ChaloVijayawada: డీజీపీకి సీఎం జ‌గ‌న్ క్లాస్

  • Written By:
  • Updated On - February 4, 2022 / 05:30 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో, రాష్ట్ర‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ఈరోజు భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో, గురువారం ఏపీలో జ‌రిగిన‌ ఛలో విజయవాడ అంశంపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు స‌మాచారం. నిర్భంధాలు పెట్టినా, ఆంక్షలు విధించినా, ప్ర‌భుత్వ ఉద్యోగులు చేప‌ట్టిన చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం విజయవంతం కావడంపై డీజీపీని సీయం జ‌గ‌న్ ప్ర‌శ్నించినట్లు తెలిసింది.

ఇక ముఖ్యంగా ఉద్యోగులకు పోలీసులు సహకరించారనే వార్త‌లు గుప్పుమ‌న్న నేప‌ధ్యంలో, ఆ విషయంపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. చ‌లో విజ‌య‌వాడు స‌క్సెస్ అవ‌డానికి కార‌ణం, పోలీసుల వైఫ‌ల్య‌మే కార‌ణ‌మ‌ని, విజయవాడకు చాలా తక్కువ మంది ఉద్యోగులు వస్తారని పోలీసులు అంచనా వేయ‌గా, నిముషాల వ్య‌వ‌ధిలోనే బీఆర్‌టీఎస్ రోడ్డు ఉద్యోగుల‌తో నిండిపోయింద‌ని, దీంతో జ‌రిగిన ప‌రిణామాల పైడీజీపీ స‌వాంగ్‌ను ముఖ్య‌మంత్రి వివ‌ర‌ణ అడిగార‌ని స‌మాచారం.

ఇక ప్ర‌భుత్వ ఉద్యోగుల రాకను అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంద‌నే ఫిర్యాదులు ప్ర‌భుత్వానికి అందాయ‌ని, ఇంటెలిజన్స్, నిఘా వ్యవస్థ పనితీరుపైన కూడా సీఎం జ‌గ‌న్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ఆపేందుకు పోలీసులు చేసిన ప్ర‌య‌త్నాలు, తీసుకున్న చ‌ర్య‌ల గురించి ముఖ్యంత్రికి డీజీపీ స‌మ‌గ్రంగా వివ‌రించార‌ని తెలుస్తోంది. ఉద్యోగులు ముందురోజే విజ‌య‌వాడ చేరుకోవ‌డం, మారువేషాల్లో రావ‌డంతో, వారి నిర‌స‌న‌ను పోలీసులు అడ్డుకోలేక‌పోయామ‌ని డీజీపీ ముఖ్య‌మంత్రికి వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో భ‌విష్య‌త్తులో ఇలాంటివి జ‌రిగిన‌ప్పుడు ఎలాంటి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌నే విష‌యం పై డీపీపీకి సీయం జ‌గ‌న్ ప‌లు సూచ‌న‌లు చేస్తూ క్లాస్ తీసుకున్నార‌ని స‌మాచారం.