Pawan Kalyan: ‘రైతులకు’ అండగా నిలవడం మా బాధ్యత!

సాగు నష్టాలు, రుణ భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారు.

  • Written By:
  • Updated On - April 20, 2022 / 04:48 PM IST

సాగు నష్టాలు, రుణ భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారు. వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడంలో పాలకపక్షం విఫలమవుతోంది. ఇందుకు రైతుల ఆత్మహత్యల ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణలు అని అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా మేళిగనూరుకి చెందిన దేవరమణి జగదీష్, ప్రకాశం జిల్లా కాటూరివారి పాలేనికి చెందిన పాలగిరి రామ్మూర్తి పంట నష్టాలు, అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. బలవన్మరణానికి ఒడిగట్టాల్సిన పరిస్థితులు వారి ముందు ఉన్నాయంటే వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం లేదు అని అర్థం అవుతోంది. బాధ్యతగల పార్టీగా జనసేన కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నమ్ముకొన్నవారి గురించి మాట్లాడుతుంటే… పాలక పక్షం మాత్రం దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తోందని విమర్శించారు జనసేనాని.

రైతులకు అండగా నిలవడం జనసేన ఒక బాధ్యతగా చేపట్టింది. బురద రాజకీయాలు చేతకాదు. ఆత్మహత్యలపై కూడా రాజకీయాలు మాట్లాడటం కట్టిపెట్టి, అన్నదాతలకు ఏ విధమైన తోడ్పాటు ఇవ్వాలో బాధ్యతగల పదవుల్లో ఉన్నవాళ్ళు ఆలోచిస్తే మేలు అని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులకు, భూ యజమానులకు ఊరట ఇస్తామని ఐ.ఏ.ఎస్. అధికారులు ప్రెస్ మీట్ ద్వారా వివరించడం రైతులకు కాస్త ఊరట కలుగుతుంది. భూ రికార్డుల్లో పొరపాటును సరిచేయమని అధికారుల చుట్టూ తిరిగి విసిగి ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉన్నత స్థాయి అధికారుల్లో కదలిక తెచ్చిందని అర్థమవుతోంది.

సదరు రైతు సమస్యపై గుంటూరు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఆదేశాలు ఇచ్చినా క్షేత్ర స్థాయి రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం వెనుక ఏవైనా రాజకీయపరమైన ఒత్తిళ్ళు ఉన్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. సాగు నష్టాలు, అప్పులు, భూ రికార్డుల్లో లోపాలతో ఇక్కట్ల పాలై బలవన్మరణాల దిశగా రైతులు ఆలోచన చేసే పరిస్థితులు రాకుండా వ్యవస్థలు బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళాలి. ఉన్నతస్థాయి రెవెన్యూ, సర్వే అధికారులతోపాటు జిల్లా స్థాయిలో ఉన్న ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు రైతాంగంలో మనోస్థైర్యం నింపే దిశగా చొరవ తీసుకొని- వారి సమస్యలు సత్వర పరిష్కారానికి మానవతా దృక్పథంతో స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.