Jagan : ఎమ్మెల్యేల‌కు గ్రాఫ్ ద‌డ‌! ముగిసిన డెడ్ లైన్, 70 మందికి మూడిన‌ట్టే..!

రాజే మొండోడైతే..రాజ్యం ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఇప్పుడు

  • Written By:
  • Publish Date - February 11, 2023 / 01:12 PM IST

మొండోడు రాజుకంటే బ‌ల‌మైనోడ‌ని సామెత‌. రాజే మొండోడైతే..రాజ్యం ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఇప్పుడు ఏపీ ప‌రిపాల‌న(Jagan) తీసుకుంటే ఇంచుమించు ముత‌క సామెత‌ను అటూఇటూ చేసి చూడొచ్చు. `వై నాట్ 175` దిశ‌గా వెళుతోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అడ్డొచ్చినోళ్ల‌ను తొల‌గించుకుంటున్నారు. స‌ర్వేల‌ను(Survey) ముందుపెట్టుకుని ఎన్నిక‌ల పోస్ట్ మార్టం చేస్తున్నారు. మ‌రో ఛాన్సో కోసం తెగిస్తున్నారు. ఈ ఛాన్స్ మిస్సైతే, ఇక రాజ్యం శాశ్వ‌తంగా చేజారిన‌ట్టేన‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే, మొండోడుగా పేరున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎడాపెడా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. వాటిని `సైకో` చేష్ట‌లుగా ప్ర‌త్య‌ర్థులు ప్ర‌చారం చేస్తున్నారు. ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో స్వ‌ప‌క్షంలోనూ అదే వాయిస్ వినిపిస్తోంది.

`వై నాట్ 175` దిశ‌గా వెళుతోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan)

వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఫేస్ చేయ‌డానికి గృహ సార‌థుల‌ను నియ‌మించాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) దిశానిర్దేశం చేశారు. ఆ మేర‌కు ఎమ్మెల్యేల‌కు టార్గెట్ పెట్టారు. దాన్ని చేరుకోవ‌డానికి చాలా మంది నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 50శాతం మంది కూడా ఆయ‌న పెట్టిన లక్ష్యాన్ని చేరుకోలేక‌పోయార‌ట‌. అందుకే ఆయ‌న పెట్టిన ఫిబ్ర‌వ‌రి 10 డెడ్ లైన్ ను ఈనెల 20వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. అంతేకాదు, ఈనెల 20వ తేదీ నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు `జ‌గ‌న‌న్నే మా ధైర్యం` అనే స్టిక్క‌ర్ ను ప్ర‌తి ఇంటికి అతికించాల‌ని వాళ్ల‌కు టార్గెట్ పెట్టారు. దీంతో ఎమ్మెల్యేలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎప్పుడు ఎవ‌ర్ని ప‌క్క‌న పెడ‌తారో తెలియ‌ని ఆయోమ‌యం వైసీపీలో నెల‌కొంది.

Also Read : Jagan : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 100 అబ‌ద్ధాలు! కాలం చెల్లిన `వైఎస్` విశ్వ‌స‌నీయ‌త !!

సుమారు 70 మంది ఎమ్మెల్యేలు, 12 మంది మంత్రుల‌ను ప‌క్క‌న పెట్టేయాల‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఆ మేర‌కు సంకేతాలు ఇచ్చార‌ట‌. ఇద్ద‌రు మంత్రులు ప‌నికి త‌క్కువ ప్ర‌చారం ఎక్క‌వ‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చుర‌క‌లు కూడా వేశార‌ట‌. ఆ ఇద్ద‌రు మంత్రి రోజా, అంబ‌టి రాంబాబు అన్న‌ట్టు పార్టీలో అంత‌ర్గ‌తంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాళ్లిద్ద‌రికీ టిక్కెట్ డౌట్ గా చెప్పుకుంటున్నారు. ఇలాంటి క‌ఠిన నిర్ణ‌యాలు చాలా ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌. ఈనెల 20వ తేదీ నాటికి గృహ‌సార‌థుల‌ను పూర్తిగా నియ‌మించకుండా ఉన్న ఎమ్మెల్యేల‌ను దూరంగా పెడ‌తార‌ని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 ల‌క్ష‌ల మంది గృహ సార‌థుల‌ను నియ‌మించేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan)నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌తి 50 మంది ఓట‌ర్ల‌కు ఇద్ద‌రు గృహ‌సార‌థులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

గృహ‌సార‌థుల‌ను నియ‌మించకుండా ఉన్న ఎమ్మెల్యేల‌ను దూరంగా పెడ‌తార‌ని..(Survey)

ఓట‌ర్ల నాడిని(Survey) తెలుసుకుని వాళ్ల అవ‌స‌రాల‌ను తీర్చ‌డం గృహ సార‌థుల విధి. అంతేకాదు, ప్ర‌త్య‌ర్థి ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డం, సామ‌దాన‌దండోపాయాల‌ను ఉప‌యోగించ‌డం ద్వారా ప్ర‌త్య‌ర్థి పార్టీల సానుభూతిప‌రుల‌ను టార్గెట్ చేయ‌డం ల‌క్ష్యం. ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వ‌డానికి వైసీపీ అధిష్టానం సిద్ధ‌మ‌వుతోంది. ఈనెల 20వ తేదీ నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు `జ‌గ‌నన్న మా ధైర్యం` స్టిక్క‌ర్ల‌ను ప్ర‌తి ఇంటికి వేసిన త‌రువాత గృహ‌సార‌థులు ఏమి చేయాలి? అనేదానిపై బ్లూ ప్రింట్ ను వైసీపీ అధిష్టానం త‌యారు చేసింది. దాని ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌లను ఫేస్ చేయాల‌ని దిశానిర్దేశం చేయ‌నున్నారు. పోలింగ్ కేంద్రం వ‌ర‌కు ఓట‌ర్ల‌కు ఎలా తీసుకురావాలి? వైసీపీకి ఓటు ఎలా వేయించాలి? అనే దానిపై క‌ఠిన శిక్ష‌ణ తాడేప‌ల్లి లీడ‌ర్లు ఇవ్వ‌డానికి సిద్ద‌మ‌య్యారు.

Also Read : Jagan-KCR : మోసం గురూ..! అన్న‌ద‌మ్ముల రాజ‌కీయ చ‌తుర‌త‌!!

పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వం టీచ‌ర్లు ఉన్నార‌ని తెలుసుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan) వ్యూహాత్మ‌కంగా వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టేశారు. కేవ‌లం బోధ‌న వ‌ర‌కు ప‌రిమితం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల‌ను శాసిస్తామ‌ని చెప్పుకునే 1.9ల‌క్ష‌ల టీచ‌ర్ల కోర‌లు పీకేశారు. వాళ్ల స్థానంలో 1.6ల‌క్ష‌ల మంది గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బందిని సిద్దం చేస్తున్నారు. వాళ్లంతా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత ప్ర‌భుత్వం ఉద్యోగం పొందిన వాళ్లు. మెజార్టీ ఉద్యోగులు వైసీపీ సానుభూతిప‌రులుగా ఉంటార‌ని ఆ పార్టీ అభిప్రాయం. ప్ర‌స్తుతం గ్రామ‌, వార్డు స‌చివాల‌య వలంటీర్లుగా ప‌నిచేస్తోన్న వాళ్ల‌ను కూడా ఎన్నిక‌ల‌కు ఉప‌యోగించుకోవాల‌ని వైసీపీ భావించింది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన టీడీపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్ల‌ను ఎన్నిక‌ల విధుల నుంచి దూరంగా ఉంచాల‌ని ఆదేశించింది. దీంతో ప్ర‌త్యామ్నాయంగా గృహ సార‌థుల‌ను త‌యారు చేస్తోంది. వ‌లంటీర్ల స‌హాయ‌, స‌హ‌కారాల‌తో గృహ‌సార‌థులు ఇక నుంచి వైసీపీ త‌ర‌పున రాజ‌కీయంగా రెచ్చ‌పోవ‌డానికి సిద్ద‌మ‌వుతున్నార‌న్న‌మాట‌.

ఈనెల 13వ తేదీన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కో ఆర్డినేట‌ర్ల‌తో కీల‌క స‌మావేశం 

ఈనెల 13వ తేదీన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan) ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కో ఆర్డినేట‌ర్ల‌తో కీల‌క స‌మావేశం జ‌ర‌ప‌నున్నార‌ని తెలుస్తోంది. ఆ సంద‌ర్భంగా వాళ్ల గ్రాఫ్ ను(Survey) బ‌య‌ట పెట్ట‌నున్నారు. అంతేకాదు, గృహ సార‌థుల‌ను నియ‌మించుకోలేని ఎమ్మెల్యేల‌కు క్లాస్ తీసుకోబోతున్నారు. గ‌తంలో జ‌రిగిన రివ్యూ త‌రువాత గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం ప్రోగ్రామ్ నడిచింది. కొంద‌రు ఎమ్మెల్యేలు మాత్ర‌మే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌గ‌లిగారు. చాలా మంది ప్ర‌జ‌ల మ‌ధ్య వెళ్ల‌లేక ఆ ప్రోగ్రామ్ కు దూరంగా ఉన్నారు. కొన్ని ధైర్యంగా ముందుకెళ్లిన ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌లు నిల‌దీశారు. ఇలాంటి పరిణామాల మ‌ధ్య ఎమ్మెల్యే గ్రాఫ్ చాలా వ‌ర‌కు ప‌డిపోయింది. వాళ్లంద‌రికీ చివ‌రి వార్నింగ్ అంటూ ఇటీవ‌ల ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ వాళ్ల‌లో మార్పు పెద్ద‌గా రాలేద‌ని తెలుస్తోంది. దీంతో ఈనెల 13వ తేదీన జ‌రిగే రివ్యూలో వాళ్ల‌కు ఉద్వాస‌న పల‌క‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధ‌మ‌వుతున్నారని వినికిడి. మొత్తం మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించే గ్రాఫ్ ద‌డ వైసీపీ ఎమ్మెల్యేల్లో మొద‌లైయింది.