Amaravati Lesson: అమ‌రావ‌తి పాఠాన్ని తొల‌గించిన‌ జ‌గ‌న్ స‌ర్కార్..!

  • Written By:
  • Publish Date - April 4, 2022 / 12:20 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి సిల‌బ‌స్ నుంచి అమ‌రావ‌తి పాఠాన్ని తొల‌గిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో విద్యాశాఖ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. ఇక 2021-22 విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన క్ర‌మంలో, విద్యార్థులపై భారం పడకూడదన్న సుదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వివరించారు. ఈ క్ర‌మంలో అమరావతితో పాటు మరికొన్ని పాఠాలను కూడా తొలగించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఇక పదో తరగతి సిలబస్ నుంచి అమరావతి పాఠాన్ని తొలగించి, కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ సరఫరా చేసింది. 2014 నుంచి ఒకే రకమైన పుస్తకాలు సరఫరా చేస్తున్న విద్యాశాఖ‌, పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా అమరావతి ఉండేది. ఈ క్ర‌మంలో పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు. అయితే ఇప్పుడు ఇప్పుడు అమ‌రావ‌తి పాఠాన్ని తొల‌గించి 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించింది పుస్తకాల్ని పంపిణీ చేసింది విద్యాశాఖ‌.

మ‌రోవైపు ఎంతో చరిత్ర కలిగిన అమరావతి నుంచి సిలబస్ నుంచి తొలగించడంపై ప్ర‌భుత్వంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులపై భారం పడకూడదనుకుంటే పుస్తకంలోని చివరి పాఠాలను తొలగిస్తారు కానీ, రెండో పాఠంగా ఉన్న అమరావతిని ఎలా తొలగిస్తారని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో అమరావతి అనే పదంపై రాష్ట్రప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించిన సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ , నేరుగా ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డికి లేఖ రాశారు. పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించటం దుర్మార్గమని రామకృష్ణ మండిప‌డ్డారు.

తెలుగు పాఠ్య పుస్తకంలో అమరావతి పాఠాన్ని తొలగించి, మిగిలిన 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించడం విచారకరమని … దాదాపు 20 శతాబ్ధాల ఘనచరిత్ర కలిగిన ప్రాంతంగా ఉన్న అమరావతి నేపథ్యాన్ని భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన లేఖలో స్పష్టం చేశారు. ఈ క్ర‌మంలో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో అమరావతి పాఠాన్ని తిరిగి చేర్చాలని ఆయ‌న డిమాండ్ చేశారు. అయితే మ‌రోవైపు ఈ సోమవారం నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో, అమరావతి, వెన్నెల పాఠాలు మినహా మిగిలిన పాఠాలు చదవుకుని సిద్ధంకావాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సమాచారం అందించారు.