Pawan Kalyan: వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతుందా..? ప‌వ‌న్ వ్యాఖ్య‌లు దేనికి సంకేతం..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతున్నారా? టీడీపీతో పొత్తు అంశాన్ని ప‌క్క‌కు పెట్టారా? వారాహి యాత్ర‌లో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల్లో కొత్త చ‌ర్చ‌కు దారితీశాయి.

  • Written By:
  • Updated On - June 15, 2023 / 11:30 PM IST

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్  (Janasena Chief Pawan Kalyan) వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతున్నారా? టీడీపీ(TDP) తో పొత్తు అంశాన్ని ప‌క్క‌కు పెట్టారా? ఈ అంశంపై ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh) రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జ‌న‌సేన పార్టీలు పొత్తుతో బ‌రిలోకి దిగుతాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ప‌లుసార్లు భేటీ అయ్యారు. విడివిడిగా ఎన్నిక‌ల‌కు వెళితే వైసీపీకి మ‌రోసారి అధికారం ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని, క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లి వైసీపికి చెక్ పెట్టాల‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు ఇరు పార్టీల నేత‌లు చెబుతూ వ‌చ్చారు. ఉన్న‌ట్లుండి ప‌వ‌న్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నార‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా సాగుతుంది.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ఓట‌మి చ‌విచూడ‌టానికి అధికార వైసీపీ కంటే జ‌న‌సేన పార్టీదే కీల‌క భూమిక‌ని చెప్పొచ్చు. టీడీపీ ఓటు బ్యాంకును జ‌న‌సేన లాక్కోవ‌డం ద్వారా అది వైసీపీ ఘ‌న విజ‌యానికి కార‌ణ‌మైంది. ఈ విష‌యం నియోజ‌క‌వ‌ర్గాల వారిగా పోలైన ఓట్ల శాతాన్ని బ‌ట్టిచూస్తే అర్థ‌మ‌వుతుంది. ఈ ప‌రిస్థితి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పున‌రావృతం కాకుండా ఉండేందుకు జ‌న‌సేన‌, టీడీపీ క‌లిసి పోటీ చేస్తాయ‌ని ఇరు పార్టీల నేత‌లు భావిస్తూ వ‌స్తున్నారు. ఇదే అంశంతో వైసీపీ నేత‌లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద‌మ్ముంటే ఒంటిరిగా బ‌రిలోకి రావాల‌ని అటు టీడీపీ, జన‌సేన పార్టీల‌ను వైసీపీ నేత‌లు స‌వాల్ చేస్తున్నారు.

ప‌వ‌న్ ఏ కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టిన చంద్ర‌బాబు క‌న్నుస‌న్న‌ల్లోనే ప‌వ‌న్ న‌డుస్తున్నాడంటూ వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనికితోడు జ‌న‌సేనలోని ఓ వ‌ర్గం నేత‌లు టీడీపీతో పొత్తు వ‌ద్ద‌ని ప‌వ‌న్‌పై ఒత్తిడి తెస్తున్నార‌ట‌. అయితే, ప‌వ‌న్ మాత్రం పొత్తుతో వెళితేనే మ‌న‌కు మేలు జ‌రుగుతుంద‌ని చెబుతున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో సీఎం అభ్య‌ర్థి విష‌యంపై ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నేను సీఎం అభ్య‌ర్థిని కాద‌ని ప‌లు సంద‌ర్భాల్లో ప‌వ‌న్‌ స్ప‌ష్టం చేశారు. కానీ, ఉన్న‌ట్లుండి ప‌వ‌న్ త‌న ఆలోచ‌న‌ను మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇన్నాళ్లు సీఎం సీఎం అని జ‌న‌సేన అభిమానులు అరుస్తుంటే వ‌ద్ద‌ని వారిస్తూ వ‌చ్చిన ప‌వ‌న్‌.. తాజాగా వారాహి విజ‌య యాత్ర‌లో మాత్రం ఈ ఒక్క‌సారి న‌న్ను ముఖ్య‌మంత్రిని చేయండి అంటూ ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న‌ను సీఎంగా చేస్తే అన్నివ‌ర్గాల‌కు మెరుగైన పాల‌న అందిస్తాన‌ని, మీకు నా పాల‌న న‌చ్చ‌క‌పోతే రెండేళ్ల త‌రువాత సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని ప‌వ‌న్ అన‌డం ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. టీడీపీ, జ‌న‌సేన పొత్తు అంశాన్ని ప‌వ‌న్ ప‌క్క‌కు పెట్టార‌ని, అందుకే కొత్త‌గా.. సీఎంగా త‌న‌ను ఒక్క‌సారి గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను ప‌వ‌న్ కోరుతున్నారన్న వాద‌న వినిపిస్తోంది.

Pawan Kalyan: వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతుందా..? ప‌వ‌న్ వ్యాఖ్య‌లు దేనికి సంకేతం..