అమరావతి రాజధాని నిర్మాణానికి అడ్డంకులు సృష్టించడమే లక్ష్యంగా గత ఐదేళ్లుగా సాగిన ప్రయత్నాలు, ఇప్పుడు మరో రూపంలో కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంతానికి ప్రపంచ బ్యాంక్ నిధులు మంజూరవుతున్న తరుణంలో, మళ్లీ పాత పాటనే జగన్ అందుకున్నారు. లక్షల కోట్ల ఖర్చు అవుతుందని, ఇతర ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని చెప్పడం ద్వారా ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శకులు మండిపడుతున్నారు. గతంలో చేసిన ఏ ఒక్క అవినీతి ఆరోపణను ఐదేళ్ల పాలనలో నిరూపించలేకపోయినా, మళ్లీ అవే అబద్ధాలను వల్లెవేయడం రాజకీయ కుట్రలో భాగమేనని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఖర్చుపై తప్పుడు లెక్కలు – వాస్తవాలు
రాజధాని నిర్మాణానికి అయ్యే వ్యయం గురించి జగన్ చెబుతున్న లెక్కలు పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. రూ. 48 వేల కోట్ల అప్పు ఒక్కరోజులో కట్టేది కాదు, అది దశాబ్దాల కాలంలో జరిగే అభివృద్ధి ప్రక్రియ. అమరావతి అనేది కేవలం ఒక ఖర్చు కాదు, అదొక సంపద సృష్టి కేంద్రం. అక్కడ ఉన్న వేల ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతోనే అప్పులు తీర్చి, రాష్ట్రానికి భారీగా సంపదను సృష్టించవచ్చు. ప్రపంచ బ్యాంక్ ఇచ్చే రుణాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా, కేవలం రాజధానిపై విషం చిమ్మడానికే జగన్ అప్పుల భూతాన్ని చూపిస్తున్నారని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
రైతుల వెన్నుపోటు.. విశ్వసనీయత ప్రశ్నార్థకం
భూములిచ్చిన రైతులను రోడ్డున పడేసి, ఐదేళ్ల పాటు కౌలు చెల్లింపుల్లో కూడా నానా ఇబ్బందులు పెట్టిన జగన్, ఇప్పుడు మళ్లీ నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. రాజధాని నిర్మాణ పనులు తిరిగి వేగవంతం అవుతున్న తరుణంలో, వాటిని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు ఆయన రాజకీయ సంకుచితత్వాన్ని బయటపెడుతున్నాయి. “మేము అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధాని ఉంచుతాం” అని చెప్పలేని జగన్, వ్యతిరేకం కాదని చెప్పడం పచ్చి అబద్ధం. తనను నమ్మే వారిని మభ్యపెట్టడానికి చేసే ఇటువంటి ప్రెస్ మీట్లు ఆయన రాజకీయ పతనానికి నిదర్శనమని, ఇప్పటికే ఒకసారి అవకాశం ఇచ్చి మోసపోయిన ప్రజలు మళ్లీ అబద్ధాలను నమ్మే స్థితిలో లేరని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
