Anti Corruption : స‌రికొత్త మేనిఫెస్టో దిశ‌గా జ‌గ‌న్‌! అవినీతి వ్య‌తిరేక ఎజెండా ఫిక్స్!!

ఎన్నిక‌ల‌ను(Election) ఎదుర్కొనే చ‌తుర‌తను వైసీపీ చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

  • Written By:
  • Updated On - December 19, 2022 / 12:47 PM IST

ఎన్నిక‌ల‌ను(Election) ఎదుర్కొనే చ‌తుర‌తను వైసీపీ చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌రికొత్తగా అమ‌లు చేయ‌బోతున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. ఆ క్ర‌మంలో ఇప్ప‌టికే టీచ‌ర్ల‌ను బోధ‌నేత‌ర విధుల నుంచి త‌ప్పించారు. గృహ సార‌థుల‌ను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి రంగంలోకి దింప‌బోతున్నారు. సామాజిక ఇంజ‌నీరింగ్ తో పాటు సంక్షేమాన్ని అస్త్రాలుగా చేసుకున్నారు. వాటిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు బ‌లంగా తీసుకెళ్ల‌డానికి ఎమ్మెల్యేల‌కు 100 రోజుల డెడ్ లైన్ పెట్టారు. ఇక రాబోవు ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఉద్యోగుల అవినీతికి వ్య‌తిరేకంగా(Anti corruption) మేనిఫెస్టో రూపొందించే ప‌నిలో ప‌డ్డార‌ట‌.

గ‌త ఎన్నిక‌ల్లో(Election) న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల ముందు పెట్టారు. వాటిని య‌థాత‌దంగా ఉంచుతూ ఉద్యోగుల వ్య‌తిరేక(Anti corruption) ఎజెండాను మేనిఫెస్టోలో పెట్టే సాహ‌సం చేయ‌బోతున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లో న‌డుస్తోన్న చ‌ర్చ‌. సుదీర్ఘ కాలం పాటు ప‌రిపాల‌న సాగించిన క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి వ్య‌తిరేకంగా పావులు క‌ద‌ప‌డం ద్వారా మిగిలిన సామాజిక‌వ‌ర్గాల‌ను మాన‌సికంగా సంతృప్తి ప‌రిచామ‌నే భావ‌న‌తో ఉన్నార‌ట‌. ఇక ఉద్యోగుల అవినీతి మీద సామాన్యులు చాలా కోపంగా ఉన్నార‌ని తాజా స‌ర్వేల్లోని సారాంశ‌మ‌ని తెలుస్తోంది. అవినీతి ర‌హిత పాల‌న అందించ‌డానికి ప‌రిచ‌యం చేసిన టోల్ ఫ్రీ నెంబ‌ర్ 14400 వ‌చ్చిన ఫిర్యాదులు కోకొల్ల‌లు. వాటికి ప‌రిష్కారం చూప‌లేక మూల‌న ప‌డేశారు. అయితే, ఆ ఫోన్ల ద్వారా టీచ‌ర్లు, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని గ్ర‌హించార‌ట‌. అందుకే, మేనిఫెస్టోలో ఉద్యోగుల వ్య‌తిరేక ఎజెండాను ఎంచుకోవ‌డం ద్వారా సామాన్యుల ఓట్ల‌ను సానుకూలంగా మ‌లుచుకోవాల‌ని వ్యూహాన్ని ర‌చిస్తున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లోని టాక్‌.

అవినీతి రహిత సేవ‌లు ఉండాల‌ని

కొన్ని ద‌శాబ్దాలుగా అనేక మంది సీఎంలు ఉమ్మ‌డి ఏపీని ప‌రిపాలించారు. ఏ ఒక్క‌రూ ఉద్యోగుల‌ను కాద‌ని ముందుకు క‌ద‌ల్లేక‌పోయారు. ఉద్యోగుల ఉడ‌త ఊపుల‌కు ఏ మాత్రం వెర‌వ‌కుండా ప్ర‌స్తుతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారు. అవినీతి రహిత సేవ‌లు ఉండాల‌ని ప‌లుమార్లు ఉద్యోగుల‌కు సీఎం బోధించారు. అయిన‌ప్ప‌టికీ వాళ్ల తీరులో మార్పు రాలేద‌ని గ‌మ‌నించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `పీఆర్సీ` గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డంలేద‌ట‌. అంతేకాదు, ఉద్యోగులు ఉంచిన ప‌లు డిమాండ్ల‌ను మంత్రివ‌ర్గ ఉప‌సంఘానికి తూతూ మంత్రంగా అప్ప‌గించారు. ఆ సంఘం ప‌లుమార్లు స‌మావేశ‌మై సీపీఎస్ ర‌ద్దు అసాధ్య‌మ‌ని చెప్పింది. దానికి బ‌దులుగా జీపీఎస్ ఇస్తామ‌ని చెబుతోంది. ఉద్యోగుల కోర్కెలు తీరేవి కాద‌ని మంత్రి బొత్సా స‌త్యానారాయ‌ణ ఇటీవ‌ల వ్యాఖ్య‌నించారు. మ‌హా అయితే, కోర్టుల‌కు వెళ‌తారు అంతుకు మించి ఏం చేస్తార‌ని ఉద్యోగుల ఎదుటే హెచ్చ‌రించారు. అందుకే సంక్రాంతి త‌రువాత తేల్చుకుంటామ‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు మేక‌పోతుగాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

`ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొతాం..నిల‌బెడ‌తాం` అంటూ ఒక‌ప్పుడు హూంక‌రించిన ఉద్యోగ సంఘం నేత‌లు ఇప్పుడు తోక‌ముడిచారు. కూలీల కంటే హీనంగా ఉన్నామ‌ని నిజాయితీగా శ్ర‌మ‌ను న‌మ్ముకుని బ‌తికే కూలీల‌ను కించ‌ప‌ర‌స్తూ ఉద్యోగ సంఘం నేత శ్రీనివాస‌రావు ఇటీవ‌ల వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేద‌ని బాధ ప‌డుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను నమ్ముతున్నామ‌ని లాజిక్ తీస్తూ 20వ తేదీ వచ్చినా జీతాలు, పింఛన్లకు ఇంకా జమ చేస్తూనే ఉన్నారని అన్నారు. అంటే, ప్రభుత్వం ఉద్దేశపూర్యకంగానే చెల్లింపులు చేయకుండా ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోందని ఆయ‌న భావిస్తున్నారు. గత మూడున్నరేళ్లలో ఒక్క ఉద్యోగి కూడా సంతోషంగా లేరని సూర్యనారాయణ సోమ‌వారం విమ‌ర్శ‌ల‌కు దిగారు.

ఓవ‌ర్ డ్రాఫ్ట్ కు జ‌గ‌న్

సాధార‌ణంగా అధికారులు ఇచ్చే డేటా ప్ర‌కార‌మే ఏ ముఖ్య‌మంత్రి అయినా అసెంబ్లీలో మాట్లాడ‌తారు. ఆ విష‌యం సూర్య‌నారాయ‌ణ‌కు తెలియ‌ని విష‌యం కాదు. ట్రెజ‌రీ ఉద్యోగులు అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా జీతాల‌ను చెల్లిస్తుంటారు. ఆ విష‌యం ఉద్యోగ సంఘం నేత‌ల‌కు బాగా తెలుసు. అయిన‌ప్ప‌టికీ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై అసెంబ్లీలో సీఎం చేసిన చేసిన కామెంట్ ను చూపుతూ పీఆర్సీ వేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్ ఆర్ బీఎం నిబంధ‌న‌ల‌ను అతిక్రమించి ఓవ‌ర్ డ్రాఫ్ట్ కు జ‌గ‌న్ స‌ర్కార్ వెళ్లింద‌ని ఆర్బీఐ ఇటీవ‌ల చుర‌క‌లు వేసిన సంగ‌తి తెలిసిందే. ఆ విష‌యాన్ని దాచిపెడుతూ అసెంబ్లీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేత అధికారులు చేయించిన స్టేట్ మెంట్ ను ఆధారంగా చేసుకుని జీతాలు పెంచాల‌ని ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు . ఎన్నిక‌ల ముందు ప్ర‌తిసారి ఉద్యోగులు ఇలాగే చేస్తుంటారని స‌ర్వ‌త్రా తెలిసిందే.

ఈ ఏడాది మొద‌ట్లో సుమారు 11వేల కోట్ల భారాన్ని ప్ర‌జ‌ల‌పై మోపుతూ ఉద్యోగుల జీతాల‌ను పెంచారు. ఇప్పుడు మ‌ళ్లీ పీఆర్సీ అంటూ మొద‌లు పెట్ట‌డంతో వాళ్ల‌తో యుద్ధానికి సీఎం సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌ప్పుడు (2004 ) ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చంద్ర‌బాబు న‌క్సల్స్ కు వ్య‌తిరేకంగా ఎజెండాను పెట్టిన విధంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 2024 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఉద్యోగుల‌కు వ్య‌తిరేకంగా ఎజెండాను పెట్టే సాహ‌సం చేస్తున్నార‌ని తెలుస్తోంది. వాళ్ల‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త వైసీపీ గెలుపుకు దోహ‌ప‌డుతుంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయ‌ని తెలుస్తోంది.

Also Read : CM Jagan : ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ రోడ్ మ్యాప్‌! 50 మంది ఓట‌ర్లకు 2 వాలంటీర్లు!