Site icon HashtagU Telugu

Janasena : జోగ‌య్య బెడ్ మీద ఊహాత్మ‌క స‌ర్వే! ఏపీ సీఎం ప‌వ‌నేన‌ట!ఇక గోవిందా!!

Janasena

Janasena

స‌ర్వేల‌కు అర్థంప‌ర్థంలేకుండా పోయింది. ఆఫీస్ ల్లో కూర్చుని పిచ్చ స‌ర్వేల‌ను(Janasena) చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా సంపాద‌నప‌రులుగా మారుతున్నారు. ఇక ఇప్పుడు మాజీ ఎంపీ, కాపు జాతి పోరాట‌యోధుడు హ‌రిరామ‌జోగ‌య్య బెడ్ మీద ప‌డుకుని స‌ర్వే (Survey) చేసి, విశ్లేష‌ణ చేస్తున్నారు. దీనిలో త‌ప్పులేదు, ఆయ‌న‌కు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ, ఆ సర్వే చూసినోళ్ల‌కు ఆయ‌న బెడ్ మీద ప‌డుకుని క‌ల‌గ‌ని విశ్లేష‌ణ చేసిన‌ట్టు ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. బెడ్ మీద క‌ద‌ల్లేని ప‌రిస్థితుల్లో ఆయ‌న చేసిన స‌ర్వే, విశ్లేష‌ణ గురించి మాట్లాడుకోవ‌డానికి కార‌ణం ఆయ‌న పూర్వ‌పు రాజ‌కీయ చ‌రిత్ర‌. లేదంటే, దాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రంలేదు. ఆయ‌న‌కున్న ప్రాముఖ్య‌త‌, ప్రాధాన్యం రాజ‌కీయ రంగంలో వేరు. ఆయ‌నో రాజ‌కీయ పండితునిగా ఒక‌ప్పుడు ఉండే వాళ్లు. మేధావి వ‌ర్గానికి చెందిన రాజ‌కీయ నాయ‌కుల జాబితాలో ఆయ‌న పేరు ఉండేది. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం కావాల‌ని కోరుకుంటున్నారు. అందుకు, త‌గిన విధంగా ఊహాత్మ‌క విశ్లేష‌ణ చేశార‌ని ఆ స‌ర్వే సారాంశాన్ని గ‌మ‌నిస్తే బోధ‌ప‌డుతోంది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా పిచ్చ స‌ర్వేల‌ను(Janasena) 

జ‌న‌సేనాని(Janasena) ప‌వ‌న్ క‌ల్యాణ్ వారాహి యాత్ర‌ను పూర్తి చేస్తే వైసీపీకి ఓటు బ్యాంకుతో పాటు సీట్లు త‌గ్గుతాయ‌ని అంచ‌నా వేశారు. అదే సందర్భంలో టీడీపీ ఓటు బ్యాంక్ 38 శాతానికి ఫిక్స్ చేశారు. ప‌వ‌న్ వారాహి యాత్ర చేసినా, చేయ‌క‌పోయినా టీడీపీ ఓటు బ్యాంక్ 38శాతమ‌ని చెబుతూ సీట్ల‌లో మాత్రం ఐదు వ్య‌త్యాసం ఉంటుంద‌ని తేల్చారు. ఆశ్చ‌ర్యక‌రంగా ప‌వ‌న్ వారాహి యాత్ర చేస్తే ప్ర‌స్తుతం వైసీపీకి 48శాతం ఉన్న ఓటు బ్యాంక్ 40శాతానికి ప‌డిపోతుంద‌ని జోస్యం(Survey) చెప్పారు. అంటే, వారాహి యాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌కుండా అడ్డుకోవాల‌ని ప‌రోక్షంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఈ పెద్దాయ‌న సంకేతాలు ఇస్తున్నారు. ఫ‌లితంగా క‌ష్ట‌ప‌డ‌కుండా ప‌వ‌న్ కు హైప్ వ‌స్తుంది. గ‌తంలో కూడా ఇలాంటి ప‌రిణామం ప్ర‌తిసారీ జ‌న‌సేనాని ప‌ర్య‌ట‌న‌లో జ‌రిగింది.

Also Read : Janasena : ప‌వ‌న్ CM కోసం హ‌రిరామ‌జోగయ్య `వెట‌ర‌న్` పాలిటిక్స్

ఇంకో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమంటే టీడీపీ, జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటే జ‌న‌సేన‌కు(Janasena) 50, టీడీపీకి 70 స్థానాలు వ‌స్తాయ‌ని ఈ పెద్దాయ‌న వేసిన ఊహాత్మ‌క అంచ‌నా. అంటే, ఈ లెక్క‌న ఎన్ని చోట్ల జ‌న‌సేన పోటీ చేయాలి? అనే ప్ర‌శ్న వేసుకుంటే హ‌రిరామ‌జోగ‌య్య బెడ్ మీద చేసిన స‌ర్వేలోని (Survey) నిజమేమిటో అర్థమ‌వుతోంది. ఓట్ల శాతం లెక్కన తీసుకుంటే ప్ర‌స్తుతం 14శాతం ఉంద‌ని ఆయ‌న ఊహిస్తూ వారాహి పూర్తి చేస్తే 20శాతానికి చేరుకుంటుంద‌ట‌. ఈ లెక్క‌న ఆయ‌న చెప్పిన విధంగా 20శాతం ఓటు బ్యాంకున్న జ‌నసేన 50 స్థానాల‌ను గెలుచుకుంటే 38శాతం ఉన్న టీడీపీ ఎన్ని గెలుచుకోవాలి? అని ప్ర‌శ్నించుకుంటే ఈ స‌ర్వేలోని సారంశం నేతిబీర‌కాయ‌లోని నెయ్యి సామెత‌ను గుర్తు చేస్తోంది. విచిత్రంగా వారాహి పూర్తి చేస్తే అంటూ ప‌దేప‌దే హ‌రిరామ‌జోగయ్య విశ్లేష‌ణ చేశారు. అంటే, ఆ యాత్ర పూర్తిగా ప‌వ‌న్ చేసే అవ‌కాశం లేద‌ని జోగ‌య్య ముందుగానే చెప్పేస్తున్నారు. దానికి కార‌ణాలు లేక‌పోలేదు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ ఏ విధంగా ప్ర‌చారం చేశారో ప్ర‌జ‌లు చూశారు. ప్ర‌తి నాలుగు రోజులుకు ఒక‌సారి ఫాంహౌస్, రిసార్ట్స్ వెళ్లిన ప‌వ‌న్ వాల‌కాన్ని అంద‌రికీ గుర్తే. బ‌హుశా అందుకేనేమో, వారాహి పూర్తి చేస్తే అంటూ జోగ‌య్య విశ్లేష‌ణ అందించారు.

జనసేన ఒంటరిగా పోటీ చేస్తే..

ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన(Janasena) ఒంటరిగా పోటీ చేస్తే 14 శాతం ఓట్లతో 20 సీట్లు సాధిస్తార‌ని జోగయ్య అంచనా వేయ‌డం గ‌మ‌నార్హం. అలాగే టీడీపీకి 38 శాతం ఓట్లతో 55 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. అధికారంలోని వైసీపీకి 47 శాతం ఓట్లతో 100 సీట్లు వస్తాయని తేల్చేశారు. ఇతరులకు 1 శాతం సీట్లు వస్తాయని జోగయ్య బెడ్ మీద చేసిన స‌ర్వే (survey) చెబుతోంది. వారాహి బస్సు యాత్ర పూర్తయితే మాత్రం జనసేన ఓట్ల శాతం 14 నుంచి 20 శాతానికి పెరిగి 20 నుంచి 35 సీట్లను గెలుచుకుంటుంద‌ట‌. అప్పుడు కూడా టీడీపీకి వచ్చే ఓట్ల శాతం 38 శాతమే ఉంటుందని, సీట్లు మాత్రం 60 వస్తాయని జోగ‌య్య చెబుతున్నారు. పవన్ యాత్ర పూర్తయితే వైసీపీ ఓట్ల శాతం మాత్రం 40 శాతానికి పడిపోతుందని, సీట్లు కూడా 100 నుంచి 80కి తగ్గుతాయని జోగయ్య విశ్లేషిస్తున్నారు. ఇతరుల ఓట్ల శాతం కూడా 2కు పెరుగుతుందట‌.

 

ఊహాత్మ‌క కాపు గేమ్ మొద‌లు

జనసేన-టీడీపీ పొత్తు ఉంటే, ఈ కూటమికి 58 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తూ జనసేనకు(Janasena) 50 సీట్లు, టీడీపీకి 70 సీట్లు వ‌స్తాయ‌ని జోగ‌య్య చెప్ప‌డం గ‌మ‌నార్హం. అప్పుడు వైసీపీకి 40 శాతం ఓట్లతో 55 సీట్లు మాత్రమే వస్తాయని విశ్లేషించారు. ఇతరులకు మాత్రం 2 శాతం ఓట్లు వస్తాయని అంచ‌నా వేయ‌డం బెడ్ స‌ర్వేలోని ఊహాత్మ‌కం. వారాహి యాత్ర, టీడీపీ-జనసేన పొత్తు కారణంగా జనసేనకు వచ్చే సీట్ల సంఖ్య 20 నుంచి 50 సీట్లకు పెరుగుతుందని, టీడీపీకి 70 సీట్లు వస్తాయని చెప్ప‌డం ఊహాత్మ‌క కాపు గేమ్ మొద‌లు పెట్టారు. అంతేకాదు, 50 సీట్లు వ‌చ్చిన‌ప్ప‌ట‌వ‌కీ ప‌వ‌న్ కళ్యాణ్ సీఎం అవుతారని జోగయ్య త‌న సీనియార్టీని రంగ‌రించి చెబుతున్నారు. చంద్రబాబుతో సీఎం పదవి పంచుకుని సీఎం అవుతారా లేక మరేదైనా ఒప్పందం చేసుకుని సీఎం అవుతారా? అనేది జోగయ్య వెల్లడించలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పవర్ కళ్యాణ్ కావడం ఖాయమని జోగయ్య బెడ్ మీద స‌ర్వేలోని(Survey) ఊహాత్మ‌క విశ్లేష‌ణ‌.

Also Read : Janasena-BjP : పొత్తుపై విచిత్ర సంకేతాలు! జ‌న‌సేనకు `వీర‌మ‌ర‌ణ` గండం!

జోగ‌య్య గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఆయ‌న చెప్పిన దానికి రివ‌ర్స్ లో ఆలోచించాల‌ని చెబుతున్నారు. వారాహి యాత్ర‌ను అడ్డుకోవడం ద్వారా క‌ష్ట‌ప‌డ‌కుండా ప‌వ‌న్ కు హైప్ తీసుకొచ్చే ఊహాత్మ‌క సర్వేగా (Survey) భావిస్తున్నారు. అంతేకాదు, కాంగ్రెస్ భావ‌జాలం పుష్క‌లంగా ఉన్న జోగ‌య్య తొలి నుంచి వైఎస్ కుటుంబానికి బాగా ద‌గ్గ‌ర‌గా ఉండే వాళ్లు. అందుకే, ఆయ‌న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి క‌లిసొచ్చేలా ఈ ఊహాత్మ‌క స‌ర్వేను విశ్వేషించార‌ని టీడీపీ భావిస్తోంది. ఆయ‌న చెప్పిన దాని ప్ర‌కారం 50 చోట్లు జ‌న‌సేన(Janasena) గెలవాలంటే క‌నీసం 70 నుంచి 80 స్థానాల్లో పోటీ చేయాలి. ఆ మేర‌కు అభ్య‌ర్థులు ఆ పార్టీకి లేర‌ని జోగ‌య్య‌కు తెలియ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. అందుకే, ఈ సర్వేను బెడ్ మీద పుట్టిన ఊహాత్మ‌కంగా భావించాల్సి ఉంటుంది.