CM Chandrababu: పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచక పాలన నుంచి బయటపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం నాడు ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రజల వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురికి సాయం అందించారు. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంనుంచి ఇప్పటివరకు పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు జరగడం లేదు. ప్రజలను బెదిరించడం, అభ్యర్థులను పోటీకి భయపడేలా చేయడం అనేది సర్వసాధారణంగా మారింది. కానీ ఈసారి ప్రజలు ధైర్యంగా నిలబడారు. 11 మంది అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేశారు. ఇది నిజమైన ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం అని చంద్రబాబు తెలిపారు.
Read Also: MLC post : కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ల ఎమ్మెల్సీ పదవులు రద్దు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఈసారి పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు. ఇది శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా ఓటేయగలిగారని నిరూపిస్తోంది. జగన్ ఇప్పుడు అసహనంతో ఉన్నారు. ఎందుకంటే ఆయనకు అలాంటి గూండా రాజకీయాలు లేకుండా ఎన్నిక జరిగితే ఫలితం ఏమవుతుందో తెలుసు. పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి పనిచేయాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు, ప్రజల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గత పాలనలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని, ఇప్పుడు సంక్షేమ పాలనను అందించడమే లక్ష్యంగా తీసుకున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల పరిస్థితిపై స్పందించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉన్నదని చెప్పారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పరిస్థితి విషమంగా మారింది. కొన్ని ప్రదేశాల్లో జననష్టాలు సంభవించాయి, ఇది అత్యంత బాధాకరం అన్నారు చంద్రబాబు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లాల వారీగా మంత్రులు పరిస్థితిని సమీక్షిస్తూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారని వెల్లడించారు. వర్షాల కారణంగా నష్టాన్ని తగ్గించేందుకు ఎక్కడికక్కడ వెంటనే చర్యలు చేపట్టాలి. అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు. ప్రజల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా చూడటం ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యతగా పేర్కొన్న సీఎం చంద్రబాబు, అన్ని విభాగాలు సమన్వయంగా పనిచేయాలని సూచించారు.
Read Also: Indus Waters Treaty : భారత్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం..