ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ తీపి కబురందించింది. జగనన్న విద్యాదీవెన పథకం కింద ఏప్రిల్, జూన్ త్రైమాసికానికి 11.02లక్షల మంది విద్యార్థులకు రూ. 694కోట్లను ముఖ్యమంత్రి జగన్ గురువారం బాపట్లలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. గత ప్రభుత్వం అంతంతమాత్రంగానే ఫీజు రీయింబర్స్ మెంట్స్ కు 2017 సంవత్సరం నుంచి బకాయిలు రూ. 1,778కోట్లతో కలిపి ఇఫ్పటివరకు జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన కింద జగన్ సర్కార్ మొత్తం రూ. 11,715కోట్ల సాయాన్ని అందించింది.
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు ఎలాంటి పరిమితులు లేవు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివించవచ్చు. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు చదివే పేద విద్యార్ధులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ సంవత్సరానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది జగన్ ప్రభుత్వం. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తుంది ఏపీ సర్కార్.