Janasena : ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పోటీ.. !

  • Written By:
  • Publish Date - March 8, 2024 / 07:36 AM IST

టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా కృష్ణా జిల్లాలోని విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేన పార్టీకి దాదాపుగా ఖ‌రారు అయ్యాయి. వారం రోజుల క్రితం కూటమి తొలి జాబితాను విడుదల చేయగా, రెండో జాబితాను త్వరలో విడుదల చేయాలని టీడీపీ, జనసేన నేతలు నిర్ణయం తీసుకున్నారు. రెండో జాబితాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ స్థానాలను జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన నాయ‌కులు పోతిన మహేశ్‌ ఒక్కరే బలమైన అభ్యర్థిగా ఉన్నారు. చాలా కాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక్క‌డ జ‌న‌సేన కూడా బ‌లంగా ఉంది. అవనిగడ్డలో ఐదుగురు అభ్యర్థులు జనసేన టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకునే అవకాశం ఉండడంతో ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీకి ఏ సీట్లు ఇవ్వాల‌నే దానిపై కూడా చ‌ర్చ జ‌రుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

అవనిగడ్డలో వ్యాపారి వికృతి శ్రీనివాస్‌, జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బి రామకృష్ణ, అక్షయ డెవలపర్స్‌ ప్రొప్రైటర్‌ మడివాడ వెంకటకృష్ణ, ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, ప్రముఖ న్యాయవాది ఎం వెంకటేశ్వరరావుతో పాటు మరికొందరు టికెట్‌ను ఆశిస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పటి వరకు జనసేన అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అవనిగడ్డ అభ్యర్థిని ఖరారు చేసేందుకు మరో వారం రోజులు పడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు ఆశావహులు టీడీపీ సీనియర్‌ నేత, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌ను కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరికితే విజయం సాధించేందుకు సహకరించాలని కోరారు. పొత్తులో భాగంగా అవనిగడ్డను జనసేనకు కేటాయించడంతో బుద్ధ ప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయ‌న కూడా పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే దీనిని ఆయ‌న కుమారుడు ఖండిచారు. తాము టీడీపీలోనే కొన‌సాగుతామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Also Read:  Hyderabad: హైదరాబాద్‌లో ఉద్యోగులకు సెలవులు రద్దు.. ఎందుకంటే..?