ప్రజా దర్భార్, రచ్చబండ ఇక జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) జాబితాలో లేనట్టే. తాజాగా పల్లె నిద్ర ప్రోగ్రామ్ డిజైన్ దిశగా తాడేపల్లి వర్గాలు ఆలోచిస్తున్నాయి. ఆ మేరకు జగన్ సంకేతాలు ఇచ్చారట. వైఎస్ జగన్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరగనుంది. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రతివారం మూడురోజులపాటు పల్లె లో నిద్రించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. గడప దాటడంలేదు అనేవారికి పల్లెనిద్ర ద్వారా జగన్ (Jagan) షాక్ ఇవ్వనున్నారు. పల్లె నిద్ర వల్ల ఆయా గ్రామాల్లోని సమస్యలు కూడా పరిష్కారమవుతాయని ఆయన భావిస్తున్నారు. ఎన్నికలనే లక్ష్యంగా నిర్ధేశించుకొని జగన్ ముందుకు వెళుతున్నారు.
తాజాగా గృహసారథులు అనే కాన్సెప్టును తీసుకువవచ్చిన సంగతి తెలిసిందే. మార్చిలో ఉగాది రోజు నుంచి వీరు కూడా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు చేరువవుతారు. ముఖ్యమంత్రి తాడేపల్లి దాటి బయటకు రావడంలేదు అనే విమర్శలకు సమాధానమిస్తూ ఆయన పల్లెనిద్ర పేరుతో కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. నాయకులకు, అధికారులకు పరిమితమైన పల్లెనిద్రను ఇకనుంచి జగన్ (Jagan) కూడా చేయబోతున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా తనకు అనుకూలంగా వ్యవహారాలు నడుపుతున్నారనే విమర్శలు వచ్చినప్పటికీ పట్టించుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరడమే ఆశయంగా ఆయన పనితీరు ఉంది.
మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ప్రభుత్వాధికారులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. నియోజకవర్గాల్లో నాయకులందరి జాతకాలపై సర్వేలు చేయించి వివరాలు సేకరించారు. గ్రాఫ్ తగ్గిన ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నారు. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తానని ముందే చెప్పేస్తున్నారు. వైనాట్ 175 అంటూ నాయకులను ప్రశ్నిస్తున్నారు. అందరూ సరిగా పనిచేస్తే అన్ని నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని జగన్ చెబుతున్నారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గం ముఖం చూడని ఎమ్మెల్యేలను కూడా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించక పోవటంతో నేరుగా రంగంలోకి దిగుతున్నారు. పల్లె నిద్ర ద్వారా ప్రజలకు చేరువ కావాలని బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు.