టీడీపీ జనసేన పొత్తుపై ఏపీలో విసృతమైన చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే బలమైన సంకల్పంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు పొత్తులతో ఇరు పార్టీ అధినేతలు కలిసినప్పటికి క్లారిటీ రాలేదు. కానీ చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ జనసేన పొత్తును పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఎన్నికల రెండు నెలల ముందు పొత్తుని ప్రకటించాలని భావించిన చంద్రబాబు అరెస్ట్‌తో ముందే ప్రకటించాల్సి వచ్చింది. దీంతో టీడీపీ జనసేన క్యాడర్‌లో జోష్ పెరిగిందనే చెప్పాలి. ఇటు జనసేనకు ఇచ్చే అసెంబ్లీ సీట్లపై ఇప్పటికే టీడీపీ క్లారిటీతో ఉంది. జనసేన కూడా 30 సీట్ల వరకు అడుగుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే 25 అసెంబ్లీ సీట్లు, మూడు ఎంపీ సీట్లు ఇచ్చేందకు టీడీపీ సిద్ధమైంది.
ఇటు జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ తన సొంత నియోజకవర్గమైన తెనాలి నుంచి సీటు ఆశిస్తున్నప్పటికి అక్కడ టీడీపీ నుంచి బలమైన నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మరోసారి పోటీ చేయనున్నారు. కాబట్టి జనసేనకు తెనాలి సీటు ఇచ్చేందుకు టీడీపీ ఆసక్తి చూపడంలేదు. అయితే గుంటూరు జిల్లాలో టీడీపీ బలంగా ఉన్న గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలిచిన మద్దాలి గిరిధర్.. వైసీపీలో చేరారు. అప్పటి నుంచి పలువురు టీడీపీ నేతలు ఈ టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా పొత్తు ప్రకటన రావడంతో ఈ నియోజకవర్గం జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైంది. జనసేన సీనియర్ నేత నాందెడ్ల మనోహర్ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక్కడ టీడీపీ బలంగా ఉండటంతో పాటు జనసేన క్యాడర్ కూడా ఉండటం కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు. టీడీపీకి ఇక్కడ బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఈ సీటును జనసేనకి ఇచ్చి నాదెండ్ల మనోహర్‌ని పోటీ చేయించాలని టీడీపీ భావిస్తుంది. మరి రెండు పార్టీలు కలిసి టికెట్లు ప్రకటించే వరకు ఈ సీటు ఎవరికి వస్తుందో వేచి చూడాలి.