Jagan Govt: ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోలేదు.. తాము చేసిన అప్పులు తక్కువే అన్న జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది అన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఏపీ సర్కార్ నానా తిప్పలూ పడుతోంది.

  • Written By:
  • Publish Date - June 25, 2022 / 10:22 AM IST

ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది అన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఏపీ సర్కార్ నానా తిప్పలూ పడుతోంది. ఆ ప్రచారమంతా అవాస్తవమని చెప్పడానికి ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లెక్కల మాస్టారయ్యారు. ఒకవేళ ప్రతిపక్షం ఆరోపణలు నిజమైతే.. 2021-2022 ద్రవ్యలోటు 2.10 శాతంగా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఎప్పుడూ నాలుగు శాతానికి తక్కువ లేని ద్రవ్యలోటు.. ఇప్పుడు ఎలా తగ్గిందో చూసుకోవాలన్నారు.

గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం సగటున 19.46 శాతం కొత్త అప్పులు తీసుకువచ్చిందని.. తాము మాత్రం 15.77 శాతమే తెచ్చామన్నారు ఆర్థికమంత్రి. అలాంటప్పుడు ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా శ్రీలంకలా ఏపీ ఎలా మారుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో పన్నుల వసూళ్లు పెరుగుతున్నాయంటే దాని అర్థం ఆర్థిక వృద్ధి ఉన్నట్టే కదా అని బుగ్గన అన్నారు. అంతెందుకు.. ఉపాధి హామీ పథకం కింద టీడీపీ సర్కారు అయిదేళ్ల కాలంలో రూ.27,340 కోట్లతో పనులు చేసిందని.. తాము మాత్రం మూడేళ్లలోనే.. రూ.27,448 కోట్లతో పనులు చేశామన్నారు.

టీడీపీ హయాంలో జీతాల చెల్లింపునకు సగటున 10 రోజులు పడితే.. తాము మాత్రం 3 నుంచి 4 రోజుల్లోనే అకౌంట్లలో వేస్తున్నామన్నారు. మరి ఆర్థిక పరిస్థితి అంత బాగా ఉంటే.. జీతాలు ఎందుకు సరైన సమయానికి ఇవ్వడం లేదు అన్న ప్రశ్నకు బుగ్గన ఇచ్చిన జవాబు ఇదే. ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ.. ఏడో స్థానానికి వెళ్లగలిగిందన్నారు. ఇక టీడీపీ హయాంలో 2018-19 బడ్జెట్ అంచనాల్లో 86.25 శాతం ఖర్చు చేసిందని.. తాము మాత్రం 2021-22 బడ్జెట్ అంచనాల్లో 96 శాతం ఖర్చుపెట్టామన్నారు.