Jagan Victory : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ విజ‌యం! ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘం ర‌ద్దు..?

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉద్యోగుల మీద విజ‌యం(Jagan Victory) సాధించారు.

  • Written By:
  • Updated On - January 20, 2023 / 02:39 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉద్యోగుల మీద విజ‌యం(Jagan Victory) సాధించారు. ఉద్యోగులు మీద పైచేయి సాధించిన సీఎంగా ఏపీ చ‌రిత్ర‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిలిచిపోయారు. ఏపీ ఎన్జీవోలకు(APNGO) అండ‌దండ‌లు అందిస్తున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘం గుర్తింపు ర‌ద్దు దిశ‌గా ఏపీ స‌ర్కార్ అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇదో పెద్ద సాహ‌సంగా చెప్పుకోవాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం మీద గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాలు లేవు. కానీ, ఏపీ చ‌రిత్ర‌లో మొద‌టిసారిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ప్ర‌తినెలా ఒక‌టో తేదీన జీతాల‌ను ఇవ్వ‌లేక‌పోతుంద‌ని గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు వెళ్లింది. ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘం అధ్య‌క్షుడు సూర్య‌నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో గ‌వ‌ర్న‌ర్ ను ఆ సంఘం నేత‌లు క‌ల‌వ‌డం వివాద‌స్ప‌దం అయింది. చ‌ట్ట ప్ర‌కారం గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి ప్ర‌భుత్వం మీద ఉద్యోగులు ఫిర్యాదు చేయ‌కూడ‌ద‌ని ఏపీ ఎన్జీవో అధ్య‌క్షుడు బండి శ్రీనివాస‌రావు చెబుతున్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘం గుర్తింపు ర‌ద్దు దిశ‌గా..(Jagan Victory)

ఉద్యోగ‌, ఎన్జీవో, ఉపాధ్యాయ సంఘాల‌న్నీ ఐక్యంగా `ఛ‌లో విజ‌య‌వాడ‌` కార్య‌క్ర‌మం చేయ‌డాన్ని చూశాం. ఆ రోజు నుంచి ఉద్యోగుల భ‌ర‌తం ప‌ట్ట‌డానికి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan Victory) నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఆ క్ర‌మంలో ఉపాధ్యాయుల‌ను బోధ‌నేత‌ర ప‌నుల నుంచి త‌ప్పించారు. ఫ‌లితంగా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు వాళ్ల‌ను దూరంగా పెట్టారు. ఇక మిగిలిన ప్ర‌భుత్వం ఉద్యోగుల సంఘం నేత‌ల మీద సీఐడీ, ఏసీబీ క‌న్నేసింది. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడుగా ఉన్న సూర్య‌నారాయ‌ణ ఆస్తుల గురించి ఆరా తీస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ విష‌యాన్ని సూచాయ‌గా ఎన్జీవో (APNGO)అధ్య‌క్షుడు బండి శ్రీనివాస‌రావు చెబుతున్నారు. అంతేకాదు, సూర్య‌నారాయ‌ణ ఆస్తులు, అక్ర‌మ సంపాద‌న మీద విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ ను ప్ర‌భుత్వం ముందు ఉంచుతున్నారు. ప్ర‌భుత్వం మీద గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేసిన ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘాన్ని ర‌ద్దు చేసే అధికారాన్ని కూడా ఎత్తి చూపుతున్నారు. అంటే, ప‌రోక్షంగా ఆ సంఘాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరుతున్నారు.

Also Read : AP Employees : జీతాలిస్తే చాలు,ఇంకేమొద్దు! ఉద్యోగుల‌కు త‌త్త్వం బోధ‌ప‌డి.!

ప్ర‌భుత్వం ఉద్యోగుల సంఘం నేత‌లు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన గురువారం రోజే ఎన్జీవో సంఘం నాయ‌కులు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కే.వి. శివారెడ్డి, పలువురు ప్యానల్‌ సభ్యులు తాడేప‌ల్లిలోని సీఎంను క‌లిశారు. ఆ త‌రువాత బ‌య‌ట‌కొచ్చిన అసోసియేష‌న్ నాయ‌కులు ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘాల నేత‌లు గ‌వ‌ర్న‌ర్ ను కల‌వ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. నర్సాపురంలో పోటీ చేసి రెండు ఓట్లు మాత్రమే తెచ్చుకున్న సూర్యనారాయ‌ణ అంటూ వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. గవర్నర్ కు ఫిర్యాదు చేసే అధికారం ఉద్యోగ సంఘాలకు లేదన్నారు. ఫిర్యాదు చేయటం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ప‌రోక్షంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఎన్టీవో అసోసియేష‌న్ మ‌ద్ధ‌తు ప‌లికింది.

గవర్నర్ కు ఫిర్యాదు చేసే అధికారం ఉద్యోగ సంఘాలకు…

ఉద్యోగుల DA బకాయిలు, జీపీఎఫ్ బజాయిలు, సీపీఎస్ వాటా నిధులు 10వేల కోట్ల పైన ప్రభుత్వం బకాయి ఉందని జీవోల‌తో స‌హా గ‌వ‌ర్న‌ర్ కు ప్ర‌భుత్వం ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేసింది. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎఫ్ నుంచి ఏకంగా 90 వేల మంది ఖాతల ద్వారా విత్ డ్రా జ‌రిగింద‌ని ఆరోపించాఉఉ. న్యాయం జరగకపోతే ఏప్రిల్ నుంచి ఆందోళన‌కు దిగుతామ‌ని సూర్య‌నారాయ‌ణ తెగేసి చెప్పారు. కానీ, సొంత ప్ర‌యోజ‌నాల కోసం సూర్య‌నారాయ‌ణ గ‌వ‌ర్న‌ర్ ను క‌లిశార‌ని ఏపీ ఎన్జీవో నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 12 పీఆర్సీల‌ను తెచ్చిన చ‌రిత్ర ఏపీఎన్జీవో అసోసియేష‌న్ కు ఉంద‌ని బండి శ్రీనివాసరావు చెబుతున్నారు.

Also Read : Ap Employees : ఏపీ ఉద్యోగుల నోటి దురుసు! కూలీలు అంటే అంత అలుసా.!

గ‌తంలోని సీఎంల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఉద్యోగుల మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ట్టు సాధించారు. ఇప్పుడు కేవ‌లం ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం మాత్ర‌మే ఆయ‌న ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకిస్తోంది. దాన్ని ర‌ద్దు చేసే దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ ముందుకు క‌దులుతోంద‌ని స‌చివాల‌య వ‌ర్గాల్లోని వినికిడి. అదే జ‌రిగితే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే ఉద్యోగుల నేత‌లు ఉండ‌రు. కార‌ణం, ఇప్ప‌టి వ‌ర‌కు టీచ‌ర్ల‌ సంఘాలు, టీచ‌ర్ల‌ను పోరాటం చేసే సీన్లో లేకుండా చేయ‌గ‌లిగారు. ఏపీ ఎన్జీవో అసోసియేష‌న్ జ‌గ‌న్‌ ప‌క్షాన నిలుస్తోంది. ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘాన్ని ర‌ద్దు చేస్తే పూర్తి స్థాయిలో ఉద్యోగుల‌పై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విజ‌యం సాధించిన‌ట్టే.

రాజ‌కీయ పార్టీల‌కు అనుబంధ సంఘాలుగా ఉద్యోగ సంఘాలు

`ప్ర‌భుత్వాల‌ను దింపుతాం, నిల‌బెడ‌తాం..`అంటూ బీరాలు ప‌లికిన ఉద్యోగ నేత‌ల కోర‌లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పీకేశారు. అంతేకాదు, కూలీల మాదిరిగా ఉన్నామా? అంటూ ప్ర‌శ్నించిన వాళ్ల `ఇగో`ను దించారు. రాష్ట్ర బ‌డ్జెట్ ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా త‌ర‌చూ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్న వాళ్ల పీచ‌మ‌ణిచారు. పీఆర్సీ అంటే జీతాలు పెంచ‌డ‌మే కాదు, ప‌రిస్థితుల‌కు అనుగుణంగా త‌గ్గించ‌గ‌ల‌మ‌ని ప‌రోక్ష హెచ్చ‌రిక చేశారు. దీంతో కిక్కుర‌మ‌న‌కుండా ఉద్యోగ సంఘం నేత‌లు ఉంటున్నారు. రాజ‌కీయ పార్టీల‌కు అనుబంధ సంఘాలుగా ఉద్యోగ సంఘాలు ఉన్నాయ‌న్న చేదు వాస్త‌వాన్ని ప్ర‌జ‌ల ముందు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉంచ‌గ‌లిగారు. ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘం నేత‌ల వెనుక చంద్ర‌బాబు ఉన్నాడ‌ని ఏపీ ఎన్జీవో అసోసియేష‌న్ చెబుతోంది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీ ఎన్జీవో అసోయేష‌న్ నేత‌ల‌ను న‌డిపిస్తున్నార‌ని ప్ర‌భుత్వం ఉద్యోగుల సంఘం ఆరోపిస్తోంది. మొత్తం మీద స‌మాజానికి అతీతంగా భావించే కొంద‌రు ఉద్యోగులకు, వాళ్ల నేత‌ల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌రైన పాఠం నేర్పారు.

Also Read : AP Employees: ఏపీ ఉద్యోగుల కోర్కెల‌కు జ‌గ‌న్ క‌ళ్లెం!