AP CM: మోసం గురూ.!

పేద‌లు నిరుపేద‌లుగా మారుతున్నారు. ధ‌నికులు కుభేరులు అవుతున్నారు. ఈ ప‌రిణామం ఏ మాత్రం స‌మాజానికి మంచిది కాదు. సోమాలియా త‌ర‌హా ప‌రిస్థితులు రాకుండా ఉండాలంటే..

  • Written By:
  • Updated On - January 8, 2022 / 09:09 PM IST

పేద‌లు నిరుపేద‌లుగా మారుతున్నారు. ధ‌నికులు కుభేరులు అవుతున్నారు. ఈ ప‌రిణామం ఏ మాత్రం స‌మాజానికి మంచిది కాదు. సోమాలియా త‌ర‌హా ప‌రిస్థితులు రాకుండా ఉండాలంటే..ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త అమృత్య‌సేన్ చెప్పిన మాన‌వాభివృద్ధి సూచిక అనుగుణంగా పాల‌న సాగాలి. త‌ద్భిన్నంగా అధికారంలో ఉన్న ఏపీ నేత‌లు నిర్ణ‌యాలు తీసుకుంటే ఆర్థిక ఎమ‌ర్జెన్సీ రాకుండా మాన‌దు. ఇవాళ కాక‌పోతే..రేపైనా ఆర్థికంగా ప్ర‌భుత్వాలు కుప్ప‌కూల‌డం ఖాయం. ఆర్థిక వాస్త‌వాల‌ను అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాలు గుర్తించాలి. మీడియా నిజాల‌ను నిర్భ‌యంగా బ‌య‌ట‌పెట్టాలి. స‌మాజానికి నాలుగు స్థంబాలుగా చెప్పుకుంటోన్న వ్య‌వ‌స్థ‌లు మౌనంగా ఉంటే ప్ర‌జ‌ల‌పై మోయ‌లేని భారం ప‌డుతోంది. ఆర్థికాంశాల విష‌యంలో మీడియా కీల‌క పాత్ర‌ను పోషించాలి. పక్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తే..స‌మాజం కోలుకోలేని విధంగా దెబ్బ‌తింటుంది. ఏపీ ఉద్యోగుల‌కు ఫిట్ మెంట్ తో పాటు 70 డిమాండ్ల ప‌రిష్కారం విష‌యంలో ప్ర‌భుత్వం నేల‌విడిచి సాము చేసింది. ఆర్థిక ప‌రిస్థితులు అనుకూలంగా లేకున్నా, 23శాతం ఫిట్మెంట్ ఇవ్వ‌డంపై ఆర్థిక వేత్త‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ప్ర‌జ‌ల‌పై మ‌రో 10వేల కోట్లకు పైగా భారం వేయ‌డానికి సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నాడు. గ్రామాల్లోని చెత్తను కూడా విడ‌వ‌కుండా ప‌న్నులు బాదుతున్నాడు. సామాన్యుల నుంచి ఎలా ప‌న్నులు వ‌సూలు చేయాలో..ఇంకా ఆలోచిస్తున్నాడు. ఎడ‌మ చేత్తో సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇస్తున్నాడు. కుడిచేత్తో జ‌గ‌న్ సామాన్యుల నుంచి లాగేసుకుంటున్నాడు. ఉద్యోగుల‌కు ఇచ్చిన 10వేల కోట్ల‌కు పైగా భారాన్ని ప్ర‌జ‌లు నుంచి ఎలా వ‌సూలు చేయాల‌నే దానిపై క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. రెండేళ్లుగా ఏపీ ప‌రిస్థితి ఆర్థికంగా బాగాలేద‌ని చెబుతూనే 23శాతం ఫిట్మెంట్ జ‌గ‌న్ ప్ర‌క‌టించాడు. పైగా ఉద్యోగుల‌కు స్మార్ట్ సిటీల్లో ఇళ్ల స్థ‌లాలు, ఇళ్లంటూ స్లోగ‌న్ వినిపిస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ త‌ల‌స‌రి ఆదాయం సుమారు 1.70ల‌క్ష‌లుగా ఉంది. తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం 2.52ల‌క్ష‌లుగా ఉంద‌ని జ‌గ‌న్ చెబుతున్నాడు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఉద్యోగులు తీసుకుంటోన్న బ‌డ్జెట్ వాటా ఏపీలో ఎక్కువ ఉంది. ఏ కోణం నుంచి తీసుకున్న‌ప్ప‌టికీ ఉద్యోగుల‌కు జీతాలు పెంచాల్సిన అవ‌స‌రం క‌నిపించ‌దు. కానీ, ఓట్ల కోసం జ‌గ‌న్ కూడా మిగిలిన సీఎంల మాదిరిగా ఉద్యోగుల‌కు జై కొట్టాడు.

ఉద్యోగుల పీఆర్సీ మీద ఒక భాగం మీడియా, విప‌క్షాలు బాధ్య‌త లేకుండా మాట్లాడుతున్నాయ‌ని ఆర్థిక వేత్త‌లు భావిస్తున్నారు. చంద్ర‌బాబునాయుడు ఆనాడు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చాడ‌ని కొన్ని ప‌త్రిక‌ల్లోని హైలెట్ పాయింట్‌. క‌మ్యూనిస్ట్ ల‌తో స‌హా విప‌క్ష నాయ‌కులు ఉద్యోగుల‌కు జీతాలను భారీగా పెంచాల‌ని గొంతు చించుకుంటున్నారు. ఆ భారం ఎవ‌రి మీద ప‌డుతుందో తెలిసి కూడా అధికారంలో ఉన్న పార్టీని బ‌ద్నాం చేయాల‌న్న ఒకేఒక ఆలోచ‌న వాళ్ల‌ది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి గురించి ఒక సెక్ష‌న్ ఆఫ్ మీడియా, విపక్షాలు ఆలోచించ‌కుండా మాట్లాడ‌డం సామాన్యుల‌కు ద్రోహం చేయ‌డ‌మే అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. రెండేళ్లుగా కోవిడ్ దెబ్బ‌కు తిన‌డానికి తిండి కూడా లేని కుటుంబాలు ఉన్నాయి. రైతులు న‌ష్టాల‌తో ల‌బోదిబో మంటున్నారు. పెరిగిన ధ‌ర‌ల‌తో సామాన్యులు మూడు పూట‌లా తిండితిన‌లేని ప‌రిస్థితి ఉంది. ఉపాథి అవ‌కాశాలు భారీగా త‌గ్గిపోయాయి. ద్ర‌వ్యోల్బ‌ణం అదుపు తప్పింది. కోవిడ్ స‌మ‌యంలో ఉద్యోగులు మాత్రం ఇళ్ల‌లో కూర్చుని రెండేళ్లుగా ల‌క్ష‌లకు ల‌క్ష‌లు జీతాలు తీసుకుంటున్నారు. అస‌మాన‌త‌లు స‌మాజంలో పెరిగిపోయాయ‌ని ఆర్థిక‌వేత్త‌లు మొత్తుకుంటున్నారు.

మాన‌వాభివృద్ధి సూచిక‌లో అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల ప‌రిస్థితి బీహార్ కంటే దారుణంగా ఉంది. వీట‌న్నింటినీ ప‌ట్టించుకోని ఉద్యోగులు జీతాలతో పాటు 70 డిమాండ్ల‌ను పెడితే, ఓట్ల కోసం జ‌గ‌న్ సానుకూలంగా స్పందించాడు. ఆయ‌న వాల‌కాన్ని ఖండించాల్సిన మీడియా, విపక్షాలు ఉద్యోగుల వైపు నిల‌వ‌డం విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత ఇప్ప‌టికే 12వేల కోట్ల ల‌బ్దిని ఉద్యోగుల‌కు ఇచ్చాడు. రాష్ట్రం అప్పు 7ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. ఇప్పుడు మ‌ళ్లీ 10వేల కోట్ల‌కుపైగా ల‌బ్దిని ఉద్యోగుల‌కు జ‌గ‌న్ క‌ల్పించాడు. ఫ‌లితంగా ఏపీ పేదోడు మ‌రింత నిరుపేద‌గా మార‌డంతో పాటు స‌మాజంలో అస‌హ‌నం పెరుగుతుంది. ఫ‌లితంగా సోమాలియా త‌ర‌హా ప‌రిస్థితులు ఏపీలో రావ‌డానికి ఎంతో కాలం ప‌ట్ట‌దనే విష‌యం స‌మాజం ప‌ట్ల బాధ్య‌త ఉన్న వాళ్ల ఆందోళ‌న‌. ఇప్పటికైన అమృత్య‌సేన్ చెప్పిన ఆర్థిక సూత్రాన్ని సీఎం జ‌గ‌న్ ప‌రిశీలిస్తాడ‌ని కోరుకుందాం.