Jagan power : ఏపీలో గుజ‌రాత్, యూపీ ఫార్ములా, ప్ర‌త్య‌ర్థుల‌పై`కోవ‌ర్ట్ `పాలిటిక్స్?

గుజ‌రాత్, యూపీ త‌ర‌హా ఈక్వేష‌న్ ను వైసీపీ(Jagan power) ఎంచుకుంది.

  • Written By:
  • Updated On - February 2, 2023 / 02:17 PM IST

గుజ‌రాత్, యూపీ త‌ర‌హా ఈక్వేష‌న్ ను వైసీపీ(Jagan power) ఎంచుకుంది. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్న ఎమ్మెల్యేల‌ను ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోకి పంప‌డానికి ప్లాన్ చేస్తోంది. క‌నీసం 50 నుంచి 70 మంది సిట్టింగ్ ల‌ను మార్చాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. తాజాగా అందిన స‌ర్వేల ప్ర‌కారం భారీగా అభ్యర్థుల‌ను మార్చాల‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. వాళ్ల‌ను పొమ్మ‌న‌లేక పొగ‌బెడుతున్నార‌ని ఒక వ‌ర్గం చెబుతోంది. కోవ‌ర్ట్ (Covert)ఆప‌రేష‌న్ కు వైసీపీ వ్యూహాత్మ‌కంగా తెర‌దీసింద‌ని మ‌రో వ‌ర్గం భావిస్తోంది.

కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ కు వైసీపీ (Jagan power)

సంక్షేమ ప‌థ‌కాల గురించి చెప్పుకుని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డానికి అనుకూల వాతావ‌ర‌ణం ఏపీలో క‌నిపించ‌డంలేదు. పెరిగిన ధ‌ర‌లు, ఉపాథి లేక‌పోవ‌డం, అభివృద్ధి శూన్యంగా క‌నిపిస్తోన్న ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో ప్ర‌జా వ్య‌తిరేక‌త భారీగా ఉంద‌ని తాజా స‌ర్వేల్లోని సారాంశం. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan power) స్వ‌రంలోనూ మార్పు వ‌చ్చింది. `నా వెంట్రుక కూడా పీక‌లేర‌ని..` ఈ మ‌ధ్య ప్లీన‌రీ వేదిక‌గా హూంక‌రించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు దేవుడు, ప్ర‌జల దీవెన‌లు అంటూ త‌గ్గారు. ఇప్పుడు తాను చేసిన పాల‌న చూసి న‌చ్చితే ఓటు వేయండ‌ని వేడుకుంటున్నారు. మ‌రో ఛాన్స్ ప్లీజ్ అంటూ అభ్య‌ర్థిస్తున్నారు. ఇలా ఆయ‌న స్వ‌రంలో మార్పు వెనుక తాజా స‌ర్వేల్లోని సారాంశ‌మ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : Jagan Tapping : ఏపీ పోలీస్ కు ఇర‌కాటం,జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి`ట్యాపింగ్ `సంక‌టం!

ఏపీలో ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితి యూపీ, గుజ‌రాత్ ఎన్నిక‌ల‌కు ముందుగా క్షేత్ర‌స్థాయిలో ఉండేదట‌. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాద‌ని తొలుత స‌ర్వేలు తేల్చాయి. ఆ త‌రువాత బీజేపీ మార్పు చేసిన వ్యూహాల అక్క‌డ ఫ‌లించ‌బోతున్నాయని స‌ర్వేలు చెప్ప‌డం ప్రారంభించాయి యూపీ ఎన్నిక‌ల‌ను తీసుకుంటే, అక్క‌డ బీజేపీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌ని తొలుత భావించారు. అంతేకాదు, మంత్రివ‌ర్గంలోని డ‌జ‌ను మంది ప్ర‌త్యర్థి పార్టీల వైపు వెళ్లారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా మంది స‌మాజ్ వాదీ పార్టీ గూటికి చివ‌రి నిమిషంలో చేరారు. గుజ‌రాత్ లోనూ ఎన్నిక‌ల స‌మీపించిన స‌మ‌యంలో రెబ‌ల్స్ ప్ర‌త్య‌ర్థి పార్టీల వైపు మ‌ళ్లారు. ఫ‌లితంగా ఈక్వేష‌న్ మారిపోయింది. సీన్ కట్ చేస్తే రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ హ‌వా క‌నిపించింది.

ఏపీలోనూ యూపీ, గుజ‌రాత్ త‌ర‌హా ఎల‌క్ష‌నీరింగ్

సేమ్ టూ సేమ్ ఏపీలోనూ యూపీ, గుజ‌రాత్ త‌ర‌హా ఎల‌క్ష‌నీరింగ్ చేయాల‌ని వైసీపీ భావిస్తుంద‌ట‌. రెబ‌ల్స్, గ్రాఫ్ ప‌డిపోయిన వాళ్ల‌ను పంపించ‌డానికి సిద్ధ‌మ‌యింద‌ని తెలుస్తోంది. ఆ జాబితాలో మాజీ హోంమంత్రి సుచ‌రిత‌, కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, ఉదయ‌గిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. వాళ్ల మీద ఇప్ప‌టికే ప‌లు అవినీతి, వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీళ్లతో పాటు క‌నీసం 30 మంది సిట్టింగ్ లు ఇదే కోవ‌లోనే ఉన్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లోని టాక్‌. అందుకే, వాళ్ల మీద ఫోన్ ట్రాప్ జ‌రిగింద‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ న‌డుస్తోంది. వాళ్ల‌ను పొమ్మ‌న‌కుండా పోయేలా చేయ‌డం టార్గెట్ గా తాడేప‌ల్లి వ‌ర్గాలు పెట్టుకున్నార‌ని వినికిడి.

Also Read : Poor Jagan : మ‌ళ్లీ హైకోర్టుకు జీవో No.1, యువ‌గ‌ళం, వారాహిల‌కు`సుప్రీం` ఊర‌ట‌

ఇక కోవ‌ర్ట్ రాజ‌కీయాన్ని కూడా వైసీపీ బ‌య‌ట‌కు తీసింద‌ని తెలుస్తోంది. గెల‌వ‌లేని వాళ్ల‌ను కొంద‌ర్ని న‌మ్మ‌కంగా ప్ర‌త్య‌ర్థి పార్టీల వైపు పంపించ‌డం మ‌రో ఎత్తుగా ఉందని సమాచారం. ఆ కోవ‌లోకి వ‌చ్చే సిట్టింగ్ ల‌ను జ‌న‌సేన వైపు పంపాల‌ని ప్లాన్ చేస్తున్నారట‌. కొన్ని చోట్ల టీడీపీ కి పంపించ‌డం ద్వారా కోవ‌ర్ట్(Covert) రాజ‌కీయానికి వైసీపీ ప‌దును పెడుతుంద‌ని ఆ పార్టీలోని కొంద‌రి భావ‌న‌. ఏదైతేనేం, మొత్తం మీద 70 మంది సిట్టింగ్ ల‌ను వ‌దిలించుకోవ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భారీ ఎత్తుగ‌డ ర‌చించార‌ని తెలుస్తోంది. అంటే, ప్ర‌త్య‌ర్థి పార్టీలు అప్ర‌మ‌త్తం కాక‌పోతే గుజ‌రాత్, యూపీ త‌ర‌హా రాజ‌కీయాన్ని ఏపీలో చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌.