Jagan Sketch : రెబ‌ల్స్ పై రాజీనామా అస్త్రం, అస‌మ్మ‌తికి ఉప ఎన్నిక‌ల‌తో చెక్ !

రెబ‌ల్స్ ను ఉప ఎన్నిక‌లతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan Sketch) బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?

  • Written By:
  • Publish Date - February 3, 2023 / 12:14 PM IST

నెల్లూరు రూర‌ల్ ఉప ఎన్నిక త‌ప్ప‌దా? కోటంరెడ్డి రాజీనామా చేస్తారా? మాజీ మంత్రి అనిల్ ఎందుకు రాజీనామాకు సిద్ద‌ప‌డ్డారు? రెబ‌ల్స్ ను ఉప ఎన్నిక‌లతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan Sketch) బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎన్నో నెల్లూరు(Nellore) కేంద్రంగా రేగిన అస‌మ్మ‌తి చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాజీనామాకు నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి సిద్ద‌ప‌డ‌లేదు. అనుమానం ఉన్న చోట ఉండ‌లేన‌ని చెబుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తాన‌ని చెబుతున్నారు. అంటే, వైసీపీకి దాదాపుగా గుడ్ బై చెప్పిన‌ట్టే. అదే స‌మ‌యంలో ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేయాల‌ని ప‌రోక్షంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ నుంచి ఒత్తిడి వ‌స్తోంది.

రెబ‌ల్స్ ను ఉప ఎన్నిక‌లతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  బ్లాక్ మెయిల్  (Jagan Sketch) 

ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింద‌ని చెబుతోన్న కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి వాద‌న‌తో వైసీపీ మంత్రులు, మాజీలు, ఎమ్మెల్యేలు ఎవ‌రూ అంగీక‌రించ‌డంలేదు. కాల్ రికార్డ్ ను ట్యాంపరింగ్ గా కోటంరెడ్డి చెబుతున్నార‌ని ప్ర‌తిదాడికి దిగారు. అంతేకాదు, ఫోన్ ట్యాపింగ్ ను నిరూపిస్తే రాజీనామా చేస్తాన‌ని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ స‌వాల్ విసిరారు. ఒక వేళ ట్యాపింగ్ కాద‌ని నిరూపిస్తే శ్రీథ‌ర్ రెడ్డి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆ స‌వాల్ ను స్వీక‌రిస్తే 24 గంట‌ల్లో ఇద్ద‌రం రాజీనామా చేద్దామ‌ని మీడియా ముందు అనిల్ ప్ర‌తిజ్ఞ‌పూనారు. అంటే, ఎమ్మెల్యే ప‌ద‌వికి శ్రీథ‌ర్ రెడ్డి రాజీనామా చేయాల‌ని ప‌రోక్షంగా(Jagan Sketch) డిమాండ్ వ‌స్తోంది.

ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కంపై తిరుగుబాటు 

నెల్లూరు (Nellore) జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కంపై తిరుగుబాటు ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని దెబ్బ‌తీస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకే, ఆ పార్టీలో కొన‌సాగ‌డం భ‌విష్య‌త్ రాజ‌కీయానికి న‌ష్ట‌మ‌ని భావిస్తున్నారు. రాజ‌కీయంగా నిర్వీర్యం చేయ‌డానికి కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని ఆనం తీవ్ర ఆరోప‌ణ‌ల‌కు దిగారు. అంతేకాదు, హ‌త్య చేయ‌డానికి వైసీపీలోని కొంద‌రు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. ప్ర‌తిగా అక్క‌డ నేదురుమ‌ల్లి రాంకుమార్ రెడ్డిని వైసీపీ రంగంలోకి దింపింది. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌ను వెంట‌నే తీసుకుంది. అలాగే, ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ మీద తిర‌గ‌బ‌డ్డారు. ఎవ‌రో ధ‌ర్మారెడ్డి అనే అత‌ను షాడోగా త‌న‌ను డ్యామేజ్ చేయ‌డానికి ఉన్నాడ‌ని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పార్టీలో ఉండ‌డం వేస్ట్ అంటూ మీడియాకు ఎక్కారు.

Also Read : Jagan : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై `సైకో` లాజిక‌ల్ ముద్ర‌! పార్టీ లీడ‌ర్ల వాయిస్ దుమారం!

నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి వాస్త‌వానికి గత ఏడాది కాలంగా అప్పుడ‌ప్పుడు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. మంత్రివ‌ర్గం 2.0 ఏర్పాటు చేసినప్పుడు శ్రీథ‌ర్ రెడ్డి, ఆనం ఇద్ద‌రిలోనూ అసంతృప్తి పెల్లుబుకింది. ఎమ్మెల్యేగా ఎలాంటి ప‌నుల‌ను చేయ‌లేక‌పోతున్నామ‌ని మ‌నుసులో పెట్టుకున్నారు. పైగా అంత‌ర్గ‌త ప్ర‌త్య‌ర్థి గ్రూప్ కు చెందిన అనిల్ కు తొలి క్యాబినెట్‌లోనూ కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డి మ‌లి క్యాబినెట్ లోనూ స్థానం క‌ల్పించ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయారు. జ‌డ్పీ స‌మావేశం, ఇత‌ర‌త్రా పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ త‌ర‌చూ అసంతృప్తిగా గ‌ళాన్ని వినిపించిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. అందుకే, ప్ర‌త్యామ్నాయ వేదిక‌ను సిద్ధం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ల‌డానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఆ విష‌యం ముందుగానే ప‌సిగ‌ట్టిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెంట‌నే నెల్లూరు రూర‌ల్ బాధ్య‌త‌ల‌ను ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డికి అప్ప‌గించారు. అలాగే, వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని వైసీపీ త‌ర‌పున మాజీ సీఎం నేదురుమ‌ల్లి జనార్థ‌న్ రెడ్డి కుమారుడు నేదురుమ‌ల్లి రాంకుమార్ రెడ్డికి అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ఉప ఎన్నిక‌ల సంకేతాలు ఇస్తున్నారు.

చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌త్యామ్నాయ వేదిక కోసం

నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఎపిసోడ్ మిగిలిన ఇద్ద‌రికి భిన్నం. ఎందుకంటే ఇటీవ‌ల ఆయ‌న మీద వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. బెంగుళూరు కేంద్రంగా ప్రైవేటు ఫ్యామిలీని గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా న‌డుపుతున్నార‌ని బ‌య‌ట‌కు వ‌చ్చింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి త‌న తండ్రి అంటూ శివ‌చ‌ర‌ణ్ రెడ్డి లేఖ‌ను రాస్తూ జీనోమ్ టెస్ట్ కు రావాల‌ని కోరాడు. అంతేకాదు, ర‌హ‌స్యంగా చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌ను పెళ్లి చేసుకున్నాడ‌ని శివ‌చ‌ర‌ణ్ రెడ్డి త‌ల్లి ల‌క్ష్మీదేవి మీడియా ముందుకొచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఏదో కుట్ర ఉంద‌ని చెబుతోన్న చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి డిఎన్ ఏ టెస్ట్ కు మాత్రం సిద్దం కాలేదు. భార్య‌గా చెబుతోన్న ల‌క్ష్మీదేవి, కుమారుడు శివ‌చ‌ర‌ణ్ రెడ్డి ఇద్ద‌రూ బెంగుళూరులో ఉంటున్నారు. అక్క‌డ‌కు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి వెళ్ల‌డాన్ని వైసీపీ అధిష్టానం గుర్తించింద‌ని తెలుస్తోంది. అందుకే, ఆయ‌న‌కు ఈసారి టిక్కెట్ ఇచ్చేది లేద‌ని సంకేతాలు ఇచ్చింది. ఆ క్ర‌మంలో చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌త్యామ్నాయ వేదిక కోసం అన్వేషిస్తున్నారు. కానీ, పార్టీని వీడి వెళ్ల‌డానికి మాత్రం ఇప్ప‌టికిప్పుడు సిద్ధ‌ప‌డ‌డంలేదు. ధ‌ర్మారెడ్డి అనే వ్య‌క్తి మీద ఆయ‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

Also Read : Jagan power : ఏపీలో గుజ‌రాత్, యూపీ ఫార్ములా, ప్ర‌త్య‌ర్థుల‌పై`కోవ‌ర్ట్ `పాలిటిక్స్?

మొత్తం మీద నెల్లూరు జిల్లా వైసీపీ అస‌మ్మ‌తి ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ల‌కుండా ఉప ఎన్నిక అస్త్రాన్ని తాడేప‌ల్లి ప్యాలెస్ బ‌య‌ట‌కు తీసింది. పార్టీ నుంచి వెళ్లే వాళ్లు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తే వెంట‌నే ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్రాఫ్ ప‌డిపోయింద‌ని జ‌నాల్లోకి బ‌లంగా ప్ర‌త్య‌ర్థులు తీసుకెళ్లారు. ఆ మ‌చ్చ‌ను తుడిపేసుకోవ‌డానికి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని యోచిస్తున్నారు. అటు అస‌మ్మ‌తికి చెక్ ఇటు ప్ర‌త్య‌ర్థులు చేస్తోన్న ప్ర‌చారానికి తెర‌ప‌డేలా తాడేప‌ల్లి కేంద్రంగా మాస్ట‌ర్ స్కెచ్ సిద్ద‌మైయింది. ఫ‌లితంగా నెల్లూరు రూర‌ల్, వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల ఉప ఎన్నిక క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌తో ఉంటాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని అంచ‌నా.