Pawan Kalyan : నా పార్టీ నా ఇష్టం.!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా రోజులుగా మౌనంగా ఉన్నాడు. బ‌డ్జెట్ సంద‌ర్భంగా ఆయ‌న స్పందించాడు.

  • Written By:
  • Publish Date - February 2, 2022 / 12:15 PM IST

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా రోజులుగా మౌనంగా ఉన్నాడు. బ‌డ్జెట్ సంద‌ర్భంగా ఆయ‌న స్పందించాడు. తెలుగు రాష్ట్రాల‌కు ఏ ఒక్క ప్రాజెక్టుగానీ, ఆర్థికంగా ఆదుకునే అంశం బ‌డ్జెట్లో లేక‌పోయిన‌ప్ప‌టికీ శ‌భాష్ అంటూ కితాబిచ్చాడు. తలాతోక‌లేని బడ్జెట్ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ మండిప‌డ్డాడు. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల గురించి ప్ర‌స్తావించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టాడు. ఏపీ స‌ర్కార్ మ‌ధ్యేమార్గంగా స్పందించింది. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బ‌డ్జెట్ గురించి ఢిల్లీ కేంద్రంగా రియాక్ట్ అయ్యాడు. ఏపీకి ఎలాంటి ప్ర‌త్యేక కేటాయింపులు లేక‌పోవ‌డాన్ని ప్ర‌స్తావించాడు. ఇక కాంగ్రెస్‌, టీడీపీ త‌మ‌దైన శైలిలో బ‌డ్జెట్ ను వ్య‌తిరేకించారు. తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌న్ మిన‌హా ఎవ‌రికీ ఈ బ‌డ్జెట్ న‌చ్చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.ప్ర‌స్తుతం జ‌న‌సేన‌, బీజేపీ స్నేహం ఎండ‌మావుల్లా కొన‌సాగుతోంది. తిరుప‌తి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో రెండు పార్టీలు క‌లిసి వెళ్లిన‌ప్ప‌టికీ డిపాజిట్లు అక్క‌డ రాలేదు. క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి ప‌వ‌న్ మ‌ద్ధ‌తు ఇవ్వ‌లేదు. త‌ర‌చూ విడిపోతూ..ఎప్పుడో ఒక‌సారి క‌లుస్తూ ఆ రెండు పార్టీలు ప‌నిచేస్తున్నాయి. తెలంగాణ‌లోనూ ఆ రెండు పార్టీల మ‌ధ్య ఏ మాత్రం పొస‌గ‌డంలేదు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల నుంచి ఎవ‌రికివారే ఉండ‌డంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అడ‌గ‌కుండానే టీఆర్ఎస్ కు జ‌న‌సేన మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించింది.

ఇక ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన కాసినో, ఉద్యోగుల స‌మ్మె, జిల్లాల సంఖ్య పెంపు గురించి ఏ మాత్రం ప‌వ‌న్ నోరెత్త‌లేదు. రిప‌బ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌, ఆన్ లైన్ టిక్కెటింగ్ గురించి ప్ర‌స్తావించాడు. ఆ సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సామాజిక‌వ‌ర్గం గురించి ప్ర‌స్తావించాడు. దీంతో సినిమా ఇండ‌స్ట్రీకి, ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య గ్యాప్ పెరిగింది. ఒకానొక సంద‌ర్భంగా న‌ట్టి కుమార్ లాంటి నిర్మాత‌లు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను వ్య‌తిరేకించారు. దిల్ రాజులాంటి వాళ్లు స‌మాచార‌, సినిమాటోగ్ర‌ఫీ మంత్రితో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ రాజేసిన వ్యాఖ్య‌ల వేడి అప్ప‌ట్లో త‌గ్గ‌లేదు. తాజాగా చిరంజీవి రంగంలోకి దిగ‌డంతో కొంత మేర‌కు ఆ వేడి త‌గ్గింది.ఇటీవ‌ల గుడివాడలో జరిగిన కాసినోపై రాజ‌కీయ పార్టీల అధిప‌తులు స్పందించారు. మంత్రి కొడాలిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఏకంగా నిజ‌నిర్థార‌ణ క‌మిటీని వేసి నానా హంగామా చేసింది. ఆ త‌రువాత బీజేపీ ఛ‌లో గుడివాడ కార్య‌క్ర‌మాన్ని పెట్టింది. ఆ సంద‌ర్భంగా పోలీసులు చేసిన హ‌డావుడిని చూశాం. ఆ కార్య‌క్ర‌మానికి జ‌న‌సేన దూరంగా ఉంది. పీఆర్సీ విష‌యంలోనూ ఏపీలోని రాజ‌కీయ పార్టీలు ఏదో ఒక స్టాండ్ ను వినిపిస్తున్నాయి. కానీ, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ మాత్రం పీఆర్సీ గురించిన ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డంలేదు. స‌మ్మెకు దిగిన ఉద్యోగులు రాజ‌కీయాల‌కు అతీతంగా ఆందోళ‌న చేస్తున్నామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ వాళ్ల‌కు సంఘీభావం పార్టీలు తెలిపాయి.ఏపీ జిల్లాల‌ను పెంచుతూ జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాల‌ను 26 జిల్లాలుగా మార్చ‌డానికిజీవోల‌ను ఇచ్చింది. పైగా విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్ప‌డే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాల‌ని నిర్ణ‌యించింది. దానితో పాటు రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డే కొత్త జిల్లాల‌కు ప‌లు పేర్ల‌ను ఆయా పార్టీలు సూచిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని లీడ‌ర్లు కూడా ఆయా జిల్లాల‌కు కొన్ని పేర్ల‌ను చెబుతూ డిమాండ్ చేస్తున్నాయి. కానీ, జ‌న‌సేన మాత్రం జిల్లాల పెంపు అంశంపై పెద్ద‌గా స్పందించిన దాఖ‌లాలు లేవు. ఆ పార్టీకి చెందిన వాళ్ల వ్య‌క్తిగ‌త అభిప్రాయాలు మిన‌హా పార్టీ ప‌రంగా ఎక్క‌డా క్లియ‌ర్ క‌ట్‌ స్టాండ్ అంటూ ప్ర‌ధాన‌మైన అంశాల‌పై జ‌న‌సేన వెల్ల‌డించ‌లేదు.

ఇటీవ‌ల మౌనంగా ఉన్న ప‌వ‌న్ కేంద్ర బ‌డ్జెట్ కు అనుకూలంగా మాట్లాడ‌డం గ‌మ‌నార్హం. విభ‌జన చ‌ట్టంలోని అంశాలు బ‌డ్జెట్ లో ప్ర‌స్తావించ‌లేదు. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం, విశాఖ రైల్వే జోన్‌, వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు ప్ర‌త్యేక ప్యాకేజి, లోటు బ‌డ్జెట్..ఇలా అనేక అంశాల ప్ర‌స్తావ‌న ఎక్క‌డా బ‌డ్జెట్ లో లేదు. ఎయిర్ పోర్టులు, ఓడ‌రేవుల గురించి ప్ర‌స్తావ‌న లేదు. రాజ‌ధాని గురించి ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మ‌ర‌చిపోయారు. పైగా ఏపీ రాజ‌ధాని ఎక్క‌డో చెప్పాల‌ని బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన రోజే ఆర్బీఐ ప్ర‌శ్నించింది. ఇలాంటి అంశాలు ఎన్నో పెండింగ్ లో ఉన్నాయి. కానీ, కేంద్రం మాత్రం లైట్ గా తీసుకుంటోంది. అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ కేంద్ర బ‌డ్జెట్ కు జై కొట్టాడు.రాష్ట్రంలో జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న విధాన‌ప‌ర‌మైన అంశాలు చాలా ఉన్నాయి. వాటి మీద జ‌గ‌న్ ను ప్ర‌ధాన పార్టీల అధిప‌తులు నిల‌దీస్తున్నారు. కానీ, ప‌వ‌న్ దాదాపు మూడు నెల‌లుగా సైలెంట్ గా ఉన్నాడు. ఆ మ‌ధ్య టీడీపీ కార్యాల‌యాల మీద వైసీపీ బీపీ బ్యాచ్ చేసిన దాడి మీద స్పందించాడు. ఆ త‌రువాత ఏ అంశంపైనా ఆయ‌న స్పందించ‌డానికి ముందుకు రాలేదు. తాజాగా విజ‌య‌వాడ కేంద్రంగా 14ఏళ్ల బాలిక‌పై జ‌రిగిన లైంగిక వేధింపుల‌పై గంద‌రగోళం నెల‌కొన్న‌ప్ప‌టికీ స్పంద‌న క‌నిపించ‌లేదు. మొత్తం మీద ప‌వ‌న్ సీజ‌న‌ల్ పొలిటిషియ‌న్ అంటూ వైసీపీ ప‌దేప‌దే చేసే విమ‌ర్శ‌కు బలం చేకూరేలా ఆయ‌న రాజ‌కీయాలు ఉన్నాయ‌న‌డంలో త‌ప్పులేదేమో.!