Site icon HashtagU Telugu

Jana Sena Day: అమరావతి వేదికగా ‘జనసేన ఆవిర్భావ దినోత్సవం’..!

Jana Sena Imresizer

Jana Sena Imresizer

జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడ – చెన్నై 16వ నంబరు జాతీయ రహదారికి కూతవేటు దూరంలో సభా స్థలిని ఎంపిక చేసినట్లు వివరించారు. కోవిడ్ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గత రెండేళ్లుగా చిన్న స్థాయిలో నిర్వహించారని, ఈ ఏడాది మాత్రం మార్చి 14న బ్రహ్మాండమైన బహిరంగ సభ జరపడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. ఈ సభా వేదికపై పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించడంతోపాటు, పార్టీ భావజాలానికి కట్టుబడి క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేస్తున్న నాయకులు, జనసైనికులు, వీరమహిళలకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. శనివారం సాయంత్రం మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… “ ఈ నెల 14న ఆవిర్భావ దినోత్సవ సభ ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. సుమారు 7 ఎకరాల ప్రాంగణంలో సభా వేదిక ఉండబోతోంది. వాహనాల పార్కింగ్ కోసం మరో 18 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. సభను విజయవంతం చేయడానికి కృష్ణా, గుంటూరుకు చెందిన నాయకులు మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. దూర ప్రాంతాల నుంచి సభకు విచ్చేసే ఏ జనసైనికుడు, ఏ వీరమహిళ ఇబ్బందులుకు గురి కాకుండా మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మూడు మార్గాల ద్వారా సభా స్థలికి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు:

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలన, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రతి ప్రజాస్వామ్యవాది ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాం. ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించాలని మా ప్రయత్నం మేము చేస్తుంటే.. అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు. మంగళగిరిలో ఆవిర్భావ సభ ఏర్పాటు చేయాలని మూడు వారాల ముందే పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అప్పటి నుంచి సభా స్థలి కోసం మా నాయకులు అనేక ప్రాంతాలను పరిశీలించారు. సభ నిర్వహణకు స్థలాలిచ్చేందుకు నిండు మనసుతో అంగీకారం తెలిపిన రైతులు… సాయంత్రానికి రాజకీయ ఒత్తిళ్లతో క్షమించమని చెప్పి వెనక్కి వెళ్లిపోయారు. ఇలా నాలుగు స్థలాలను మార్చాల్సి వచ్చింది. చివరకు ఇప్పటం గ్రామ రైతులు సామిరెడ్డి, సామ్రాజ్యం, నరసింహం గారితో పాటు కొందరు చిన్న చిన్న రైతులు నిండు మనసుతో ముందుకొచ్చి సహకరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రతి జనసైనికుడికి పెద్ద మనసుతో ఆహ్వానం పలుకుతామని వారు ముందుకు వచ్చారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

పోలీస్ శాఖకు విన్నపం:

నూతనంగా నియమితులైన డి.జి.పి. ని ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలపడంతో పాటు ఈ సభ గురించి వివరించడానికి మా నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ సభ సజావుగా జరిగేలా పోలీస్ శాఖ కూడా సహకరించాలని ఈ సందర్భంగా పార్టీ తరపున విన్నవిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మార్పు కోసం మేము చేసే ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మీరు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. సభ సజావుగా జరిగేందుకు మీరు కూడా మీ విలువైన సలహాలు, సూచనలు మా బృందం సభ్యులకు అందజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి సభకు విచ్చేసే జనసైనికులకు అవాంతరాలు కలగకుండా తగిన సూచనలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు నాదెండ్ల మనోహర్.

పాలన దక్షత లేని వ్యక్తిగా సీఎం జగన్ మిగిలిపోయారు:

ప్రజలు నిండు మనసుతో 151 సీట్లలో గెలిపిస్తే.. పరిపాలనను గాలికొదిలేసి పాలన దక్షత లేని వ్యక్తిగా ముఖ్యమంత్రి మిగిలిపోయారని విమర్శించారు నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా సమస్యలు తాండవిస్తున్నాయి. మత్స్యకారుల సమస్యల అధ్యయనానికి ఉభయ గోదావరి జిల్లాల్లో పాదయాత్ర నిర్వహిస్తే… అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. మత్స్యకార పల్లెల్లో కనీస మౌలిక వసతులు లేవు. అర్హులైన వారికి పెన్షన్లు అందడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే అందుతున్నాయి. కనీసం తాగడానికి మంచినీరు లేని దుస్థితిలో తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయని తెలిపారు నాదెండ్ల.

రాజధానిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం:

రాజధానిపై గౌరవ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు నాదెండ్ల మనోహర్. హైకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది. రాజధాని ప్రాంతంలో మొదలైన అభివృద్ధి పనులు నిలిపివేసి రాష్ట్రానికి అపారమైన నష్టం కలిగించారు. ఈ నిర్ణయం కారణంగా మన రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయి. ఎప్పటికైనా న్యాయం నిలబడుతుందన్న నమ్మకంతో రైతులు, మహిళలు 807 రోజుల పాటు అలుపెరగని పోరాటం చేశారు. గడచిన మూడేళ్లుగా రైతులు ఎన్నో బాధలు పడ్డారు, తిట్లు తిన్నారు. సీఎం జగన్ రెడ్డి పరిపాలన రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను కించపరిచే విధంగా, మహిళలను అవమాన పరిచే విధంగా సాగింది. రైతులు, మహిళలపై అధికార దుర్వినియోగం చేశారు. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. రాష్ట్రం కోసం రైతులు భూములు ఇస్తే వారిని ఈ ప్రభుత్వం రోడ్డుకీడ్చింది. మూడు రాజధానులు…. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట జగన్ రెడ్డి డ్రామా ఆడుతున్నారు. ప్రజలకు వీటిపై నమ్మకం లేదు. పక్క రాష్ట్రాల వారు కూడా మనల్ని చూసి అవహేళన చేస్తున్న పరిస్థితి తీసుకువచ్చారు. రాష్ట్రం మీద నమ్మకం లేకుండా, అప్పుకూడా పుట్టని పరిస్థితికి ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు నాదెండ్ల మనోహర్.

జనంలోకి వెళ్లేలా కార్యక్రమాలు:

ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యచరణ స్వయంగా ప్రకటిస్తారు. పార్టీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశం మీద ఒక రూట్ మ్యాప్ ఇస్తారు. జనసేన పార్టీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలన్న విషయాన్ని స్పష్టం చేస్తారు. ఈ సభ తర్వాత జనసేన పార్టీ విస్తృతంగా జనంలోకి వెళ్లేలా కార్యక్రమాలు ఉంటాయని” జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.