ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. నెల్లూరు పర్యటనలో భాగంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబాలను పరామర్శించిన అనంతరం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan) కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని, ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని ఆరోపించారు. తన పార్టీ కార్యకర్తలను, అభిమానులను అడ్డుకోవడానికి 2 వేల మంది పోలీసులను మోహరించారని, ప్రతిపక్షాన్ని చూసి చంద్రబాబు ఇంతలా భయపడుతున్నారంటే ఆయన ఏదైనా బావి చూసుకుని దూకాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
“రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజం. అవతలి వాళ్లు ఏ భాష వాడితే.. సమాధానం కూడా అలాంటి భాషలోనే వస్తుంది. ఆ రోజు ప్రసన్న అన్న ఇంట్లో ఉంటే.. ఆయన్ను చంపేసే వాళ్లు కాదా? మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు మా వాళ్లను పంపి.. హత్యలు చేసే కార్యక్రమం చేపడితే రాష్ట్రంలో రాజ్యాంగం, లా అండ్ ఆర్డర్ బతికుంటాయా?” అని ప్రశ్నించారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై 80 మందితో దాడికి ప్రయత్నించారని, మారణాయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం చేశారని ఆరోపించారు. ఆ దాడితో ప్రసన్న తల్లి వణికిపోయారని, ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని అన్నారు. “ఇలాంటి దిగజారుడు రాజకీయాలు గతంలో చూడలేదు” అని జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
Kingdom : మనం కొట్టినం విజయ్ – రష్మిక ట్వీట్
ప్రస్తుత ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ అంటూ ప్రజలను మోసం చేసిందని, తమ హయాంలో ప్రారంభించిన ‘నాడు-నేడు’, ఇంగ్లీష్ మీడియం వంటి పథకాలన్నీ ఆపేశారని, వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని జగన్ విమర్శించారు. తన పాలన చూసి చంద్రబాబే భయపడుతున్నారని, అందుకే ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రశ్నించేవారి గొంతులను నొక్కేస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌పై 14 అక్రమ కేసులు పెట్టారని, ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే, దాన్ని వాట్సాప్‌లో షేర్ చేస్తే కేసులు పెడతారా అని నిలదీశారు. చంద్రబాబు నరనరాన శాడిజం పేరుకుపోయిందనడానికి ఇదే నిదర్శనమని జగన్ అన్నారు.
అంతేకాకుండా, రాష్ట్రంలో లిక్కర్ మాఫియాకు చంద్రబాబే డాన్ అని, కూటమి ప్రభుత్వంలో ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లో మద్యం అమ్ముతూ ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయిస్తున్నారని జగన్ ఆరోపించారు. మద్యం కమిషన్లు చంద్రబాబు, ఎమ్మెల్యేలే పంచుకుంటున్నారని అన్నారు. సిలికా, క్వార్ట్జ్‌ను విచ్చలవిడిగా దోచేస్తున్నారని, మైన్స్ కమిషన్లు చంద్రబాబు, లోకేష్‌కే చేరుతున్నాయని ఆరోపించారు. నందిగం సురేష్, వల్లభనేని వంశీ, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టి అన్యాయాలకు పాల్పడుతున్నారని జగన్ పేర్కొన్నారు.