వైసీపీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి (Jagan) బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వ్హయించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. “ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మీరు నాటినదే పండుతుంది. మీ ప్రభుత్వానికి మూడేళ్లు మాత్రమే ఉంది. ఆ తర్వాత మా ప్రభుత్వమే తిరిగి వస్తుంది” అంటూ ఆయన ధీమా వ్యక్తం చేసారు. చంద్రబాబు దుర్మార్గ పాలనను ఎవరూ ప్రశ్నించకూడదనే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్య హక్కులను నాశనం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
పథకాల అమలుపై ప్రశ్నలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఆగ్రహం
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అమలు చేయాల్సిన హామీలను మరిచారని జగన్ విమర్శించారు. రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు రూ.18 వేలు, నిరుద్యోగులకు రూ.35 వేలు, గ్యాస్ సబ్సిడీలు వంటి వాగ్దానాలు అమలవ్వలేదని అన్నారు. ప్రభుత్వ హామీలు అడిగిన ప్రతిసారీ తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడమే చంద్రబాబు ధోరణిగా మారిందన్నారు. ప్రజల ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన సమయంలో ప్రతిపక్షంపై దాడులు చేయడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.
పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు, రాజకీయ దాడులపై ఆవేదన
తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికే వెళ్లలేని పరిస్థితి ఉందని, సాక్షాత్తూ హైకోర్టు ఆదేశాలు ఉన్నా పోలీసులు అడ్డుకుంటున్నారని జగన్ ఆరోపించారు. ప్రసన్నకుమార్‌రెడ్డిపై పచ్చ పార్టీ సైకోలు దాడి చేశారని, పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో బీసీ మహిళా నేత హారికపై జరిగిన దాడిని రాష్ట్రం మొత్తం చూసిందని, పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో చట్టవ్యవస్థ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందన్నారు.
ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు, రాజకీయ హక్కుల కోసం పోరాటం
రాజకీయ పార్టీలకు ప్రజలను చైతన్యవంతంగా చేయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మౌలిక హక్కులేనని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నా, ప్రజాస్వామ్య విలువల్ని పట్టించుకోవడం లేదన్నారు. పోలీసులు తమ భద్రత కోసం కాదు, కార్యకర్తలను అడ్డుకోవడానికే పెట్టారని ఆరోపించారు. “ఇంతమంది శాడిస్టులు, సైకోలు రాష్ట్రాన్ని నడుపుతున్నారు. కానీ ప్రజల సహనం శాశ్వతం కాదు. తగిన సమయంలో ప్రజల తీర్పు చూస్తారు” అని జగన్ తన వ్యాఖ్యలను ముగించారు.