Site icon HashtagU Telugu

YSRCP Vijayamma : వైసీపీని వెంటాడుతోన్న అమ్మ రాజీనామా

Vijayamma Jagan Anil

Vijayamma Jagan Anil

వైఎస్ విజ‌య‌మ్మ గౌర‌వాధ్య‌క్షురాలి ప‌ద‌వికి రాజీనామా చేయ‌డాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు? కుటుంబ‌లో విభేదాలు లేకుండానే ఉన్న‌ట్టు సృష్టిస్తున్నారా? నిజంగా వైఎస్ కుటుంబంలో విభేదాల కార‌ణంగా ఆమె రాజీనామా చేశారా? ష‌ర్మిల కోసం జ‌గ‌న్ మీద నిర‌స‌న‌గా రాజీనామా చేశారా? ఈ ప్ర‌శ్న‌ల‌కు జవాబు చెప్పాల్సిన వైసీపీ ఒక విభాగం మీడియాను టార్గెట్ చేస్తోంది. విజ‌య‌మ్మ రాజీనామా ప‌క్కాగా ఆ కుటుంబంలోని విభేదాలుగా చెప్ప‌డానికి ఆమె రాజీనామా చేసిన గౌర‌వాధ్య‌క్షురాలి ప‌ద‌వి కంటే వైసీపీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డం నిద‌ర్శ‌నం.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ప్ర‌జ‌లు చూసుకుంటారు. ఆయ‌న్ను ఆద‌రిస్తున్నార‌ని వైఎస్ విజ‌య‌మ్మ భావించారు. అందుకే, ఆయ‌న్ను ఏపీ ప్ర‌జ‌ల‌కు వ‌దిలేశారు. ఇప్పుడు ష‌ర్మిల కోసం ప‌నిచేయాల్సి ఉన్నందున రాజీనామా చేస్తున్నానని ఆమె ప్లీన‌రీ వేదిక‌గా చెప్పారు. అందుకే, గౌర‌వాధ్య‌క్షురాలి ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన్నా అంటూ చెప్పారు. కానీ, వైసీపీ నుంచి త‌ప్పుకుంటాన్నా అని చెప్ప‌లేదు. కానీ, ఆల‌స్యంగా తెలుస్తోన్న దాని ప్ర‌కారం ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా ఆమె రాజీనామా చేశారు. అంటే, శాశ్వ‌తంగా వైసీపీతో తెగ‌దెంపులు చేసుకున్నారు.

ప్ర‌స్తుతం జీవిత‌కాల అధ్య‌క్షుడిగా వైసీపీకి జ‌గ‌న్ నియామ‌కం అయ్యారు. ఆ మేర‌కు ప్లీన‌రీ తీర్మానం చేసింది. రాబోవు ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రోసారి ఒంట‌రి పోరాటం చేయ‌డానికి సిద్ధం అయ్యారు. వ‌న్స్ మోర్ నినాదాన్ని అందుకున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఒక్క ఛాన్స్ ప్లీజ్ నుంచి 2024 ఎన్నిక‌ల‌కు వ‌న్స్ మోర్ ప్లీజ్ నినాదాన్ని రూపొందించారు. త‌ల్లి, చెల్లి మ‌ద్ధ‌తు లేకుండా ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 16 నెల‌లు జైలు జీవితం గ‌డిపిన‌ప్పుడు కుటుంబం అంతా రోడ్డు మీద‌కు వ‌చ్చారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ పోరాటాన్ని ష‌ర్మిల కొన‌సాగించారు. కానీ, హ‌ఠాత్తుగా ఆమె జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని విభేదిస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. తెలంగాణ‌లో పార్టీని పెట్టుకుని పాద‌యాత్ర చేస్తున్నారు.

తొలి నుంచి వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల వెంట విజ‌య‌మ్మ ఉన్నారు. ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌ను కూడా నిర్వ‌హించారు. ఆనాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఎలా మ‌ద్ధ‌తు ప‌లికారో అదే విధంగా ష‌ర్మిల‌కు మ‌ద్ధ‌తు ఇవ్వాల‌ని కోరారు. ఆమె ష‌ర్మిల‌కు తోడుగా నిల‌బ‌డుతున్నారు. ఆ క్ర‌మంలో వ‌చ్చిన కుటుంబ విభేదాలు విజ‌య‌మ్మ‌ను గౌరవాధ్య‌క్షురాలి ప‌ద‌వి నుంచి త‌ప్పుకునేలా చేశాయి. అంతేకాదు, ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేశారంటే, ఏ స్థాయిలో కుటుంబం విభేదాలు జ‌గ‌న్, ష‌ర్మిల మ‌ధ్య ఉన్నాయో పెద్ద‌గా వివ‌రించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒంట‌రి పోరాటం 2024లో చేయ‌డానికి సిద్ధం అయ్యారు. గ‌తంలో కుటుంబం చేదోడువాదుడుగా ఉండేది. ఇప్పుడు జ‌గ‌న్ ఒన్ మేన్ షో చేయ‌డానికి రెడీ అయ్యారు. బీజేపీ పార్టీతో స‌హ‌జ స్నేహం చేస్తూ ఆ పార్టీ అండ‌ను ప‌రోక్షంగా పొందుతున్నారు. జ‌గ‌న్ ఇంటిపోరు ఏపీ ప్ర‌జ‌ల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, దానితో పాటు చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్ క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ‌తారా? అనే అంశం కూడా ఏపీ రాజ‌కీయాల‌ను అంతే హీట్ ఎక్కిస్తోంది. తెలుగుదేశం పార్టీలో లోకేష్ పాత్ర‌ను మ‌రో అంశంగా ఏపీ ప్ర‌జ‌లు చ‌ర్చించుకోవ‌డం వినిపిస్తోంది. మొత్తం మీద ఏపీ రాజ‌కీయ పార్టీల‌కు ఇంటిపోరుతో పాటు పొత్తు వ్య‌వ‌హారం కూడా వెంటాడుతోంది.