన ప‌రిస్థితి టీడీపీకి ఉండ‌దు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో 2019 ఎన్నిక‌ల్లో ల‌భించిన 40శాతం ఓటు బ్యాంకు కు అద‌నంగా క‌నీసం 5శాతం వ‌స్తుంద‌ని స‌ర్వేల‌న్నీ అంచ‌నా వేస్తున్నాయి. అంటే, ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల జ‌రిగితే 45శాతం ఓటు బ్యాంకు టీడీపీకి ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. అదే, జ‌నసేన, బీజేపీకి ఎంత ఓటు బ్యాంకు ఏపీలో ఉందో ఎవ‌రికీ తెలియ‌దు. ఎందుకంటే, 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన, బీఎస్పీ , కమ్యూనిస్ట్ ల కూట‌మికి వ‌చ్చిన ఓటు బ్యాంకు సుమారు 6శాతం. దానిలో జ‌న‌సేన వాటా ఎంత అనేది ఎవ‌రికీ తెలియ‌దు. ఇక తాజా స‌ర్వేలు మాత్రం ఆ పార్టీకి 5శాతం ఓటు బ్యాంకు ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నాయి. ఏపీలో బీజేపీకి అత్య‌ధికంగా రెండుశాతానికి మించిన ఓటు బ్యాంకు లేద‌ని స‌ర్వ‌త్రా తెలిసిన విష‌య‌మే.

Also Read:  Amaravati Farmers: అమ‌రావ‌తి రైతుల‌పై పోలీసుల పాడుప‌ని.!

2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి సుమారు 51శాతం ఓటు బ్యాంకు వ‌చ్చింది. ఇప్పుడు జ‌గ‌న్ గ్రాఫ్ ప‌డిపోయింద‌ని జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి స‌ర్వేల వ‌ర‌కు అంచ‌నా వేస్తున్నాయి. ప్ర‌స్తుతం 40 నుంచి 45 శాతం మ‌ధ్య ఆ పార్టీకి ఓటు బ్యాంకు ఉండొచ్చ‌ని ప‌లు స‌ర్వేల సారాంశం. ఇంకా టైం గ‌డిచే కొద్దీ జ‌గ‌న్ గ్రాఫ్ ప‌డుతుంద‌ని చెబుతున్నారు. అంటే, ఏ పార్టీకి ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసిన‌ప్ప‌టికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావ‌డానికి అవ‌కాశం ఉంది. అంత బ‌ల‌మైన పార్టీని బీజేపీ, జ‌న‌సేన వ్యూహాత్మ‌కంగా ఆడుకుంటుంటే, వైసీపీ మైండ్ గేమ్ కు తెర‌లేపింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఆచితూచి అడుగు వేస్తున్నారు. సింహం తోక‌ను ఆడించాల‌న్న సూత్రాన్ని వ‌దిలేసి మేధోమ‌థ‌నం చేస్తున్నారు. జ‌న‌సేన‌, బీజేపీ పార్టీల‌ను క‌లుపుకుని పోవాల‌ని త‌లపోస్తున్నారు. అందుకే, జ‌గ‌న్ స‌ర్కార్ చేస్తోన్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ఉమ్మ‌డిగా పోరాడాల‌ని పిలుపు నిచ్చారు. కానీ, ఆ పార్టీల‌ నుంచి వ‌స్తోన్న సానుకూల స్పంద‌న అంతంత మాత్ర‌మే.

ఇటీవ‌ల విశాఖ కేంద్రంగా జ‌న‌సేనానికి జ‌రిగిన అవ‌మానాన్ని ప్ర‌శ్నిస్తూ చంద్ర‌బాబు ముందుకొచ్చారు. విజ‌య‌వాడ‌లోని ప్రైవేటు హోటల్ కు వెళ్లి ప‌వ‌న్ కు సంఘీభావం ప్ర‌కటించారు. ఆ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపై ఉమ్మ‌డి పోరుకు సిద్ధం కావాల‌ని సంయుక్తంగా మీడియాకు ప్ర‌క‌టించారు. కానీ, న‌వంబ‌ర్ 12, 13, 14 తేదీల్లో `సోష‌ల్ ఆడిట్` అంటూ జ‌న‌సేన ఒంట‌రిగా వెళుతోంది. రెండు రోజుల క్రితం జ‌రిగిన జ‌న‌సేన పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ సమావేశంలోనూ చంద్ర‌బాబు పిలుపు గురించి చ‌ర్చించ‌లేద‌ని తెలుస్తోంది. అంటే, చంద్ర‌బాబు ఆహ్వానాన్ని జ‌న‌సేన త‌క్కువ‌గా అంచనా వేస్తుందా? అంటే వ‌చ్చే స‌మాధానం అందరికీ తెలిసిందే. ఇక బీజేపీ అటు జ‌న‌సేన ఇటు టీడీపీ రెంటినీ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డంలేదని చెప్పాలి. ఇలాంటి ప‌రిస్థితుల్లో సింహం తోక‌ను ఆడించ‌డానికి బ‌దులుగా తోక సింహాన్ని ఆడిస్తున్న చందంగా ఏపీ విప‌క్ష రాజ‌కీయం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో!

Also Read:   Amaravathi: అమ‌రావ‌తి పై `సుప్రీం` చీఫ్ ల‌లిత్ కీల‌క నిర్ణ‌యం

Exit mobile version