PK Convoy: ప‌వ‌న్ కు సీఎం త‌ర‌హా కాన్వాయ్‌.

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కాబోయే సీఎం లుక్ ను ఆ పార్టీ తీసుకొచ్చేసింది. ముఖ్య‌మంత్రుల‌కు ఉండే కాన్వాయ్ మాదిరిగా కార్ల‌ను రెడీ చేసింది.

  • Written By:
  • Updated On - June 13, 2022 / 11:59 AM IST

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కాబోయే సీఎం లుక్ ను ఆ పార్టీ తీసుకొచ్చేసింది. ముఖ్య‌మంత్రుల‌కు ఉండే కాన్వాయ్ మాదిరిగా కార్ల‌ను రెడీ చేసింది. బ్లాక్ స్కార్పియో కార్ల‌ను ఆ పార్టీ కొనుగోలు చేసింది. సీఎం జ‌గ‌న్‌, మాజీ సీఎం చంద్ర‌బాబు కాన్వాయ్ కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉండేలా కాన్వాయ్ హ‌డావుడి చేస్తున్నారు. సాధార‌ణంగా సీఎం హోదాలో ఎవ‌రున్నా కాన్వాయ్ ఉంటుంది. ఎస్కార్ట్ తో పాటు సెక్యూరిటీ ప్రొటోకాల్ ను పాటిస్తారు. జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరిలో ఉన్న చంద్ర‌బాబుకు అధికారంతో సంబంధంలేకుండా సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉంటుంది. బ్లాక్ క‌మాండోస్ భ‌ద్ర‌త ఆయ‌న‌కు ఉంటుంది. దేశంలోని చాలా కొద్దిమందికి మాత్ర‌మే ఉండే జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త చంద్ర‌బాబుకు ఉంది. అటు జ‌గ‌న్ ఇటు బాబుకు ఏ మాత్రం తీసిపోకుండా ప‌వ‌న్ కాన్వాయ్ ను జ‌న‌సైనికులు రూపొందించారు.

ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని విశ్వ‌సిస్తోన్న జ‌నసేన ముందుగానే ప‌వ‌న్ ను ప్ర‌చారానికి త‌యారు చేస్తోంది. బ‌స్సు యాత్ర‌కు రోడ్ మ్యాప్ త‌యారు అయింది. అక్టోబరు 5న తిరుపతిలో పవన్ కల్యాణ్ బ‌స్సు యాత్ర ప్రారంభం కానుంది. అందుకే, పవన్ కోసం భారీ కాన్వాయ్ ని సిద్ధం చేస్తున్నారు. బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియో వాహనాలు జనసేన కార్యాలయంలోకి బారులు తీరి వెళుతున్నట్టు ఓ వీడియో క‌నిపించింది. ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. కొత్త స్కార్పియో వాహ‌నాల‌కు పూల‌దండ‌లు వేసి ఉన్నాయి. వాటిని ప‌వ‌న్ కాన్వాయ్ గా టెక్ట్స్ చేస్తూ పోస్టులు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నాయి. ఆ కార్ల కాన్వాయ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న బ‌స్సు యాత్ర చేస్తార‌ని జ‌న‌సైన్యం భావిస్తోంది.

వ‌చ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరుగుతాయని జనసేన పార్టీ బలంగా నమ్ముతోంది. అందుకే పవన్ కల్యాణ్ దసరా నుంచి ఐదు నెలల పాటు రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. గ‌తంలో ఎప్పుడూ ప‌వ‌న్ ఇంత సుదీర్ఘ యాత్ర‌ను ప్లాన్ చేయ‌లేదు. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి వెళ్లిన‌ప్ప‌టికీ రిసార్ట్స్ లో సేద‌తీరారు. అర్థాంత‌రంగా ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి. కానీ, ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న చేయాల‌ని బ్లూ ప్రింట్ సిద్ధం అయింద‌ని తెలుస్తోంది. సీఎం హోదాలో జ‌గ‌న్ ర‌చ్చ‌బండ‌ను ప్రారంభించ‌నున్నారు. ద‌స‌రా త‌రువాత ఆయ‌న కూడా ప్ర‌జ‌ల్లోకి రానున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు ఇప్ప‌టికే బ‌స్సు యాత్ర‌ల‌ను చేస్తున్నారు. వారానికి మూడు రోజుల పాటు జిల్లాల్లో ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. మినీ మ‌హానాడుల‌ను నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల్లోనే బాబు ఉంటున్నారు.

పొత్తుపై మూడు ఆప్ష‌న్ల‌ను ఎంచుకున్న ప‌వ‌న్ అక్టోబ‌ర్ నుంచి బ‌స్సు యాత్రకు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. అందుకోసం ఆక‌ర్ష‌ణీయంగా ఉండే కాన్వాయ్ ను జ‌న‌సేన త‌యారు చేయ‌డం ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద ఏపీలో ప‌వ‌న్ బ‌స్సు యాత్ర గురించి కంటే ఆయ‌న కొత్త‌గా ఏర్పాటు చేసుకున్న కాన్వాయ్ పై సెటైర్లు వేసుకుంటున్నారు. ఆ కాన్వాయ్ కాబోయే సీఎం ప‌వ‌న్ అంటూ చెప్పే ప్ర‌య‌త్నమ‌ని కొంద‌రంటే, కాదుకాదు సీఎంగా ఫీల్ కావ‌డానికి ప‌వ‌న్ కాన్వాయ్ ను త‌యారు చేసుకున్నార‌ని మ‌రికొంద‌రు మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద సీఎం లుక్ కాన్వాయ్ తో ప‌వ‌న్ కు వ‌చ్చేసింద‌ని జ‌న సైన్యం మాత్రం సంబ‌ర‌ప‌డుతుంద‌ట‌.