Site icon HashtagU Telugu

Berm Park Mortgage : పార్క్‌ను తాక‌ట్టుపెట్టిన ఏపీ ప్ర‌భుత్వం

Berm Park Vijayawda

Berm Park Vijayawda

ఆర్ధిక లోటును పూడ్చుకోవ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం నానా తంటాలు ప‌డుతోంది. సినిమా టిక్కెట్ల ద‌గ్గ‌ర్నుంచి వైన్స్‌, చేప‌ల మార్కెట్ అంటూ హ‌డావుడి చేసిన స‌ర్కార్‌.. క‌న్ను పార్కులపై ప‌డింది. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే అత్యంత విలువైన బెర్మ్‌ పార్కును (Berm Park Vijayawada) ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు(HDFC Bank) ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ATPDC) తనఖా పెట్టింది. వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.143 కోట్ల రుణం(Mortgage Loan) తీసుకుంటోంది. తనఖా ప్రక్రియ పూర్తి కావడంతో తొలి విడతగా నాలుగైదు రోజుల్లో రూ.35 కోట్ల మొత్తాన్ని బ్యాంకు విడుదల చేయ‌బోతోంది.

మొద‌ట టూరిజం కార్పోరేష‌న్‌కు చెందిన చాలా ఆస్తుల‌ను త‌న‌ఖాకు ప‌రీశీలించింది ప్ర‌భుత్వం. అయితే, వాట‌న్నిటిలోకీ రెవెన్యూ ఎక్కువ‌గా ఉన్న బెర్మ్ పార్క్‌ను త‌న‌ఖా పెడితే ఎక్కువ రుణం వ‌స్తుంద‌ని భావించారు అధికారులు. ఇంకేముంది వెంట‌నే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును సంప్ర‌దించారు. బెర్మ్ పార్క్ త‌న‌ఖా ద్వారా వ‌చ్చే రుణంతో త‌మ శాఖ‌లోపెండింగ్‌ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడంతో పాటు హోటళ్లు, రిసార్టులను డెవ‌ల‌ప్ చేస్తామ‌ని బ్యాంకుకు ఏపీటీడీసీ చెబుతోంది.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2015-16లో ప్రారంభించిన వివిధ ప్రాజెక్టుల పనులు నిధుల కొరతతో ఎటూ కాకుండా నిలిచిపోయాయి. ఇప్ప‌టిదాకా ఇడుపులపాయలో రాజీవ్‌ నాలెడ్జి వ్యాలీ, లంబసింగి, బొర్రా గుహలు, అహోబిలంలో పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పన, గండికోట, కోటప్పకొండ వద్ద రోప్‌వే ప్రాజెక్టుల‌కు చేసిన పనులకే దాదాపు రూ.10 కోట్లకుపైగా పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి. దీంతో మిగిలిన పనులకు కాంట్రాక్ట‌ర్లు ఎవ‌రూ ముందుకు రావడం లేదు. ఏపీటీడీసీకి చెందిన హోటళ్లు, రెస్టారెంట్ల ఆధునికీకరణ ప్రతిపాదనలూ నిధుల కొరతతో చాలాకాలంగా కార్యరూపం దాల్చడం లేదు. వీటిని పూర్తి చేయడానికి బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో ఏపీటీడీసీ రెండు, మూడు బ్యాంకులను సంప్రదించి, చివరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు బెర్మ్‌ పార్కును రూ.143 కోట్ల రుణం కోసం తనఖా పెట్టింది. రుణ వడ్డీ, ఎన్ని వాయిదాల్లో తిరిగి చెల్లించాలనే విషయాలను అధికారులు సీక్రెసీ మెయింటెయిన్ చేయ‌డం అనుమానాల‌కు తావిస్తోంది.