Site icon HashtagU Telugu

Janasena Chief Pawan Kalyan: పవన్ సంచలన వ్యాఖ్యలు.. వైఎస్సార్ వారికన్నా గొప్ప నాయకుడా..?

Pawan Kalyan

Pawan Kalyan

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇప్పటం ప్రజలతో సమావేశమైన పవన్ కల్యాణ్.. అధికార పార్టీ వైసీపీపై నిప్పులు చెరిగారు. “రాష్ట్రంలో రాజకీయం మీరే చేయాలా మేము చేయకూడదా? వైసీపీ పార్టీనా.. టెర్రరిస్ట్ సంస్థా? అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లో వచ్చాను” అని జనసేనాని ఆగ్రహంతో అన్నారు. అనంతరం ఇప్పటం ప్రజలు చూపిన తెగువ అమరావతి రైతులు చూపించి ఉంటే అమరావతి కదిలేది కాదని అభిప్రాయపడ్డారు. ‘న అదృష్టవ శాత్తు వైఎస్సార్ కుటుంబీకులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదు. లేకుంటే వైఎస్సార్ కడప జిల్లా మాదిరి దేశం కూడా వైఎస్సార్ ఇండియా అయిపోయి ఉండేది అంటూ చురకలంటించారు. దాంతో పాటుగా ప్రతి పథకానికి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని తప్పుబట్టారు. ఈ సమావేశం సందర్భంగా 2024లో జనసేనకు ప్రజల మద్దతు ఇవ్వాలని పవన్ కోరారు.

పవన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటం గ్రామాన్ని సందర్శించిన సమయంలో అక్కడ గాంధీ, అంబేద్కర్ సహా ఎందరో గొప్ప వ్యక్తుల విగ్రహాలను తొలగించేశారని, కానీ వైఎస్సార్ విగ్రహం అంతే ఉందని తెలిపారు. వైఎస్ఆర్ గొప్ప నాయకుడా కాదా అన్నది ఎవరి అభిప్రాయాలు వారికున్నా.. జాతీయ నాయకులను మించిన నాయకుడైతే వైఎస్ఆర్ కాదని పవన్ అన్నారు. తాను ప్రధాని మోదీతో ఏం మాట్లాడానో సజ్జలకు ఎందుకు చెప్పాలని అన్నారు. “నేను మీకు మాదిరిగా ఢిల్లీ వెళ్ళి చాడీలు చెప్పను. వైసీపీని దెబ్బ కొట్టాలంటే ప్రధాని మోదీకి చెప్పకుండా నేనే చేస్తా. నేను ఎవరినీ సహాయం కోరను. నా యుద్ధం నేనే చేస్తా” అని పవన్ తెలిపారు.

యువత కోసం ఆలోచించే నేతలు పాలకులుగా రావాలని జనసేనాని పవన్‌కల్యాణ్‌ ఆకాంక్షించారు. తమది రౌడీ సేన కాదని.. విప్లవసేన అని వ్యాఖ్యానించారు. ఇంతగా అభిమాన బలం ఉన్న నన్నే ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటంలో గ్రామస్థుల గడపలు కూల్చడాన్ని తాను మర్చిపోనన్నారు. అక్కడ కూల్చిన ప్రతిదీ తన గుండెపై కొట్టినట్లే అనిపించిందని చెప్పారు.