AP TS Water War : అన్న‌ద‌మ్ముల ‘ప‌వ‌ర్‌’ పాయింట్

ఏపీ, తెలంగాణ సీఎంలు వాట‌ర్ వార్ ను మ‌రోసారి ర‌గిలించ‌బోతున్నారు.

  • Written By:
  • Updated On - February 21, 2022 / 04:56 PM IST

ఏపీ, తెలంగాణ సీఎంలు వాట‌ర్ వార్ ను మ‌రోసారి ర‌గిలించ‌బోతున్నారు. రాజ‌కీయంగా సెంటిమెంట్ ను పండించ‌డానికి మ‌ళ్లీ కేసీఆర్ సిద్ధం అవుతున్నాడ‌ని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇరు రాష్ట్రాల మ‌ధ్య సెంటిమెంట్ అంశాల‌ను పండించ‌డానికి రంగం సిద్ధం అవుతోంద‌ని స‌మాచారం. వాటిలో ప్ర‌ధానంగా నీళ్లు, నిధుల అంశాన్ని ట‌చ్ చేయ‌డానికి ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకోసం గ్రౌండ్ ను ఇప్ప‌టి నుంచే ప్రిపేర్ అవుతుంద‌న‌డానికి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం శ్రీశైలం ప్రాజెక్టులో అడుగంటిన నీటిమ‌ట్టం.వాస్త‌వంగా ఇటీవ‌ల ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని క‌లిసిన సంద‌ర్భంగా పెండింగ్ లో ఉన్న అంశాల‌ను ప్ర‌స్తావించాడు. వాటితో పాటు గోదావ‌రి, కృష్ణా నీటి పంపకాల‌పై జోక్యం చేసుకోవాల‌ని కేంద్రాన్ని కోరాడు. వెంట‌నే స్పందించిన కేంద్రంగా ఇరు రాష్ట్రాల మ‌ధ్య వివాదాన్ని ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌త్యేక బోర్డును ఏర్పాటు చేసింది. ఆ మేర‌కు గెజిట్ ను విడుద‌ల చేసింది. దానిపై ఏపీ ప్ర‌భుత్వం సంతోషంగా ఉండ‌గా, తెలంగాణ స‌ర్కార్ మాత్రం గెజిట్ పై విమ‌ర్శ‌లు కురిపించింది. గెజిట్ ప్ర‌కారం కృష్ణా బోర్డు అనుమ‌తి లేకుండా నీటిని ఇష్టానుసారం తోడుకోవ‌డానికి వీల్లేదు. కానీ, ఇరు రాష్ట్రాలు పోటీప‌డి అన‌ధికారికంగా నీళ్ల‌ను తోడేశాయి. ఇప్పుడు నీటి మ‌ట్టం స‌గ‌టు కంటే దిగువ‌కు పోవ‌డంతో వేస‌విలో తాగునీటి స‌మ‌స్య ఏర్ప‌డ‌నుంది.

ప్ర‌స్తుతం డ్యామ్ నీటి మట్టం 805 అడుగులలోపు ఉంది. వాస్త‌వంగ 215.80 టీఎంసీల సామ‌ర్థ్యం ఉండ‌గా కేవలం 31 టీఎంసీల నీరే ఇప్పుడు ఉంది. డెడ్ స్టోరేజికి వెళ్లిన నీటి మ‌ట్టంను కాద‌ని నీటిని తోడేందుకు ప్ర‌స్తుతం వీలులేకుండా ఇరు రాష్ట్రాలు చేశాయి. మ‌హాశివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు హాజ‌రయ్యే భ‌క్తులు స్నానం చేయ‌డానికి కూడా సౌక‌ర్యం లేకుండా జ‌లాశ‌యం నీటిని తోడేశారు. ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు మ‌హాశివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. స్నాన ఘ‌ట్టాల్లో నీళ్లు లేక‌పోవ‌డంతో జ‌ల్లు స్నానానికి ఏర్పాట్లపై ఆలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు.గ‌త ఏడాది ఏప్రిల్ నుంచి చూసుకుంటే శ్రీశైలం జలాశయంలోకి మొత్తం 1,118 టీఎంసీల నీరు వచ్చింది. దిగువనున్న నాగార్జునసాగర్, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా తదితర ప్రాజెక్టులకు 1,086 టీఎంసీల నీటిని విడుదల చేయ‌డం జ‌రిగింది. పెద్ద ఎత్తున జలవిద్యుత్ ను ఉత్పత్తి చేయడం కోసం ఇష్టానుసారంగా నీటిని తోడేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. ప్రస్తుతం కేవ‌లం 804.60 అడుగులు మాత్ర‌మే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఒక‌ప్పుడు 823 అడుగులు ఉన్న‌ప్పుడు అసెంబ్లీలో విస్తృతంగా చ‌ర్చ జ‌రిగింది. కానీ, ఇప్పుడు 804 అడుగులు మాత్ర‌మే ఉండ‌డం శ్రీశైలం చ‌రిత్ర‌లో అట్ట‌డుగు మ‌ట్టంకు నీళ్లను తోడేశారు. జ‌లాశ‌యంలో 215.80 టీఎంసీల నీటి సామర్థ్యం 31.35 టీఎంసీలకు తగ్గింది. ఎడమగట్టు కేంద్రం నుంచి 386 టీఎంసీలు, కుడిగట్టు కేంద్రం నుంచి 252 టీఎంసీలను కేవలం విద్యుదుత్పత్తికి వినియోగించి రెండు రాష్ట్రాలు తాగునీటి స‌మ‌స్య‌ను సృష్టిస్తున్నాయి. ఒక వేళ స‌కాలంలో వ‌ర్షాలు ప‌డ‌ని ప‌రిస్థితి వ‌స్తే ఈసారి మంచినీళ్లు క‌ష్ట‌మే.

2014 ఎన్నిక‌ల త‌రువాత కృష్ణా న‌దిపై ఇరు రాష్ట్రాల పోలీసులు మోహ‌రించిన దృశ్యాల‌ను చూశాం. నీటి వాటాల విష‌యంలో ఏపీ, తెలంగాణ మ‌ధ్య వివాదం ఉంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇరు రాష్ట్రాల‌మ‌ధ్య సెంటిమెంట్‌ను తీసుకురావ‌డానికి తిరుగుల‌ని అస్త్రంగా కృష్ణా న‌ది నీటి వాటా బాగా ఉప‌యోగ‌ప‌డుతోంది. 2019 ఎన్నిక‌ల త‌రువాత కేసీఆర్, జ‌గ‌న్ ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో పాల‌న సాగించాల‌నిభావించారు. గోదావ‌రి న‌దిపై ఇరు రాష్ట్రాల క‌లిసి పెద్ద
ప్రాజెక్టును తీసుకురాల‌ని ప్లాన్ చేశారు. అందుకోసం ఇరు రాష్ట్రాల ఇరిగేష‌న్ అధికారులు ప‌లుమార్లు స‌మావేశం అయ్యారు. కానీ, ఎవ‌రి వాద‌న వాళ్లు వినిపించ‌డంతో కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ‌ల‌ను ఏపీ ఇంజ‌నీర్లు తిప్పికొట్టారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం స్నేహ‌హ‌స్తం కేసీఆర్ కు అందిస్తున్నాడు. ఇద్ద‌రు సీఎంల మ‌ధ్య వివాదాలు లేవు. కానీ, ఎన్నిక‌ల నాటికి సెంటిమెంట్ ను ర‌గ‌ల్చ‌డానికి అనువైన ప‌రిస్థితుల‌ను కేసీఆర్ తీసుకొస్తున్నాడ‌ని టాక్ నడుస్తోంది. అందుకు, ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా స‌హ‌కారం అందిస్తాడ‌ని స‌మాచారం. మొత్తం మీద సెంటిమెంట్ రూపంలో మ‌రోసారి నీళ్లు, నిధులు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాబోతున్నాయ‌న్న‌మాట‌.