YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఏపి అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించాలని ఈరోజు (మంగళవారం) జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సభలో ప్రతిపక్షంలో ఎవరు ఎక్కువ సభ్యులు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుందని అన్నారు. ఆ పార్టీ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్నారు. ఏపీ శాసనసభలో పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని లేఖ రాసినా ఇవ్వలేదని పిటిషన్‌లో తెలిపారు. వెంటనే తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించాలని ఈ మేరకు జగన్ తన పిటిషన్‌లో కోరారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఏపిలో ఇటివల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే వచ్చాయి. దీంతో ఆ పార్టీకి విపక్ష నేత హోదా లభించే అవకాశాలు లేవు. సాధారణంగా ప్రతిపక్ష హోదాకు 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందాల్సి ఉంటుంది. కానీ వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా జగన్ దక్కకుండాపోయింది. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాశారు. ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉండాలని.. ఈ విషయంలో మరోసారి ఆలోచించాలని అన్నారు. ప్రతిపక్ష హోదాకు 10శాతం సీట్లు కావాలని ఎక్కడా లేదని జగన్ లేఖలో పేర్కొన్నారు. అయితే, తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ కోరుతుండగా… కూటమి ప్రభుత్వం నుంచి దీనిపై నిర్ణయం వెలువడలేదు.
